రాజకీయ రంగు పూయొద్దు.. నిష్పాక్షికంగా విచారణ జరుగుతోంది: DH

by GSrikanth |
రాజకీయ రంగు పూయొద్దు.. నిష్పాక్షికంగా విచారణ జరుగుతోంది: DH
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇబ్రహీంపట్నం ఘటనలో నిష్పాక్షికంగా విచారణ జరుగుతున్నదని డీహెచ్, ఎంక్వైరీ ఆఫీసర్​డాక్టర్ జీ.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఫోరెనిక్స్ నివేదిక వచ్చాకే ఫైనల్​రిపోర్టును వెల్లడిస్తామని ఆయన శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. ఆపరేషన్లు జరిగిన హాస్పిటల్​వైద్య విధాన పరిషత్​పరిధిలో ఉండగా, ఫ్యామిలీ ప్లానింగ్​ ప్రోగ్రాం అనేది కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ పరిధిలో ఉన్నదన్నారు. ఈ నేపథ్యంలోనే ఎంక్వైరీ నిష్పక్ష పాతంగా జరగాలన్న ఉద్దేశ్యంతో ఈ రెండు డిపార్ట్‌మెంట్ల హెడ్స్‌కి బదులు ఎంక్వైరీ ఆఫీసర్‌గా డైరెక్టర్​ఆఫ్​హెల్త్‌గా ఉన్న తనకు బాధ్యతలు అప్పగించినట్లు స్పష్టం చేశారు. చర్యల్లో భాగంగా ప్రాథమికంగా హాస్పిటల్​సూపరింటెండెంట్‌ను టీవీవీపీ కమిషనర్​సస్పెండ్​చేశారన్నారు. సర్జరీలు చేసిన డాక్టర్‌కు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నోటీసులు ఇచ్చిందని, వైద్యుడి లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేసిందన్నారు. క్యాంపులో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ పూర్తి స్థాయిలో విచారించామన్నారు. స్టెరిలైజేషన్‌లో జరిగిన లోపాల వల్లే బాధితులు ఇన్పెక్షన్‌కు గురైనట్లు ప్రాథమికంగా భావిస్తున్నామన్నారు.

ఫోరెనిక్స్ నివేదిక వచ్చాక తుది రిపోర్టును ప్రభుత్వానికి, ప్రభుత్వ అనుమతితో మీడియాకు అందజేస్తామన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఫ్యామిలీ వెల్ఫేర్​కమిషనర్​ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు అవసరమైన నిబంధనలు రూపొందిస్తున్నారన్నారు. మరోవైపు ఘటనకు గల కారణాలు అన్వేషిస్తూనే, బాధిత మహిళలకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సర్జరీ చేసుకున్న మహిళలను నిమ్స్, అపోలో తరలించి ఉచితంగా చికిత్స అందించామన్నారు. స్పెషల్ మానిటరింగ్ కోసం వైద్యాధికారులను కూడా నియమించామన్నారు. చికిత్స పొందుతున్న వారంతా ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారన్నారు. ఇప్పటికే 12 మంది డిశ్చార్జ్​కాగా, మిగతా వారిని కూడా ఒకటి రెండు రోజుల్లో ఇళ్లకు పంపిస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా స్వరాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 12 లక్షల కు.ని ఆపరేషన్లు జరిగాయని, అయితే, మొదటిసారి దురదృష్టవశాత్తూ ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో డీపీఎల్ సర్జరీ చేయించుకున్న వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారన్నారు. బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్నారు. ఈ ఘటనకు రాజకీయ రంగు పూయడం సరైనది కాదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Next Story