- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రైతులకు గుడ్ న్యూస్.. పంట రుణాలకు వడ్డీ ఫిక్స్!
దిశ, తెలంగాణ బ్యూరో : అధిక ఇంట్రెస్ట్‌తో రైతుల నడ్డి విరుస్తున్న ప్రైవేటు వ్యాపారుల ఆగడాలకు చెక్ పెట్టేందుకు సర్కారు ప్లాన్ చేస్తున్నది. వారు రైతులకు ఇచ్చే పంట రుణాలకు ఎంత వడ్డీ వసూలు చేయాలనే రేట్‌ను ప్రభుత్వమే ఫిక్స్ చేయనున్నది. గతంలోనే రూపొందించిన మనీ లెండర్స్ యాక్ట్‌ను పకడ్బందీగా అమలు చేయడంపై దృష్టి సారించింది. వడ్డీ వ్యాపారులు ఇష్టారాజ్యంగా ఇంట్రెస్ట్ వసూలు చేయకుండా రైతులకు ఉపశమనం కలిగించేలా నిర్దిష్ట మార్గదర్శకాలను రూపొందించడంపై కసరత్తు జరుగుతుంది. ప్రస్తుతం సీసీఎల్ఏ (చీఫ్ కమిషనర్ ఆఫ్ లాండ్ అడ్మినిస్ట్రేషన్) దగ్గర ఉన్న ఈ ఫైల్‌కు త్వరలో ప్రభుత్వం ఆమోదం తెలపనున్నది. ప్రస్తుతం జాతీయ, గ్రామీణ బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు వసూలు చేస్తున్న పంట రుణాలకు గరిష్టంగా 1.5% నుంచి 2.0% కన్నా ఎక్కువ ఉండకూడదనే ప్రాథమిక నిర్ణయం తీసుకున్నది.
రాష్ట్రంలో దాదాపు 60% మందికి పైగా రైతులు ప్రైవేటు అప్పులపైనే ఆధారపడుతున్నారని, బ్యాంకుల నుంచి రుణం పుట్టకపోవడమే ఇందుకు కారణమన్నది రైతు సంఘాల ప్రతినిధుల అభిప్రాయం. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం థర్డ్ ఫేజ్ రుణమాఫీ సందర్భంగా వివిధ బ్యాంకులతో పాటు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నుంచి వివరాలు తెప్పించుకున్నారు. వాటి ప్రకారం రాష్ట్రంలో దాదాపు 42 లక్షల మంది రైతులు బ్యాంకుల నుంచి రుణాలే తీసుకోలేదని తేలింది. ఇందులో ఎక్కువ మంది కౌలు రైతులే కావడం గమనార్హం. సొంత సాగుభూమి లేకపోవడం, పట్టాదారు పాస్‌బుక్‌లకు అర్హత లేకపోవడంతో వారికి బ్యాంకుల నుంచి అప్పు పుట్టడం లేదు. కానీ కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నందున ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి రుణం తీసుకోవడం మినహా వారికి మరో మార్గం లేకుండా పోయింది. అధిక వడ్డీల భారాన్ని మోయలేని పరిస్థితులను గమనంలోకి తీసుకున్న ప్రభుత్వం దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెట్టింది.
ఏడాదికి 45 శాతానికి పైగానే..
ప్రైవేటు వడ్డీ వ్యాపారులు వసూలు చేసే వడ్డీకి నిర్దిష్టమైన కొలమానం లేకపోవడంతో రైతుల అవసరాలను సాకుగా తీసుకుని ఎక్కువ ఇంట్రెస్ట్ రేటుకు అప్పులిస్తున్నారు. ఒక్కోసారి ఇది 45% సైతం దాటి పోతున్నది. జాతీయ బ్యాంకులు గరిష్టంగా 7% మేర మాత్రమే వడ్డీని విధిస్తుంటే ప్రైవేటు వ్యాపారుల వడ్డీకి ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో రైతులు ఆ అప్పులను తీర్చలేక, వడ్డీలను కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే వివరాలు రెవెన్యూ శాఖ దృష్టికి వెళ్ళాయి. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా ఈ పరిస్థితి తలెత్తడంతో కంట్రోల్ చేయడం అనివార్యమని భావించింది. స్వయంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆ శాఖ అధికారులకు కొన్ని సూచనలు చేసి నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలను సూచించాలని ఆదేశించారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు ఎంత వడ్డీకి అప్పులివ్వాలో ప్రభుత్వమే స్పష్టంగా పేర్కొనేలా ఎగ్జిక్యూషన్ ఆర్డర్ దిశగా కసరత్తు జరుగుతుంది.
