ట్రాఫిక్ సమస్య నియంత్రణపై టీ సర్కార్ ఫోకస్..!

by karthikeya |
ట్రాఫిక్ సమస్య నియంత్రణపై టీ సర్కార్ ఫోకస్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరాన్ని పెట్టుబడులకు హబ్‌గా, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా తీర్చదిద్దాలనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో అంశంపై విధానా నిర్ణయం తీసుకుంటున్నది. మూసీ రివర్ ఫ్రంట్, ఫ్యూచర్ సిటీ, మెట్రో రైల్ సెకండ్ ఫేజ్, ఆక్రమణల తొలగింపు కోసం హైడ్రా... ఇలాంటి వాటిపై ఇప్పటికే స్పష్టమైన అవగాహనకు వచ్చిన ప్రభుత్వం రానున్న రోజుల్లో ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెట్టనున్నది. ఇందుకోసం ‘ఉమ్టా’ (యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట అథారిటీ) కసరత్తు మొదలుపెట్టింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మెట్రో రైల్, ట్రాఫిక్ పోలీస్.. ఇలా పలు విభాగాలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో సమగ్ర పాలసీ రూపొందించడానికి వాటితో సంప్రదింపులు మొదలుపెట్టింది. పబ్లిక్, ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు సిస్టమ్‌పై ఇప్పటికే అధ్యయనం చేస్తున్న ‘ఉమ్టా’ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మల్టీమోడల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్‌పైనా స్టడీ చేస్తున్నది. రాష్ట్రం ఏర్పడక ముందు (2011లో) హైదరాబాద్ సిటీలో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ (ఆర్టీసీ సిటీ బస్సులు, సెట్విన్, ఎంఎంటీఎస్..)లో ప్రయాణించేవారు దాదాపు 46% ఉండగా 2018 చివరినాటి అది 20 శాతానికి పడిపోయినట్లు తేలింది.

సమస్యాత్మక ప్రాంతాలపై స్టడీ

రోడ్ల విస్తరణ జరుగుతున్నా, మెట్రో రైల్ అందుబాటులోకి వచ్చినా నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంపై ‘ఉమ్టా’ ప్రధాన ఫోకస్ పెట్టింది. సిటీలో ఎక్కడెక్కడ ఎక్కువగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నది, ఏయే సమయాల్లో సమస్యగా మారింది, నియంత్రణా చర్యలు తీసుకుంటున్నా ఫలితాలు ఎందుకు రావట్లేదు, ఎలాంటి వాహనాలతో ఇబ్బంది వస్తున్నది, కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్లతో తలెత్తే సమస్యలు, ఫుట్‌పాత్‌ల నిర్వహణలోని లోపాలు.. ఇలాంటి అనేక విషయాలపై ‘ఉమ్టా’ స్టడీ చేసింది. వివిధ ప్రభుత్వ విభాగాల నియంత్రణలోని అంశాలనూ గుర్తించింది. సమగ్ర పాలసీ రూపకల్పనలో ఆ విభాగాలతో సమన్వయం అవసరమని భావించి అధికారులతోనూ సంప్రదింపులు జరిపింది. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌కు ఉన్న అనుకూతలతో పాటు ప్రతికూల అంశాలనూ విశ్లేషించింది. నగరంలో ఏటేటా జనాభా పెరుగుతున్నట్లుగానే కొత్తగా రిజిస్ట్రేషన్ అవుతున్న వాహనాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నట్లు గుర్తించింది. ఫ్లై ఓవర్‌లు, అండర్‌పాస్‌లు, స్టీల్ బ్రిడ్జీలు వస్తున్నా ట్రాఫిక్ జామ్ పరిష్కారం కాకపోవడంపై దృష్టి సారించింది.

పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ వినియోగం తగ్గడంతో పాటు ప్రైవేటు వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగిపోయినట్లు ‘ఉమ్టా’ స్టడీలో తేలింది. దానికి కారణం మెట్రో రైల్‌కు, సిటీ బస్సులకు మధ్య ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేకపోవడం ఒకటిగా నిర్ధారణైంది. మెట్రో రైల్ దిగిన వెంటనే ఆ సౌకర్యం లేని మరో ప్రాంతానికి ప్రజలు చేరుకోవాలంటే సిటీ బస్ అనివార్యమైనా ఆ బస్ స్టాప్ దూరంలో ఉండడం ఇబ్బందికరంగా మారింది. దీంతో ప్రైవేటు వాహనాలు (టూ వీలర్స్) తప్పడంలేదని వెల్లడైంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అమీర్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్ లాంటి కొన్ని కీలకమైన రద్దీ ప్రాంతాల్లో మెట్రో రైల్, సిటీ బస్ స్టాప్ కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకోడానికి కొన్ని పాయింట్లను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని అమలు చేసింది. దీంతో మంచి ఫలితాలే వచ్చాయని నిర్ధారణకు వచ్చింది. మరికొన్ని చోట్ల రోడ్డుపైనే ఆలయాలు, మసీదులు ఉండడంతో కొన్ని మీటర్ల మేర ‘బాటిల్ నెక్’గా మారిందని, ఫలితంగా చాలా దూరం వరకు వాహనాల రద్దీ చోటుచేసుకుంటున్నట్లు తేల్చింది. ఇలాంటి చోట్ల ‘వన్ వే’గా మార్చడం, ట్రాఫిక్ సిగ్నల్‌ను పెట్టడం లాంటి తాత్కాలిక చర్యలతో వచ్చి ఫలితాలను కూడా విశ్లేషించింది.

ఇతర రాష్ట్రాల మోడలపై పరిశీలన

అమీర్‌పేట్-గ్రీన్‌ల్యాండ్ హోటల్ మధ్యలో ఒక ఆలయం దగ్గర ఇలాంటి పరిస్థితి తలెత్తడంతో ట్రాఫిక్ డైవర్షన్ (వన్ వే)గా మార్చడంతో రద్దీ తగ్గినట్లు గుర్తించింది. మరికొన్ని చోట్ల స్ట్రీట్ వెండింగ్, ఫుట్ పాత్ ఆక్రమణల బిజినెస్‌తో వాహనాల పార్కింగ్ సమస్య తలెత్తిందని గుర్తించి ప్రయోగాత్మకంగా కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయం చేపట్టింది. ఢిల్లీ, చెన్నై తదితర నగరాల్లో ఉన్నట్లుగా వర్టికల్ పార్కింగ్ మోడల్‌పై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకతమైనా ‘ఉమ్టా’ పరిశీలన చేస్తున్నది. గత ప్రభుత్వం ఇలాంటి పాలసీని తీసుకొచ్చినా అర్ధంతరంగా వెనక్కి తీసుకోవడంలో రానున్న రోజుల్లో సిటీలో పాపులేషన్ డెన్సిటీతో పాటు వాహనాల సంఖ్య పెరగడాన్ని పరిగణనలోకి తీసుకుని నిర్దిష్టమైన విధాన నిర్ణయం అవసరమని ప్రభుత్వానికి సూచన చేయనున్నది. హై రైజ్ బిల్డింగులకు నిర్మాణ అనుమతులు జారీచేసే విషయంలో ‘సెట్ బ్యాక్’ లాంటి నిబంధనలను అమలు చేస్తున్నా అందులో నివాసం ఉండేవారు వినియోగించే వాహనాల సంఖ్యను కూడా పరిగణలోకి తీసుకోవాలని, ఆఫీస్ టైమింగ్స్ లో పదుల సంఖ్యలో వాహనాలు రోడ్డు మీదకు రావడంతో రద్దీ పెరుగుతున్నదనే అభిప్రాయాన్ని ‘ఉమ్టా’ వ్యక్తం చేస్తున్నది.

హై రైజ్ భవనాలకు అనుమతులు ఇచ్చేటప్పుడు దానికి ఉన్న రోడ్ల వెడల్పు అంశాన్ని కూడా గమనంలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నది. వివిధ విభాగాల సమన్వయంతో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం కనుగొనాల్సి ఉంటుందని, ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అవసరమని భావిస్తున్నది. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్‌ను ఒకవైపు పటిష్టం చేస్తూనే మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ విధానాన్ని (ఒకే టికెట్‌పై మెట్రో రైల్, సిటీ బస్సుల్లో ప్రయాణించేలా) కూడా రూపొందించాల్సిన అవసరం ఉన్నదనేది ‘ఉమ్టా’ భావన. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించి అందులో చేసే సూచనలు, ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రభుత్వం ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ పాలసీపై రివ్యూ చేసే అవకాశాలున్నాయి.

Advertisement

Next Story