అగ్రనేత సోనియాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని టీ-కాంగ్రెస్ ప్లాన్.. AICC నిర్ణయంపై ఉత్కంఠ..!

by Satheesh |
అగ్రనేత సోనియాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని టీ-కాంగ్రెస్ ప్లాన్.. AICC నిర్ణయంపై ఉత్కంఠ..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని తెలంగాణ నుంచి గెలిపించుకునేందుకు పీసీసీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పటికే ఖమ్మం లేదా నల్లగొండ జిల్లాల్లోని స్థానాల నుంచి లోక్‌సభకు పోటీ చేయించేలా ఏఐసీసీకి ప్రతిపాదనలు వెళ్ళాయి. ఒకవేళ సోనియాగాంధీ ఆసక్తి చూపకుంటే రాజ్యసభకు రాష్ట్రం నుంచి పంపించాలని భావిస్తున్నది. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన పీఏసీ (పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ) సమావేశంలో పీసీసీ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపింది. రాష్ట్రంలో ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాల్లో రెండింట కాంగ్రెస్ గెలవనున్నది. ఇందులో ఒకటి ఏఐసీసీ కోటాకు, మరొకటి పీసీసీకి ఇచ్చేలా కసరత్తు జరుగుతున్నది. ఏఐసీసీ కోటాలో సోనియాగాంధీని రాజ్యసభ సభ్యురాలిగా పార్లమెంటుకు పంపించాలని పీసీసీ భావిస్తున్నది. త్వరలో ఏఐసీసీ హైకమాండ్ నుంచి నిర్ణయం వెలువడనున్నది.

మూడు స్థానాలకు ఏప్రిల్ 2వరకు గడువు..

రాష్ట్రంలోని మూడు రాజ్యసభ స్థానాల గడువు ఏప్రిల్ 2వ తేదీన ముగుస్తుండడంతో భర్తీ చేయడానికి కేంద్ర ఎలక్షన్ కమిషన్ సోమవారం షెడ్యూలు విడుదల చేసింది. ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ విడుదల కావడంతోనే నామినేషన్ల పర్వం ప్రారంభమవుతున్నది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఫిబ్రవరి 15న ముగుస్తున్నందున ఆ లోపే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి స్పష్టత రానున్నది. రాష్ట్ర అసెంబ్లీలోని ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం కాంగ్రెస్ రెండు స్థానాల్లో, బీఆర్ఎస్ ఒక స్థానంలో గెలుస్తాయి. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనున్నది. ఇతర నాయకులకు అవకాశం ఇస్తే విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతో సోనియాగాంధీ పోటీ చేస్తే పార్టీకి మైలేజ్‌ వస్తుందని స్టేట్ కాంగ్రెస్ నాయకుల భావన.

ఆశావహుల సంఖ్య ఎక్కువే..

అనారోగ్యం కారణంగా ప్రత్యక్ష ఎన్నికల్లో సోనియాగాంధీ ఈసారి పోటీ చేయకపోవచ్చని, రాయబరేలి స్థానాన్ని వదులుకుంటారని గతంలో ఏఐసీసీ వర్గాల నుంచి వార్తలు వినిపించాయి. కానీ సీనియర్ నేతగా ఆమె పార్లమెంటులో ఉండాలని కోరుకుంటున్న కాంగ్రెస్ లీడర్లు రాజ్యసభ ద్వారా గెలిపించుకోవాలని ఆలోచించారు. ఇక స్టేట్ కోటాలో మిగిలిన ఒక సీటు నుంచి పోటీ చేయడానికి చాలామంది సీనియర్ నేతలు ఆసక్తి కనబరుస్తున్నారు. జానారెడ్డి, చిన్నారెడ్డి, వీ.హనుమంతరావు, రేణుకాచౌదరి, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, మధుయాష్కీ తదితర పేర్లు వినిపిస్తున్నాయి. అద్దంకి దయాకర్ కూడా రేసులో ఉన్నట్లు గాంధీభవన్ వర్గాల సమాచారం. గెలిచే సీటు కావడంతో పోటీ తీవ్రంగా ఉన్నది.

బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు..?

మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకటి బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉన్నది. జోగినపల్లి సంతోష్ కుమార్‌తో పాటు బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర పదవీకాలం ఏప్రిల్ 2న ముగియనున్నది. ఈసారి ఇందులో ఎవరినైనా మరోసారి రాజ్యసభకు పంపేలా కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారా..? లేక తానే స్వయంగా వెళ్తారా..? కుటుంబం నుంచే ఒకరికి అవకాశం కల్పిస్తారా..? కొత్త అభ్యర్థిని ఖరారు చేస్తారా..? అని పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. కచ్చితంగా గెలిచే సీటు కావడంతో కేసీఆర్ ప్రాధాన్యతలు ఎలా ఉంటాయన్నది కీలకంగా మారింది. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్‌లో చేరిన పొన్నాల లక్ష్మయ్య, చెరుకు సుధాకర్ గౌడ్, కాసాని జ్ఞానేశ్వర్ సహా స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ తదితరులకు అవకాశం ఇవ్వొచ్చన్న మాటలూ వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed