‘దేశానికే రోల్ మోడల్ తెలంగాణ’

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-02 09:15:31.0  )
‘దేశానికే రోల్ మోడల్ తెలంగాణ’
X

దిశ, కరీంనగర్​ బ్యూరో: తొమ్మిది ఏళ్ల కాలంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్​ సారథ్యంలో తెలంగాణ దేశానికి రోల్​ మోడల్​గా నిలిచిందని మంత్రి కేటీఆర్​ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం రాజన్న సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి కేటీఆర్​ ముఖ్య​ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. రాజన్న సిరిసిల్ల ప్రగతిని వివరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పోరాటాలు, త్యాగాలతో, ప్రజాస్వామ్య పంథాలో సాగిన స్వరాష్ట్ర సాధన మహోద్యమంలో పాలుపంచుకున్న వారందరికీ శుభాభివందనాలు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రాణాలు సైతం త్యాగం చేసిన అమరవీరులందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ఉత్సాహపూరిత వాతావరణంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం తొమ్మిదేండ్ల స్వల్పకాలంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకున్నదని అన్నారు. ప్రజా సంక్షేమంలోనూ, అభివృద్ధిలోనూ యావత్ దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచిందని కేటీఆర్​ అన్నారు. నిర్మాణాత్మకమైన ఆలోచన, దార్శనికమైన ప్రణాళికా రచన, పారదర్శకమైన పరిపాలన వ కలయిక అయిన 'తెలంగాణ మోడల్' నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందుతుందని కేటీఆర్​ అన్నారు.

ఆర్థిక మాంద్యం, కరోనా వంటి సంక్షోభాలు ఎదురైనప్పటికీ తట్టుకొని తెలంగాణ బలీయమైన ఆర్థిక శక్తిగా నిలబడగలిగిందని అన్నారు. సంక్షోభ సమయాలలోనూ సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ చేస్తూ ప్రజా సంక్షేమ పథకాలను భారీ ఎత్తున నిరాటంకంగా అమలు చేయగలగడం తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని సామాజికవర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ సమగ్రాభివృద్ధిని సాధిస్తూ ముందుకు సాగుతున్నామని కేటీఆర్​ అన్నారు.

Also Read..

తెలంగాణ సాధించుకున్నది ఇందుకేనా: కేంద్రమంత్రి

Advertisement

Next Story

Most Viewed