సీఎం రేవంత్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి: తన్నీరు హరీష్ రావు

by Mahesh |
సీఎం రేవంత్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి: తన్నీరు హరీష్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ సీఎం కేసీఆర్ పై దూషణలు, కించపరిచే వ్యాఖ్యలు చేయడం సీఎం రేవంత్ రెడ్డి దిగజారుడు తనానికి నిదర్శనం అని, ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి గురువారం బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ తనే ప్రవచించిన ప్రమాణాలను పాటించకపోవడం ద్వంద ప్రమాణాలకు నిదర్శనం అని దుయ్యబట్టారు. రాహుల్ పై బీజేపీ తీవ్రవాది అని వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిందని, రాజకీయాల్లో దిగజారుడు విమర్శలను తీవ్రంగా ఖండించిందన్నారు. రాజ్యాంగ విలువలను దిగజారుస్తున్నారని మొసలి కన్నీరు కార్చిందని మండిపడ్డారు. అలాంటి దూషణలే కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి చేస్తే హై కమాండ్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇది కాంగ్రెస్ పార్టీ డబల్ స్టాండర్డ్స్ కాదా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో ఒక రూల్.. గల్లీలో ఒక రూల్ పాటించడం కాంగ్రెస్ కే చెల్లుతుందన్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విలువలకు విరుద్ధం అని, కాంగ్రెస్ హై కామెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి ప్రవర్తన మహాభారతంలో దుర్యోధనుడి క్రూరత్వంలా ఉందని లేఖలో దుయ్యబట్టారు. కాంగ్రెస్ తన నైతిక ప్రమాణాలను పాటించకుండా ఇతరులకు నీతులు చెప్పడం శోచనీయం అన్నారు. కేసీఆర్ పై, ఆయన కుటుంబం పై రేవంత్ రెడ్డి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చడం కాదా? అన్నారు. కేసీఆర్ ను రాళ్లతో కొట్టి చంపాలి అనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ హై కమాండ్ సమర్ధిస్తుందా? అని నిలదీశారు. హింసాత్మక వ్యాఖ్యలు చేయడం, జర్నలిస్టులపై దాడులు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రకటించిన రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని బీఆర్‌ఎస్ నాయకులపై నిరాధార కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడడం దుర్మార్గం అన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతుందని చెప్పేందుకు ఇది నిదర్శనం అన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద వైఖరి మహాభారతంలో ధృతరాష్ట్రుడు దుర్యోధనుడి దుర్మార్గాలను ఉపేక్షించడం లాంటిదే అన్నారు. రేవంత్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని, ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్న రేవంత్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రైతుల అరెస్టులకు ఖండన

రాష్ట్ర వ్యాప్తంగా రైతులను అరెస్టు చేయడాన్ని హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. రుణమాఫీ కాలేదన్న ఆవేదనతో రైతులందరూ సంఘటితమై ఛలో ప్రజా భవన్ కు పిలుపునిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు పుట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులను, రైతు సంఘాల నాయకులను ఎక్కడిక్కడ పోలీసు స్టేషన్లలో నిర్బంధిస్తూ వారి పై కక్ష తీర్చుకుంటున్నదన్నారు. రుణమాఫీ కోసం పోరు బాట పట్టిన రైతన్నలను అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య అని, బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అరెస్టులు చేసిన రైతులను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాది ఆంక్షలు లేని ప్రభుత్వం, కంచెలు లేని ప్రభుత్వం, ప్రజా పాలన అంటూ డబ్బా కొట్టుకునే రేవంత్ రెడ్డి ఇదేంది?అని నిలదీశారు. ప్రజా భవన్ చుట్టూ ఎందుకు ఇన్ని బ్యారెకేడ్లు, ఎందుకు ఇన్ని ఆంక్షలు అని ప్రశ్నించారు.

ప్రజా భవన్‌కు రైతులు తరలివస్తున్నారంటే సీఎంకు ఎందుకు అంత భయం? అన్నారు. రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా మొదలైన రైతుల ఉద్యమాన్ని ఎదుర్కోవడం అంటే.. రాజకీయంగా వెకిలి మకిలి, చిల్లర వ్యాఖ్యలు చేసినంత సులువు కాదు అన్నారు. రుణమాఫీ ఏమైందని నిలదీసేందుకు వస్తున్న రైతులకు ఏమని సమాధానం చెబుతావు? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి.. రైతులందరికి 2లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి, మాట తప్పావు... ఇప్పుడది నీకు, నీ ప్రభుత్వానికి ఉరితాడు కాబోతున్నదని హెచ్చరించారు. రుణమాఫీ చేసి తీరేదాకా, నిన్ను బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టదు.. తెలంగాణ రైతాంగం వదిలిపెట్టదు అన్నారు. రైతు ఏడ్చిన రాజ్యం..ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. చరిత్రలో ఏనాడూ బాగుపడలేదని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed