Biryani: మీరు మారరా? బిర్యానీలో టాబ్లెట్లు.. ఆర్టీసీ క్రాస్‌రోడ్ ప్రముఖ హోటల్లో ఘటన వైరల్

by Ramesh N |
Biryani: మీరు మారరా? బిర్యానీలో టాబ్లెట్లు.. ఆర్టీసీ క్రాస్‌రోడ్ ప్రముఖ హోటల్లో ఘటన వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీ (Hyderabadi biryani) అంటే ఫేమస్. ఫుడ్ లవర్స్ ఎవరైనా సరే నగరానికి వచ్చి మరి బిర్యానీ రుచి చూస్తుంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు బిర్యానీ ఇష్టంగా తింటుంటారు. అలాంటిది ఈ మధ్య పలు బిర్యానీ రెస్టారెంట్లలో నిర్లక్ష్యం కన్పిస్తోంది. ఇటీవల వరుసగా జెర్రి, బొద్దింకలు, పురుగులు, సిగరెట్ పీక లాంటివి బిర్యానీలో వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బిర్యానీ తిందామని (RTC Cross Road) ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌కు వచ్చిన ఓ కస్టమర్‌కు బిర్యానీలో ఏకంగా టాబ్లెట్ స్ట్రాప్ ప్రత్యక్షమైంది. అది కూడా బిర్యానీ తింటుండగా టాబ్లెట్ స్ట్రాప్ కనిపించే సరికి కస్టమర్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. బిర్యానితో పాటు తాను మెడిసిన్‌ని కూడా తింటున్నాను అంటూ కస్టమర్ వీడియో తీశాడు. ఇది ఏ మెడిసినో చెప్పాలంటూ హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించాడు. దీంతో యాజమాన్యం ఎలాంటి సమాధానం చెప్పలేకపోయంది. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అయింది.

నెటిజన్లు తీవ్ర స్థాయిలో బీర్యానీ హోటల్స్‌ను నిలదీస్తున్నారు. బిర్యానీ తినాలంటేనే భయం అవుతుంది.. ఇక మీరు మారరా? నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే ఉంటారా? అంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు హోటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను కస్టమర్లు కోరుతున్నారు. కాగా, గత కొన్ని రోజులుగా తెలంగాణలో చాలా హోటల్స్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. చాలా హోటల్స్‌లో అపరిశుభ్ర వాతావరణాన్ని గుర్తించి ఫైన్‌లు కూడా వేస్తున్నారు. అయినా కూడా హోటల్స్ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నాయని కస్టమర్లు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story