కులగణనపై కోర్టుకు సర్కార్ సవాల్

by karthikeya |   ( Updated:2024-11-03 02:26:07.0  )
కులగణనపై కోర్టుకు సర్కార్ సవాల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ రిజర్వేషన్ ఖరారుకు ప్రత్యేక కమిషన్ వేయాలని హైకోర్టు సింగిల్ యచ్ గత నెల 31న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు సోమవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇదే అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి సీనియర్ ఆఫీసర్లతో రివ్యూ చేయడంతో పాటు పలువురు న్యాయనిపుణుల సలహాలూ తీసుకున్నట్టు తెలిసింది. ఈనెల 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికి ఎలాంటి న్యాయ వివాదాలూ రావొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం డివిజన్ బేంచ్‌కు వెళ్లేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది.

ప్రస్తుత సర్వేకి రిజర్వేషన్లకు సంబంధం లేదు!

ఈ నెల 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర ఇంటింటి సర్వేకు ప్రభుత్వం రెడీ అయింది. ఈ సర్వేలో ప్రతి ఫ్యామిలీ ఆర్థిక, రాజకీయ వివరాలు సేకరించనున్నారు. బీసీ రిజర్వేషన్ల ఖరారుకు, ప్రస్తుత సర్వేకు ఎలాంటి సంబంధమూ లేదు. ఈ సర్వే ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో జరగనున్నది. కానీ చాలా మంది బీసీ రిజర్వేషన్లను ఫైనల్ చేసేందుకే సర్వే చేపడుతున్నట్టు అపోహలో ఉన్నారు. ఈ సర్వేను సవాల్ చేస్తూ కొందరు హైకోర్టుకు వెళ్లారు. బీసీ జనాభా లెక్కలు తీసేందుకు ప్రత్యేక కమిషన్ వేయాలని కోర్టు ఆదేశించింది.

‘ప్రస్తుతం సమగ్ర కుటుంబ రాజకీయ, ఆర్థిక సర్వే జరిపిస్తున్నాం. బీసీ కుల గణనకు సంబంధం లేదు.’ అని ప్రభుత్వం కోర్టుకు వివరించేందుకు రెడీ అయినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం నిర్వహించబోయే సర్వేలో అన్ని కులాలతో పాటు బీసీ జనాభా ఎంత? వారి రాజకీయ ప్రాధాన్యత ఏ మేరకు ఉంది? అనే అంశాలు తేలనున్నాయి. ఈ లెక్కలను ప్రభుత్వం బీసీ కమిషన్‌కు అందజేస్తే అప్పుడు కమిషన్ బీసీల రిజర్వేషన్లను ఫైనల్ చేయనుంది. ఇదే విషయాన్ని ప్రభుత్వం కోర్టుకు వివరించేందుకు సిద్ధమవుతున్నట్టు సెక్రెటేరియట్ వర్గాల్లో చర్చ సాగుతున్నది.

Advertisement

Next Story

Most Viewed