తెలంగాణ కాంగ్రెస్ సరికొత్త స్ట్రాటజీ.. సీనియర్ల నుంచి అసంతృప్తి రాకుండా ప్లాన్!

by GSrikanth |
తెలంగాణ కాంగ్రెస్ సరికొత్త స్ట్రాటజీ.. సీనియర్ల నుంచి అసంతృప్తి రాకుండా ప్లాన్!
X

అన్ని వర్గాలను బ్యాలెన్స్ చేసేలా కాంగ్రెస్ సరికొత్త స్ట్రాటజీని అమలు చేస్తున్నది. టీపీసీసీ చీఫ్ కు ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు కనిపిస్తూనే.. తెర వెనక సీనియర్లను సపోర్ట్ చేస్తున్నది. ఎవరు యాత్రలు చేసినా అది వ్యక్తికి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టడంతో పాటు పార్టీకీ ప్రయోజనం కలిగించేదిగా ఉండాలని ఆలోచిస్తున్నది. అందుకే గతంలో ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి యాత్రకు ఆమోదం తెలిపి.. ఇప్పుడు భట్టి విక్రమార్క పాదయాత్రకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీ పటిష్టంగా ఉండాలంటే అన్ని గ్రూపులు అవసరమని కాంగ్రెస్ భావిస్తున్నది. అందుకే టీపీసీసీ చీఫ్ రేవంత్‌తో విభేదిస్తున్న సీనియర్లను బుజ్జగించడంతోపాటు అసంతృప్తి లేకుండా ఆలోచిస్తున్నది. రేవంత్ పాదయాత్ర చేస్తుండడంతో కేవలం ఒక్క వ్యక్తిమీదనే ఆధారపడటం సమంజసం కాదన్న భావనతో సీనియర్లు కూడా ఇలాంటి యాత్రలను చేసేలా ప్రోత్సహించింది. అందులో భాగంగానే గతంలో ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చేపట్టిన యాత్రలో స్వయంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు థాక్రే పాల్గొన్నారు. తాజాగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క యాత్రకు కూడా ఏఐసీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

నివేదిక ప్రకారం..

రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్‌రావ్ థాక్రే రాష్ట్ర యూనిట్‌లోని గ్రూపు తగాదాలను అధ్యయనం చేసి రెండు వర్గాలతో చర్చలు జరిపిన అనంతరం ఏఐసీసీకి నివేదిక ఇచ్చారు. దానికి అనుగుణంగానే రేవంత్ సహా సీనియర్లను కూడా కాపాడుకోవడం, సమాన ప్రాధాన్యత ఇవ్వడం, అందరినీ కలుపుకుపోయే వాతావరణాన్ని సృష్టించాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.

అందరికీ ప్రయారిటీ..

వ్యక్తి కేంద్రంగా పార్టీ నడవడం ఆరోగ్యకరం కాదన్న ఉద్దేశంతోనే ఏఐసీసీ అందరినీ కలుపుకుపోవాలని చూస్తున్నది. టీపీసీసీ చీఫ్‌తో ఏర్పడిన విభేదాలతో సీనియర్లందరినీ దూరం చేసుకోవడం సాధ్యం కాదనే అభిప్రాయానికి వచ్చింది. అందుకే రేవంత్ రెడ్డికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నదో, సీనియర్లకు కూడా అదే తరహా ప్రయారిటీ ఇచ్చి వారిలో ఏర్పడిన అసంతృప్తిని దూరం చేయాలని భావిస్తున్నది. ఒక వ్యక్తి ఏదేని కారణాలతో పార్టీ నుంచి దూరమైనా, అది పార్టీపై ఎక్కువ ప్రభావం చూపకుండా ఉండాలని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నది. పాదయాత్రల సందర్భంగా సన్నిహితంగా ఉండే వ్యక్తులను అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించుకుని ఒక బలమైన వర్గంగా మారి పార్టీని సవాలు చేసే స్థితిలో ఉండకుండా సీనియర్లను, పీసీసీ చీఫ్‌నూ బ్యాలెన్సుగా నడిపించేలా హైకమాండ్ అడుగులు వేస్తున్నది. అయితే భవిష్యత్తులో మరికొద్దిమంది సీనియర్లు కూడా పాదయాత్రల ప్రతిపాదన తెస్తే ఎలా ఆలోచిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఆచితూచి అడుగులు..

