దేశంలోనే కూల్ రూఫ్ పాలసీని ప్రారంభించిన మొదటి స్టేట్ తెలంగాణ: KTR

by Satheesh |
దేశంలోనే కూల్ రూఫ్ పాలసీని ప్రారంభించిన మొదటి స్టేట్ తెలంగాణ: KTR
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాజకీయాల కోసం పాలసీ తేవడం లేదని.. భవిష్యత్ తరం కోసం కూల్ రూఫ్ పాలసీని తీసుకొచ్చామని, నాలుగుఓట్లు.. సీట్లు తెచ్చే కార్యక్రమం కాదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆదాయం కోసం ఈ పాలసీ తేవడం లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌తో పాటు వరంగల్, రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో అమలు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంకు సమీపంలోని సీడీఎంఏ భవన్‌లో సోమవారం ‘తెలంగాణ కూల్ రూఫ్ పాలసీ-2023-28 ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో అత్యధిక ఆఫీస్ స్పెస్ అబ్జాప్సన్ హైదరాబాద్‌లోనే ఉందని.. ‘మన హైదరాబాద్ స్టోరీ ఇప్పుడే మొదలైందని, టీఎస్‌ బీపాస్‌తో దేశంలో ఎక్కడలేని విధంగా భవన నిర్మాణ అనుమతులు ఇస్తున్నామని’ వెల్లడించారు. కూల్ రూఫ్ పాలసీకి చదరపు మీటర్‌కు రూ.300 మాత్రమే ఖర్చు అవుతుందని, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కూల్ రూఫ్ పాలసీ తెస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలు దేశంలో ఎక్కడా లేవని, చెన్నై, బెంగళూరులో బిల్డింగ్ పర్మిషన్‌ల కోసం ఏం చేయాలో ఇక్కడ ఉన్న బిల్డర్లకు తెలుసు అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా 240 కోట్ల మొక్కలు నాటి సంరక్షిస్తున్నామని చెప్పారు.

దేశంలోనే కూల్ రూఫ్ పాలసీని ప్రారంభించిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని, భవిష్యత్తులో ఎదురయ్యే వాతావరణ సవాళ్లను ఎదుర్కొనే దిశలో ఇది సరైన ముందడుగు అన్నారు. పాలసీ చల్లని పైకప్పుల వినియోగాన్ని ప్రోత్సహిస్తుందన్నారు.ఈ పైకప్పులు సూర్యుని యొక్క ఇన్‌కమింగ్ రేడియేషన్‌లో కొంత భాగాన్ని తిరిగి వాతావరణంలోకి ప్రతిబింబిస్తాయని, తద్వారా వేడి నిలుపుదలని తగ్గిస్తూ చల్లబరుస్తుందన్నారు. ఈ ఏడాది హైదరాబాద్‌లో 5 చదరపు కిలోమీటర్ల కూల్‌ రూఫ్‌ అమలుచేస్తామని, డబుల్‌ బెడ్‌రూం ఇండ్లన్నిటిపై కూల్‌ రూఫ్‌ అమలు చేస్తామన్నారు.

2030 నాటికి రాష్ట్రంలో 200 చదరపు కిలోమీటర్లు, మిగతా ఏరియాలో 100 చదరపు కిలోమీటర్లు కూల్ రూఫింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 600 చదరపు గజాలు, అంతకంటే ఎక్కువ స్థలంలో కట్టే భవనాలకు కూల్‌ రూఫ్‌ ఏర్పాటును తప్పనిసరి చేస్తామని వెల్లడించారు. కూల్‌రూఫ్‌ వల్ల మీటరుకు రూ.300 మాత్రమే ఖర్చవుతుందని చెప్పారు. త్వరలోనే మననగరం కార్యక్రమం ప్రారంభిస్తామని వెల్లడించారు. బిల్డింగ్ నిర్మాణ వ్యర్థాల రీయూజ్ చేయడానికి బిల్డర్లు సహకరించాలని కోరారు.

ఔటర్ రింగ్ రోడ్ కింద ఉన్న ప్రాంతం 1000 చదరపు కిలోమీటర్లకు పైగా ఉందని, ఏఆర్ఆర్ లోపల 20శాతం ప్రాంతాన్ని కూల్ రూఫింగ్ కిందకు తీసుకువస్తామని, ప్రభుత్వ హౌసింగ్ స్కీములు, ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు, పేవ్‌మెంట్లు మరియు సైక్లింగ్ ట్రాక్‌లలో దీనిని అమలు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ఆశయమని వెల్లడించారు. సూర్యరశ్మిని ప్రతిబింబించేలా పెయింట్స్, టైల్స్ లేదా ఇతర పదార్థాలను ఉపయోగించడం ద్వారా కూల్ రూఫింగ్‌ను అమలు చేయవచ్చు అన్నారు. కూల్ రూఫ్‌ల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించేందుకు ప్రచార కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. కూల్ రూఫింగ్ చేసుకుంటే అందుకు చేసిన ఖర్చు రెండేళ్లలోనే కరెంట్ బిల్లుల ఆదా రూపంలో తిరిగి వస్తుంది ... ఇప్పటికే కట్టిన బిల్డింగ్ లకు ఎట్లా రెట్రో ఫిట్టింగ్ చేయాలో జీహెచ్ ఎంసీ, మున్సిపల్ అధికారులు అవగాహన కల్పించాలన్నారు.

సీపీఆర్ పై ప్రతి అపార్ట్మెంట్ వాసులకు శిక్షణ ఇవ్వాలన్నారు.హైదరాబాద్ లో 500 ఎలక్ట్రిక్ బస్సులు తెస్తున్నామని, ప్రజలు ఎలాక్ట్రిక్ వెహికిల్స్ ఉపయోగించే లా ప్రోత్సహిస్తామన్నారు.కూల్ రూఫ్ కోసం ముందుకొచ్చేవారికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఏ పథకం అయినా విజయవంతం అవుతుందన్నారు. టౌన్ ప్లానింగ్, మున్సిపల్ కమిషన్లు ఇతర అధికారులకు అనుమానాలు వృత్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కూల్‌రూఫ్‌ల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని, అనుసరించేవారికి ప్రోత్సాహకాలు ఇస్తామని వెల్లడించారు.

పాలసీలు, చట్టం చేయడం చాలా సులువని, కానీ వాటిని అమలు చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని అన్నారు. భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్‌కు హైదరాబాద్‌లో ఫతుల్ గూడ, జీడిమెట్లలో రెండు ప్లాంట్‌లు ఏర్పాటుచేశామని, మరో నాలుగు ప్రారంభించబోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషనల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ వెంకటేశ్ నేత, అధికారులు పాల్గొన్నారు.

కూల్ రూఫ్ విధానం..

కూల్ రూఫ్ పాలసీ అంటే ఇంటిని చల్లబర్చడం. ఈ పాలసీతో నిర్మించే పై కప్పు వల్ల గది ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతాయి. ఆధునిక సాంకేతికతతో పై కప్పులకు ఉపయోగించే సామగ్రిలో కొన్ని మార్పులు చేయడం, ప్రత్యేక రసాయనాల వినియోగంతో 5 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత తగ్గుతుందని అంచనా, దీని వల్ల సూర్యకిరణాలు తిరిగి వాతావరణంలోకే పరావర్తనం చెందడం ద్వారా ఇంటి లోపలకు వేడి రావడం తగ్గుతుంది. ఇప్పటికే నిర్మించిన భవనాలపై కూల్ రూఫ్ ఏర్పాటుకు పలు పద్దతులున్నాయి. శ్లాబ్ పైన కూల్ పోయింట్ వేయడం, వినైల్ షీట్లను పర్చడం, టైల్స్ వేసుకోవడం, భవనాల పైన మొక్కల పెంపకం, సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటు వంటి చర్యలతో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. అయితే డబుల్ బెడ్రూం ఇంటికి కూల్ రూప్ పాలసీతో 20వేలకు పైగా అదనపు భారం పడనుందని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed