నైజాం అరాచకాలపై గర్జించిన వీర యోధుడు రావి నారాయణరెడ్డి

by GSrikanth |
నైజాం అరాచకాలపై గర్జించిన వీర యోధుడు రావి నారాయణరెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నైజాం అరాచకాలపై గర్జించిన వీర యోధుడు రావి నారాయణరెడ్డి అని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. చరిత్రాత్మక తెలంగాణ సాయుధ పోరాటంలో రావి నారాయణరెడ్డి అగ్రభాగాన ఉండి నైజాం నిరంకుశ పాలనను, భూస్వామ్య వ్యవస్థ అంతమొందించే వరకు అలుపెరుగని పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ప్రముఖ కమ్యూనిస్టు నేత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, పద్మవిభూషణ్ రావి నారాయణరెడ్డి 116వ జయంతి ఉత్సవాలను తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ హైదరాబాద్, బంజారా హిల్స్ లోటస్ పాండ్ వద్ద ఉన్న రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సురవరం సుధాకర్ రెడ్డి తొలుత రావి నారాయణరెడ్డి విగ్రహానికి ఫూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ హైదరాబాద్ స్టేట్‌లో గ్రామగ్రామాన రైతాంగ పోరాటాన్ని పెను తుఫానులా హోరెత్తించిన విప్లవ వీరుడు, హైదరాబాద్ సంస్థానంలో విధ్వంసంకాండతో నరమేధం సృష్టించిన రజాకార్ల ఆకృత్యాలను అరికట్టడానికి అజ్ఞాతంగా ఎన్నో గెరిల్లా దళాలను ఏర్పాటు చేసి రావి నారాయణరెడ్డి చేసిన సాయుధ పోరాటం చిరస్మరణీయం కొనియాడారు. 1951-52 లో తొలి సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టు అభ్యర్థిగా నల్గొండ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి నాటి ప్రధాని నెహ్రూ కంటే ఎక్కువ ఓట్లు సాధించి పార్లమెంటులో తొలి అడుగు పెట్టిన ఘనత రావి నారాయణరెడ్డి సాధించారని చెప్పారు.

తన 500 ఎకరాల సొంత భూములను పేదలకు దానం చేసి అణగారిన వర్గాలకు అండగా నిలిచినా రావి నారాయణరెడ్డి ఆశయాలను కొనసాగించాలని సురవరం కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ కార్యదర్శి కందిమళ్ళ ప్రతాపరెడ్డి, కోశాధికారి ఉజ్జిని రత్నాకర్ రావు, సభ్యులు రావి ప్రతిభ రెడ్డి, ఏఐటీయూసీ సీనియర్ నాయకులు డా. బి.వి. విజయలక్ష్మి, సంఘసేవకులు రావి రిషికేశ్ రెడ్డి, అప్పరావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో రావి నారాయణరెడ్డి జయంతి సందర్భంగా సీపీఐ నాయకులు నివాళులు అర్పించారు.

Advertisement

Next Story

Most Viewed