ఒకరి కోసం మరొకరిని చేజార్చుకోవడం ఏఐసీసీకి ఇష్టం లేదు. వ్యక్తి కేంద్రంగా పార్టీ నడిస్తే ఏదో ఒకరోజు అనూహ్య పరిణామం జరిగితే అది పార్టీకి చేటు తెస్తుందన్న పాత అనుభవాలతో తెలంగాణలో ఆచితూచి అడుగేస్తున్నది. రేవంత్ ఒక మాస్ లీడర్‌గా, వాగ్ధాటి కలిగిన వ్యక్తిగా, అధికార బీఆర్ఎస్‌ను ఢీకొట్టే పీసీసీ చీఫ్‌గా, ప్రభుత్వ వైఫల్యాలను సూటిగా ప్రజల్లోకి తీసుకెళ్లే స్పీకర్‌గా ఏఐసీసీ స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నది. కానీ ఒక టీమ్‌గా పీసీసీని నడిపించడంలో రేవంత్ తన వంతు ప్రయత్నాలు చేసినా గ్రూపుల ఘర్షణలను, వర్గాల పోరును నివారించడంలో ఆశించిన ఫలితాలను సాధించలేదనే వాస్తవాన్నీ ఏఐసీసీ గుర్తించింది. రేవంత్‌ ను సంతృప్తిపర్చాలనుకుంటే దాదాపు పది మంది సీనియర్లు అంటీ ముట్టనట్లుగా మిగిలిపోయే ప్రమాదమున్నదని, అంచనాలు తప్పి పార్టీని వీడే అవకాశమూ లేకపోలేదని ఏఐసీసీ గ్రహించింది. రేవంత్ పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువైతే అది పార్టీకే ప్రయోజనమని, అయితే అదే సమయంలో వ్యక్తి గొప్పదనంగా ప్రజల్లోకి మెసేజ్ వెళ్లడం పార్టీకి చేటు తెస్తుందనే కోణం నుంచి కూడా ఆలోచించింది. పార్టీ తరఫున ఎంతమంది సీనియర్లు పాదయాత్ర చేసినా ప్రజల్లో పార్టీ బలపడుతుందనే అంచనా ఏర్పడితే వాటికి సానుకూలంగా స్పందించడమే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. భట్టి విక్రమార్క ఈ నెల 16 నుంచి ప్రారంభించే పాదయాత్రకు కొద్దిమంది సీనియర్ నేతలను కూడా పంపేలా ఆలోచిస్తున్నట్లు తెలిసింది.

రేపటి నుంచి ‘భట్టి’ యాత్ర

భట్టి విక్రమార్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ సెగ్మెంట్ నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. 91 రోజుల పాటు మొత్తం 39 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సుమారు 1,365 కి.మీ మేర ఈ యాత్ర సాగనున్నది. ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ మీదుగా సాగి చివరకు ఖమ్మం జిల్లా కేంద్రంలో ముగియనున్నది. ఈ రూట్ మ్యాప్‌లో రేవంత్‌తో విభేదిస్తున్న పలువురు సీనియర్ నాయకులకు చెందిన అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా ఉన్నాయి. వారు భట్టి విక్రమార్కతో సన్నిహిత సంబంధాలు ఉన్నందున రేవంత్ పాదయాత్రకంటే ఇదే సక్సెస్ అయిందనే మెసేజ్‌ను అటు ప్రజల్లోకి, ఇటు ఏఐసీసీ దృష్టిలోకి వెళ్లేలా ఆలోచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed