బిగ్ బ్రేకింగ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. ఎలక్షన్స్ ఎప్పుడంటే..?

by Satheesh |   ( Updated:2023-10-09 09:35:30.0  )
బిగ్ బ్రేకింగ్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. ఎలక్షన్స్ ఎప్పుడంటే..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సహా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. మిజోరాం అసెంబ్లీ పదవీకాలం డిసెంబరు 17న ముగియనున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అప్పటివరకు మిగిలిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా ఒకేసారి పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది.

ఈ ఐదు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన ముగ్గురు కమిషనర్లు క్షేత్రస్థాయి పర్యటన చేసి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించిన తర్వాత షెడ్యూలును రూపొందించింది. ఢిల్లీలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పూర్తి షెడ్యూలును ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది. తక్షణం ఎన్నికల కోడ్ ఈ ఐదు రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చింది.

నవంబర్ 30న పోలింగ్

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 30 న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎలక్షన్ కమిషన్ షెడ్యూలులో పేర్కొన్నది. డిసెంబర్ 3‌న కౌంటింగ్ నిర్వహించి అదే రోజులు ఫలితాలను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 3వ తేదీన ఎన్నికల గెజిట్ విడుదల కానుండగా.. 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నవంబర్ 13వ తేదీ వరకు నామినేషన్ల స్క్రూట్నీ.. నవంబర్ 15వ తేదీ నామినేషన్ల విత్ డ్రాకు చివరి తేదీగా షెడ్యూల్‌లో పేర్కొన్నారు. మొత్తం 119 స్థానాలున్న అసెంబ్లీకి జనరి 16వ తేదీ వరకు నిర్వహించే వెసులుబాటు ఉన్నప్పటికీ మిజోరాంతో కలిపి నిర్వహిస్తున్నందున దాదాపు నెల రోజుల ముందే పోలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవుతున్నది. గతేడాది డిసెంబరు 7న పోలింగ్ జరగ్గా 11న ఫలితాలు వెలువడ్డాయి.

కానీ అసెంబ్లీ ఫస్ట్ సెషన్ జనవరి 17, 2019న జరగడంతో తెలంగాణ అసెంబ్లీ పదవీకాలం జనవరి 16, 2024 వరకు ఉంటుంది. ఎన్నికలు సకాలంలో వస్తాయా?.. లోక్‌సభతో పాటు కలిపి జమిలిగా వస్తుందా?.. ఒక నెల ముందే జరుగుతుందేమో!.. రెండు నెలలు ఆలస్యం కావచ్చేమో!.. ఇలాంటి అనేక సందేహాలకు తెర దించుతూ షెడ్యూలు విడుదలైంది.

మరే పార్టీకంటే ముందుగానే మొత్తం 119 స్థానాలకుగాను 115 చోట్ల బీఆర్ఎస్ ఆగస్టు 21న తేదీనే అభ్యర్థుల్ని ప్రకటించింది. మరో నాలుగు స్థానాలకు ఇంకా ప్రకటించాల్సి ఉన్నది. లిస్టు విడుదలైన తర్వాత మల్కాజిగిరి అసెంబ్లీ స్థానంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌ పార్టీకి వెళ్లిపోవడంతో మరో వ్యక్తి పేరును అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నది.

పార్టీ అధినేత కేసీఆర్ ఫస్ట్ టైమ్ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. తొమ్మిది మంది మినహా మిగిలిన అన్ని స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీలు మాత్రం ఇంకా అభ్యర్థులను ఖరారు చేసే కసరత్తులోనే ఉన్నాయి. నోటిఫికేషన్ వెలువడే సమయానికి ఆ రెండు పార్టీల అభ్యర్థుల ప్రకటన వచ్చే అవకాశమున్నది.

గత ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం, వామపక్షాలు, తెలంగాణ జనసమితి తదితర పార్టీలన్నీ మహాకూటమి పేరుతో పోటీచేశాయి. బీఆర్ఎస్, బీజేపీ ఒంటరిగా పోటీచేశాయి. ఈసారి మాత్రం ఎలాంటి పొత్తుల్లేకుండా ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, లెఫ్ట్ పార్టీలతో పాటు తెలంగాణ జనసమితి కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతున్నాయి.

ఈసారి ఎన్నికలకు వైఎస్సార్టీపీ పేరుతో షర్మిల నేతృత్వంలో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. బీఆర్ఎస్ అత్యధికంగా 88 స్థానాల్లో, కాంగ్రెస్ 19 చోట్ల, తెలుగుదేశం 2 రెండు చోట్ల, బీజేపీ ఒకేచోట గెలిచాయి. ఫార్వార్డ్ బ్లాక్ తరఫున గెలిచిన ఇద్దరు బీఆర్ఎస్‌లో చేరిపోయారు. లెఫ్ట్ పార్టీలకు ఒక్క సీటు కూడా దక్కలేదు.

బీఆర్ఎస్‌కు షాక్

ఎన్నికల షెడ్యూలు వెలువడడానికి ముందే రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కొన్ని కీలక అంశాలను చర్చించి విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా గత నెల చివరి వారం నుంచే సచివాలయ అధికారుల స్థాయిలో కసరత్తు జరిగింది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యం కారణంగా క్యాబినెట్ భేటీ జరగలేదు.

ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో తక్షణం కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వపరంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. కొత్త స్కీములను ప్రకటించడానికి కోడ్ ఆటంకం కానున్నది. పార్టీపరంగా హామీల రూపంలో మాత్రమే ప్రకటించాల్సి ఉన్నది.

ఎన్నికల షెడ్యూలు ఏ సమయంలోనైనా రావచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుగానే అనేక కొత్త పథకాలను ప్రకటించింది. ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ, ఐఆర్, ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్టు, ముఖ్యమంత్రి అల్పాహార పథకం, చేనేతకు చేయూత, గృహలక్ష్మి, మైనారిటీలకు లక్ష సాయం.. ఇలాంటి అనేక పథకాలను ప్రకటించింది.

దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కొన్నింటిని లాంఛనంగా ప్రారంభించింది. కేవలం కోడ్ ఆటంకం రాకుండా ఉండేందుకుగాను ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించి ఒక్క రోజుతోనే సరిపెట్టింది. దీన్ని ఆన్-గోయింగ్ స్కీమ్‌గా చూపించి క్యాంపెయిన్ టైమ్‌‌లోనే స్పీడప్ చేయనున్నది.

రైతుబంధు నిధులకు కోడ్ వర్తించదు!:

రైతుబంధు స్కీమ్ కింద ఒక్కో ఎకరానికి రూ. 5 వేల చొప్పున ప్రభుత్వం నవంబరు చివర్లో లేదా డిసెంబరులో రాష్ట్రంలోని సుమారు 65 లక్షల మంది రైతులకు ఆర్థిక సాయాన్ని అందించనున్నది. నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ కానున్నది. ఇది ఆన్-గోయింగ్ స్కీమ్ కావడంతో ఎన్నికల సంఘం నుంచి కూడా ఆంక్షలు ఉండకపోవచ్చు.

సరిగ్గా పోలింగ్‌కు వారం రోజుల ముందు రైతుబంధు ప్రాసెస్ కంప్లీట్ అయ్యేలా ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేసే అవకాశమున్నది. లాంఛనంగా ప్రారంభించి పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకురాని గృహలక్ష్మి, చేనేతకు చేయూత లాంటి పథకాల కింద ఇచ్చే సాయాన్ని కూడా పోలింగ్‌కు ముందుగా అందజేసే అవకాశమున్నది.

క్యాంపెయిన్‌కు 50 రోజులు :

గత ఎన్నికల సమయంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ అక్టోబరు 6 (2018)న షెడ్యూలును ప్రకటించింది. అసెంబ్లీని సెప్టెంబరు 6న ముందస్తుగా రద్దు చేయడంతో నెల రోజుల్లోనే షెడ్యూలు వచ్చేసింది. డిసెంబరు 7న పోలింగ్ జరగ్గా 11న ఓట్ల లెక్కింపు పూర్తయింది. దాదాపు రెండు నెలల పాటు ఎన్నికల ప్రచారానికి పార్టీలకు అవకాశం లభించింది.

ఈసారి అక్టోబరు 9న ఎలక్షన్ కమిషన్ షెడ్యూలును రిలీజ్ చేసింది. నవంబర్ 30 న పోలింగ్ జరగనుండడంతో 50 రోజుల పాటు పార్టీలకు ప్రచారం చేసుకోడానికి వీలు చిక్కింది. బీఆర్ఎస్ మినహా (నాలుగు సీట్లు తప్ప) మరే పార్టీ కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేదు. షెడ్యూలు విడుదలైనప్పటికీ నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యే సమయానికి అవి క్యాండిడేట్ల లిస్టును కంప్లీట్ చేయనున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ :

మొత్తం స్థానాలు : 119

ఎస్సీ రిజర్వు : 19

ఎస్టీ రిజర్వు : 12

నోటిఫికేషన్ విడుదల : నవంబర్ 3

నామినేషన్లకు డెడ్‌లైన్ : నవంబర్ 15

పోలింగ్ తేదీ : నవంబర్ 30

కౌంటింగ్ తేదీ : డిసెంబర్ 3

మొత్తం ఓటర్లు : 3,17,32,727

పురుషులు :1,58,71,493

మహిళలు : 1,58,43,339

పోలింగ్ కేంద్రాలు : 35,356

అసెంబ్లీ గడువు : 16.01.2024


చత్తీస్‌గఢ్ అసెంబ్లీ :

మొత్తం స్థానాలు : 90

ఎస్సీ రిజర్వు : 10

ఎస్టీ రిజర్వు : 29

నోటిఫికేషన్ విడుదల : మొదటి విడత 13 అక్టోబర్, రెండవ విడత 21 అక్టోబర్

నామినేషన్లకు డెడ్‌లైన్ : మొదటి విడత అక్టోబర్ 20, రెండవ విడత అక్టోబర్ 30

పోలింగ్ తేదీ : మొదటి విడత నవంబర్ 7, రెండవ విడత నవంబర్ 17

కౌంటింగ్ తేదీ : డిసెంబర్ 3

మొత్తం ఓటర్లు : 2.03 కోట్లు

పురుషులు : 1.01

మహిళలు : 1.02

పోలింగ్ కేంద్రాలు : 24,109

అసెంబ్లీ గడువు : 03.01.2024

మధ్యప్రదేశ్ అసెంబ్లీ :

మొత్తం స్థానాలు : 230

ఎస్సీ రిజర్వు : 35

ఎస్టీ రిజర్వు : 47

నోటిఫికేషన్ విడుదల : అక్టోబర్ 21

నామినేషన్లకు డెడ్‌లైన్ : నవంబర్ 2

పోలింగ్ తేదీ : నవంబర్ 17

కౌంటింగ్ తేదీ : డిసెంబర్ 3

మొత్తం ఓటర్లు : 5.06 కోట్లు

పురుషులు : 2.88 కోట్లు

మహిళలు : 2.72 కోట్లు

పోలింగ్ కేంద్రాలు : 51,756

అసెంబ్లీ గడువు : 06.01.2024

రాజస్థాన్ అసెంబ్లీ :

మొత్తం స్థానాలు : 200

ఎస్సీ రిజర్వు : 34

ఎస్టీ రిజర్వు : 25

నోటిఫికేషన్ విడుదల : అక్టోబర్ 30

నామినేషన్లకు డెడ్‌లైన్ : నవంబర్ 9

పోలింగ్ తేదీ : నవంబర్ 23

కౌంటింగ్ తేదీ : డిసెంబర్ 3

మొత్తం ఓటర్లు : 5.25 కోట్లు

పురుషులు : 2.73 కోట్లు

మహిళలు : 2.52 కోట్లు

పోలింగ్ కేంద్రాలు : 51,756

అసెంబ్లీ గడువు : 14.01.2024

మిజోరాం అసెంబ్లీ :

మొత్తం స్థానాలు : 40

ఎస్సీ రిజర్వు : 0

ఎస్టీ రిజర్వు : 39

నోటిఫికేషన్ విడుదల : అక్టోబర్ 13

నామినేషన్లకు డెడ్‌లైన్ : అక్టోబర్ 23

పోలింగ్ తేదీ : నవంబర్ 7

కౌంటింగ్ తేదీ : డిసెంబర్ 3

మొత్తం ఓటర్లు : 8. 52 లక్షలు

పురుషులు : 4.13 లక్షలు

మహిళలు : 4.39 లక్షలు

పోలింగ్ కేంద్రాలు : 1, 276

అసెంబ్లీ గడువు : 17.12.2023

Advertisement

Next Story

Most Viewed