Telangana High Court: మిస్టర్ రంగనాథ్.. ‘రూల్ ఆఫ్ లా’ ఫాలో అవ్వు

by Gantepaka Srikanth |
Telangana High Court: మిస్టర్ రంగనాథ్.. ‘రూల్ ఆఫ్ లా’ ఫాలో అవ్వు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘‘మిస్టర్ రంగనాథ్.. చెరువుల పరిరక్షణ పేరిట హైడ్రా ఏ కట్టడం కూల్చినా ‘రూల్ ఆఫ్ లా’ ఫాలో కావాల్సిందే. ఎటువంటి కూల్చివేతకైనా.. డ్యూ ప్రొసిజర్ పాటించాల్సిందే. మీ పొలిటికల్, ఎగ్జిగ్యూటివ్ బాసులను సంతృప్తి పరిచేందుకు చట్టాన్ని ఉల్లంఘించి కూల్చివేత చేపడితే న్యాయస్థానం చూస్తే ఊరుకోదు. మీరు నిజంగా చెరువులు, లేక్‌లు పరిరక్షిస్తాం.. అందుకోసం మీరు నిజంగా పని చేస్తే.. రూల్ ఆఫ్ లాను అమలు చేస్తే మీకు మా(హైకోర్టు) మద్దతు తప్పకుండా ఉంటుంది. చెరువుల పరిక్షణ పేరిట తాము ఏదైనా కూల్చేస్తాం అంటే మాత్రం సహించేది లేదు. ఇదివరకు ఇదే న్యాయస్థానం కూల్చివేతలపై ఇచ్చిన ఆదేశాలు చదివే ఓపిక, తీరిక మీకు ఎందుకు లేవు’’ అంటూ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం హైడ్రా కమిషనర్ రంగానాథ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

అమీన్ పూర్ కూల్చివేతకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. కూల్చివేతల్లో రూల్ ఆఫ్ లా ఫాలో కాకుంటే.. చర్లపల్లి జైలు లేదా చంచల్ గూడ జైలుకో పంపించాల్సి ఉంటుందని హెచ్చరించింది. అయితే, స్థానిక రెవెన్యూ సిబ్బంది అడిగితేనే.. తాము కూల్చివేతకు సంబంధించిన సిబ్బంది, వాహనాలు పంపించామని.. తమకు చట్టం మీద అపారమైన గౌరవం ఉందని హైడ్రా కమిషనర్ సమాధానం ఇవ్వబోతుండగా.. హైకోర్టు న్యాయమూర్తి జోక్యం చేసుకొని తీవ్రంగా స్పందించారు. చార్మినార్ ఏరియా ఎమ్మార్వో హైడ్రాను సంప్రదించి.. హైకోర్టు భవనం కూల్చాలని అడిగితే.. ఏం వెరిఫై చేసుకోకుండా కూల్చివేసేందుకు సిబ్బంది, వాహనాలు పంపిస్తారా? సదరు ఎమ్మార్వో అడిగిన ప్రాంతంలో ఉన్నది నిజంగా అక్రమ కట్టడమా? ఎఫ్టీఎల్‌లో ఉన్నదా? బఫర్ జోన్‌లో ఉన్నదా? నిజంగా ఉన్నా.. కూల్చివేత ప్రక్రియలో భాగంగా.. రూల్ ఆఫ్ లా కింది స్థాయిలో రెవెన్యూ అధికారులు ఫాలో అయ్యారా? అన్నది చూసుకోరా అంటూ ప్రశ్నించారు. ఇంత గుడ్డిగా సిబ్బంది, కూల్చివేసే వాహనాలు పంపిస్తూ.. హైడ్రా అనుమతులు ఇవ్వడం ఏంటని నిలదీశారు.

రూల్ ఆఫ్ లా పాటించకపోవడం.. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆర్డర్లు అమలు చేయకపోవడంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్, అమీన్ పూర్ ఎంఆర్ఓ రాధపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శని, ఆదివారాల్లో రాత్రిపూట, పొద్దుగాల టిఫిన్ కూడా చేయకముందు కూల్చివేతలు చేపట్టరాదన్న ప్రాథమిక విషయం తేలియదా అంటూ కోర్టు ప్రశ్నించింది. హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి ఇలాగే వ్యవహరిస్తే స్థానిక ఎంఆర్ఓ జైలుకు వెళ్తారని మందలించింది. కూల్చివేతలపై హైడ్రా నిబంధనలు చదివారా? ఇదే అంశంపై హైకోర్టు ఆర్డర్లను తెలుసుకునే ప్రయత్నం చేశారా? కనీసం ఆ అంశాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఎలా కూల్చుతారని ప్రశ్నించారు. ఎవరైనా ఎంఆర్ఓ లేదా కలెక్టర్ కూల్చివేతలకు హైడ్రాను సాయం అడిగితే.. అన్ని రికార్డులు వెరిఫై చేసిన తర్వాతనే సహకరించాలని ఆదేశించింది. ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో పని చేస్తున్న ఉద్యోగులుగా మీకు మంచి భవిష్యత్ ఉందని.. రాజకీయ, కార్యనిర్వాహక విభాగానికి చెందిన పెద్దల ప్రభావంలో రూల్ ఆఫ్ లా ఫాలో అవకుండా చర్యలు తీసుకొని మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హెచ్చరించింది. చెరువులు, లేక్ లు, ప్రభుత్వ భూములను రక్షించేందుకు మీరు పాటిస్తున్న విధానం సహేతకం కాదని.. చట్టాలను, తీర్పులను ఉల్లంఘిస్తూ ఏం సాధిద్దామనుకుంటున్నారని ప్రశ్నించింది. రాత్రికి రాత్రే హైదరాబాద్ అంతా మారిపోతుందని అనుకోవడం భ్రమని అన్నారు.

మన దేశంలో భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉందని.. సాధారణంగా సహజ న్యాయ సూత్రాలూ ఉంటాయన్న అవగాహన ఉందా అని నిలదీసింది. ఒక వ్యక్తికి చట్టపరంగా ఉరి వేసే ముందు కూడా చనిపోయే ముందు చివరి కోరిక ఏంటని అడుగుతారని… అదే మాదిరి ఒక వ్యక్తి ఏ విధంగా భవనం నిర్మించుకున్నా.. కూల్చేముందు ఆ బల్డింగ్ ఓనర్ కి కనీసం నోటీసు ఇవ్వరా? దానికి స్పందించేవరకు ఆగలేరా? ఇదే కేసులో విద్యుత్ కనెక్షన్ కట్ చేయడంపై స్టే ఉందని పేర్కొంది. భవన నిర్మాణ అనుమతుల రద్దుపై న్యాయస్థానం స్టే ఉందని గుర్తు చేశారు. అవేవీ పట్టించుకోకుండా ఎలా కూలుస్తారని హైకోర్టు మందలించింది. శనివారం సాయంత్రం 18 గంటల్లో ఖాళీ చేయాలని నోటీసు ఇచ్చి గడువు పూర్తికాకముందే ఆదివారం ఉదయం 7.30 గంటలకు కూల్చివేయడం… ఎంఆర్ఓ ఆదివారం ఉదయం టిఫిన్ చేయకుండా విధుల్లోకి వెళ్ళి మరీ కూల్చేంత పర్సనల్ ఇంటరెస్ట్ ఎందుకంటూ గట్టిగా ప్రశ్నించింది. ఉదయం 7.30 కూల్చడం అంటే, కక్షతో.., కుట్రపూరితంగా చేపట్టిన చర్య కాదా? సర్వే చేయకుండా.. నోటీసు ఇవ్వకుండా చర్యలు తీసుకుంటారా? రానున్న రోజుల్లో ఇదే మాదిరి చేస్తే… తాము సూమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసి విచారణ చేస్తామని హెచ్చరించింది. స్థానిక ఎంఆర్ఓకి సర్వే ఏంటో తెలుసా? ఎలా చేయాలో తెలుసా? హైడ్రా ఏర్పాటు జీవో 99లో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా చర్యలు తీసుకున్నారని.. జీవోలో ఆదివారం కూల్చివేతలు చేపట్టరాదని చాలా స్పష్టంగా ఉందని మండిపడింది.

హైడ్రాకి కూల్చివేతలు తప్ప మరేం తెల్వదా?

ఇటీవల కాలంలో హైడ్రా కేవలం కూల్చివేతలకు మాత్రమే పాపులర్ అవుతుందని.. హైడ్రాకు ట్రాఫిక్, డిజాస్టర్ మేనేజ్మెంట్ వంటి రెస్పాన్స్ బులిటీస్ ఉన్నాయని.. కానీ, వాటిపై హైడ్రా ఎందుకు ద్రుష్టి సారించడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. కేవలం కూల్చివేతలపై మాత్రమే ఎందుకు దృష్టి పెట్టారని నిలదీసింది. ట్రాఫిక్ నియంత్రణకు హైదరాబాద్ నగరంలో ఏం చర్యలు తీసుకుంటున్నారని అడిగింది. హైదరాబాద్ నగరంలోని ఎన్నో ప్రాంతాల్లో వాహనాలు గంటల కొద్దీ ట్రాఫిక్లో ఉండాల్సిన పరిస్థితి ఉందని అయినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అడిగింది. కేవలం కూల్చివేతలు, చెరువుల చుట్టుపక్కల భూములు కొనాలంటే భయపడాలి చెబుతున్నారని… మీరు(రంగనాథ్) ఈ సిటీ ప్రజలను భయభ్రాంతులను గురిచేయాలనుకుంటున్నారా? అదే మీకు అప్పజెప్పిన డ్యూటీ ఆ? సదరు వ్యక్తి నిజంగా చెరువును కబ్జా చేస్తే… రూల్ ఆఫ్ లా ఫాలో అయి కూల్చివేస్తే… తాము మద్ధతు ఇస్తామని…ఆ పనిని అప్రిషియేట్ చేస్తామని స్పష్టం చేసింది. కానీ హైడ్రా వ్యవహరిస్తున్న తీరు చాలా ఇబ్బందికరంగా ఉందని వెల్లడించింది. హైడ్రా వ్యవస్థను సవాల్ చేస్తూ… ఎన్నో పిటిషన్ దాఖలు అయ్యాయని… అవన్నీ పెండింగ్ లో ఉంచామని… మీరు ఇలాగే రూల్ ఆఫ్ లాను ఉల్లంఘిస్తే… ఆ జీవోపై స్టే ఇచ్చేందుకు కూడా వెనకాడమని హెచ్చరించింది. కాగా, తదుపరి విచారణను అక్టోబర్ 15కు హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. అంతవరకు స్టేటస్ కో కొనసాగించాలని… కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది వచ్చే విచారణకు వారిద్దరికి ప్రత్యక్ష హాజరునుంచి మినహాయింపు ఇచ్చింది.

ప్రభుత్వంలో ఒక శాఖ పర్మిషన్.. ఇంకో శాఖ కూల్చివేతనా?

తెలంగాణ ప్రభుత్వంలో శాఖల మధ్య సమన్వయం లేదా అంటూ హైకోర్టు ప్రవ్నించింది. మూసీ రివర్ బెడ్ ఖాళీ చేయిస్తామని… అందుకు అవసరమైన సర్వే చేపడుతుండటంపై హైకోర్టులో పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలు అవుతున్నాయని వెల్లడించింది. ఈ ఒక్క రోజే మూసీ కూల్చివేతలకు సంబంధించి 20 లంచ్ మోషన్ పిటిషన్లు వినేందుకు తాము అనుమతి ఇచ్చామని కోర్టు స్పష్టం చేసింది. సేల్ డీడ్, భవన నిర్మాణ అనుమతులు ఒక శాఖ ఇవ్వడం… ఇంకో శాఖ వచ్చి కూల్చివేయడం సరికాదని స్పష్టం చేసింది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లోపించడం సరికాదని చెప్పింది. అక్రమ నిర్మాణాలన్నీ తేల్చిన తర్వాత రిజిస్ట్రార్ ఎలా రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారని అడిగింది. పంచాయతీ, మున్సిపాల్టీ, జీహెచ్ఎంసీ ఎలా అనుమతులు ఇస్తాయని… ఒక శాఖ అనుమతులు ఇచ్చి, మరో శాఖ కూల్చివేయడం… అది కూడా రూల్ ఆఫ్ లా పాటించకుండా… ఏంటి ఇదంతా అంటూ మందలించింది. ఇప్పుడు కూల్చివేత చేపట్టిన బిల్డింగ్ లకు పర్మిషన్లు ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారా? వాటి స్టేటస్ ఏంటని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. వాటిపై పూర్తి వివరాలు తమకు సమర్పించాలని సమర్పించాలని పేర్కొంది.

బతుకమ్మ కుంట, నల్లకుంట అంటే తెలుసా?

మిస్టర్ కమిషనర్ మీకు బతుకమ్మ కుంట, నల్లకుంట అంటే తెలుసా? తాను 1983 నుంచి హైదరాాబాద్లో నివసిస్తున్నానని… హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. లక్ష్మణ్ ప్రశ్నించారు. అయితే, నేడు అక్కడ చెరువు లేదని జడ్జి సమాధానం ఇచ్చారు. చెరువులను కాపాడే ప్రక్రియ ఒక్క రోజులో జరిగేది కాదన్నారు. ఓఆర్ఆర్ పరిధిలో ఒక్క చెరువుకి సంబంధించి కూడా ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వలేదని.. ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వకుండా, అసలు సర్వే చేయకుండా అక్రమ నిర్మాణాలు అని ఎలా తెలుస్తారని నిలదీశారు. రూల్ ఆఫ్ లాతో ముందుకు వెళుతూ ఉన్న చెరువులను రక్షించాలని చెప్పారు. అయిత, జడ్జి ప్రశ్నకు సమాధానంగా… హైడ్రా కమిషనర్ స్పందిస్తూ… కుంట అంటే ఏంటో తనకు తెలుసు అని… కుంట అంటే పాండ్(చెరువు) అంటూ సమాధానం ఇచ్చారు. నగరంలో చెరువులకి సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చామని… మొత్తం 2,500 చెరువుల దాకా ఉన్నాయని, వాటి వివరాలు కోర్టుకు సమర్పిస్తానని అన్నారు.

ఎంఆర్ఓ అడిగితేనే బుల్డోజర్ వాహనాలు పంపించాం: కటిక రవీందర్ రెడ్డి, హైడ్రా వకీల్.

అమీన్ పూర్ ఎంఆర్ఓ రాధా కూల్చివేతలకు తమను వాహనాలను అడిగారని.. వారి వినతి మేరకే పంపించామని హైడ్రా తరఫు న్యాయవాది కటిక రవీందర్ రెడ్డి విచారణలో భాగంగా.. హైకోర్టుకి తెలిపారు. అయితే, ఆ ఎంఆర్ఓ రాధా... 20వ తేదీన ఖాళీ చేయాలన్న ఆదేశాలు ఇచ్చారని... 48 గంటల తర్వాత కూల్చివేత చేపట్టినట్టు చెప్పారు. అందుకే తాము వాహనాలు పంపామని తెలిపారు. కాగా, ఆమె ఆదివారం నాడు కూల్చివేతలు చేపడుతున్నట్టు తమకు తెలుపలేదని వివరించారు. తమకు చట్టం మీద న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉందని వెల్లడించారు. ఎంఆర్ఓ వినతి మేరకే తాము కూల్చివేతకు సహకరించామని దాంతోపాటు, మూసీ సుందరీకరణ, అక్కడే కూల్చివేతలు, నిర్వాసితుల తరలింపుపై హైడ్రాకు సంబంధం లేదని చెప్పారు.

కూల్చివేతలపై హైకోర్టు గతంలో ఏం చెప్పింది!

హైడ్రా వ్యవస్థ శరవేగంగా నగరంలో కూల్చివేతలు చేపడుతున్న నేపథ్యంలో… ఇటీవల కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా న్యాయస్థానం కూల్చివేతలకు సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఒక అంశం సబ్ జ్యూడిస్(కోర్టు విచారణలో… పరిధి) లో ఉండగా హైడ్రా లేదా రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టరాదని న్యాయస్థానం అందులో స్పష్టంగా పేర్కొంది. కాగా, ఈ అంశంలో మధ్యంతర ఉత్తర్వులు ఉండగా సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం కిష్టారెడ్డిపేట్ పంచాయతీ శ్రీకృష్ణనగర్ ప్లాట్ నెంబర్ 92 (సర్వే నెంబర్ 165, 166)లో ఉన్న ఒక ప్రయివేటు ఆసుప్రతి బిల్డింగ్‌ను గత ఆదివారం(సెప్టెంబర్ 22న తేదీన) రోజున ఉదయం 7 గంటల ప్రాంతంలో వచ్చి కూల్చి వేయడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆదివారం రోజు కూల్చివేతలు చేపట్టరాదని సుప్రీంకోర్టు, హైకోర్టు వేరు వేరు సందర్భాల్లో ఆర్డుర్లు ఇచ్చింది. అయినప్పటికీ, అమీన్ పూర్ ఎమ్మార్వో కూల్చివేత చేపట్టడంతో హైకోర్టు ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. ఏ అధికారంతో ఇలా చేస్తున్నారో స్వయంగా వివరణ ఇవ్వాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్, అమీన్ పూర్ ఎంఆర్ఓ రాధాకి ఆదేశాలు స్వయంగా లేదా వర్చువల్ గా హాజరు కావాలని ఆదేశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం అమీన్ పూర్ ఎంఆర్ఓ కోర్టుకు విచారణకు వచ్చేయగా, హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్‌గా కోర్టుకి ఎదుట హాజరైన విషయం విదితమే.

Advertisement

Next Story

Most Viewed