ఉమ్మడి రాష్ట్రంలోనే మనీ లెండర్స్ యాక్ట్ రూపకల్పన
ఉమ్మడి రాష్ట్రంలోనే మనీ లెండర్స్ యాక్ట్ రూపొందినా పటిష్టంగా అమలు కావడం లేదని రైతు సంఘాల ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీలో చట్ట సవరణ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం ఎగ్జిక్యూషన్ ఆర్డర్‌తోనే ప్రైవేటు వడ్డీ వ్యాపారుల ఆగడాలను అరికట్టవచ్చని తెలియజేశారు. పేద, కౌలు రైతులకు ఉపశమనం కలిగించవచ్చని మంత్రికి వివరించారు. మనీ లెండర్స్ యాక్టులో పేర్కొన్నట్టుగా ప్రతి ప్రైవేటు వడ్డీ వ్యాపారీ విధిగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం తో పాటు ఏటా రెన్యువల్ సైతం చేసుకోవాల్సి ఉంటుంది. వార్షిక ఆడిట్ రిపోర్టును సైతం కలెక్టర్‌కు సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇవేవీ సీరియస్‌గా అమలు కాకపోవడంతో ఇక నుంచి పటిష్టంగా ఉండాలని మంత్రి నొక్కిచెప్పారు. లైసెన్స్ లేకుండా వడ్డీ వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఆలోచిస్తోంది.
చట్టంలో పక్కా నిబంధనలు ఉన్నప్పటికీ అమలులో లొసుగులపై మంత్రి సీరియస్‌గా ఉన్నారు. వడ్డీ వ్యాపారులకు లైసెన్సులు (రిజిస్ట్రేషన్ ప్రాసెస్) ఇవ్వడంలో, రెన్యువల్ చేయడంలో, యాన్యువల్ ఆడిట్ రిపోర్టులు సమర్పించడంలో ఎలాంటి లొసుగులకు తావు లేకుండా కలెక్టర్ అధ్యక్షతన రెవెన్యూ బోర్డులు పటిష్టంగా పనిచేసేలా ప్రభుత్వం ఆలోచిస్తోంది. అప్పుల బాధలు, వడ్డీల భారాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్న అన్నదాతల్లో ఎక్కువగా పేద, కౌలు రైతులే ఉంటున్నారని రైతు సంఘాల ప్రతినిధుల ద్వారా ప్రభుత్వం తెలుసుకున్నది. వీలైనంత తొందరలోనే వడ్డీ రేటును ఫిక్స్ చేయడంతో పాటు పక్కా నియంత్రణ కోసం ఉత్తర్వులు విడుదల చేసేలా కసరత్తు జరుగుతుంది.
వెంటనే స్పందించిన మంత్రి పొంగులేటి
ప్రైవేటు వడ్డీ వ్యాపారులతో పేద, కౌలు రైతులు పడుతున్న ఇబ్బందులను అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. పాత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరాం. ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న వడ్డీలతో రైతులకు వస్తున్న జీవన్మరణ సమస్యలను వివరించాం. రాతపూర్వకంగా మెమోరాండం మంత్రి పొంగులేటి వెంటనే స్పందించారు. పక్కనే ఉన్న రెవెన్యూ అధికారికి ఆదేశాలు ఇచ్చారు. చట్ట సవరణ తో సంబంధం లేకుండా నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలన్నారు. ప్రైవేటు వ్యాపారులు వసూలు చేసే వడ్డీ శాతాన్ని ప్రభుత్వమే ఫిక్స్ చేస్తుంది. ఉల్లంఘిస్తే చట్టంలో పేర్కొన్నట్టుగా జరిమానా, శిక్షలుంటాయని మంత్రి తెలిపారు. తొందర్లోనే గైడ్‌లైన్స్ వస్తాయనుకుంటున్నాను. వీటితో పేద, కౌలు రైతులకు చాలా రిలీఫ్ ఉంటుంది.- కోదండరెడ్డి, కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు