BJP: హై కమాండ్ నిర్ణయంతో ఇరకాటంలో టీ-బీజేపీ.. అసెంబ్లీలో కాంగ్రెస్‌పై నోరు విప్పలేని పరిస్థితి..!

by Satheesh |
BJP: హై కమాండ్ నిర్ణయంతో ఇరకాటంలో టీ-బీజేపీ.. అసెంబ్లీలో కాంగ్రెస్‌పై నోరు విప్పలేని పరిస్థితి..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిన చందంగా కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధుల కేటాయింపు లేకపోవడం ఇక్కడి బీజేపీ ఎమ్మెల్యేల మెడకు చుట్టుకోనున్నది. ఇప్పటివరకూ ఆరు గ్యారంటీలను అమలు చేయలేదంటూ పదేపదే విమర్శలు చేస్తున్న బీజేపీ డిఫెన్సులో పడింది. అసెంబ్లీ బడ్జెట్ సెషన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశాన్ని కోల్పోతున్నది. ఎనిమిది మంది ఎంపీలను గెలిపిస్తే తెలంగాణకు తెచ్చిందేంటి అని సూటిగానే ఆ పార్టీ ఎమ్మెల్యేలను తూర్పారబట్టడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు బలమైన అస్త్రం దొరికినట్లయింది. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూ.. కాషాయ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టడానికి ఈ రెండు పార్టీలకూ అవకాశం చిక్కింది. అటు కేంద్ర బడ్జెట్‌ను సమర్థించుకోలేక, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించలేక బీజేపీ ఎమ్మెల్యేలు ఇరకాటంలో పడ్డారు.

ఇరు పార్టీల విమర్శలకు బీజేపీ సతమతమయ్యే పరిస్థితి

తెలంగాణలో విస్తరిస్తున్నామని ఇప్పటివరకూ ధీమాగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు డైలమాలో పడ్డారు. భట్టి, ఉత్తమ్, రేవంత్ ట్యాక్స్ అంటూ నిన్నమొన్నటి దాకా ఆరోపణలు చేసిన బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గొంతు విప్పలేని డైలమాలో పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి అవకాశం లేకుండాపోయింది. తెలంగాణలో బీజేపీ బలపడుతున్నదని, గతంలో ఒక్క ఎమ్మెల్యే ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య ఎనిమిదికి పెరిగిందని, లోక్‌సభలో సైతం ఎంపీల సంఖ్య నాలుగు నుంచి ఎనిమిదికి పెరిగిందని ఇంతకాలం ఆ పార్టీ నేతలు గొప్పగా చెప్పుకున్నారు. కానీ నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో తెలంగాణకు సాయం లేకపోవడంతో రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ విమర్శలకు సమాధానం చెప్పుకోలేక సతమతమయ్యే పరిస్థితి నెలకొన్నది. రాష్ట్ర బడ్జెట్‌పై విమర్శలు చేయడానికి సాహసించకపోవచ్చనే జనరల్ టాక్ మొదలైంది.

అడ్వాంటేజ్ పొజిషన్‌లో బీఆర్ఎస్‌

మొదటి నుంచీ బీజేపీ మీద, కేంద్ర ప్రభుత్వ వైఖరి మీద నిప్పులు చెరుగుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇప్పుడు కేంద్ర బడ్జెట్‌తో మరింత బలం చేకూరినట్లయింది. పదేండ్లుగా తెలంగాణకు బీజేపీ ఇచ్చింది ‘గుండు సున్నా’ అంటూ ఓపెన్‌గానే చేస్తున్న విమర్శలు.. రానున్న రోజుల్లో మరింత తీవ్రరూపం దాల్చే అవకాశమున్నది. రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్నందున కాంగ్రెస్‌పైనా గట్టిగానే విమర్శలు, ఆరోపణలు చేస్తూ ఉన్న గులాబీ నేతలు కేంద్రం నుంచి నిధులు తెప్పించుకోవడంలో ఫెయిల్ అయిందనే కొత్త అస్త్రాన్ని ప్రయోగించడానికి ఆస్కారం లభించింది. ఇప్పటికే ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి ప్రయోజనమేమున్నదంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఎప్పటికైనా రాష్ట్రాల అభివృద్ధికి, భవిష్యత్తుకు బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీలే శ్రీరామరక్ష అని వ్యాఖ్యానిస్తున్నారు. ఏకకాలంలో కాంగ్రెస్, బీజేపీలను కార్నర్ చేయడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అవకాశం దొరికినట్లయింది.

బీజేపీపై ఇక కాంగ్రెస్ దూకుడు

నమ్మించి ఓటు వేసి 8 మంది ఎంపీలను గెలిపించిన తెలంగాణ ప్రజలకు తాజా కేంద్ర బడ్జెట్‌లో ఇచ్చింది ‘గాడిద గుడ్డు’ అని బలంగా విమర్శించడానికి పరిస్థితులు సుగమమయ్యాయి. వారం రోజుల పాటు ఢిల్లీలో ఉండి ప్రధాని సహా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి ఇతోధిక సాయం చేయాలని కోరినా చివరకు మొండిచేయే ఎదురైందని, రాష్ట్రాల అభివృద్ధి పట్ల బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా..? అంటూ ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ వేదికగా బీజేపీని టార్గెట్ చేసే అవకాశాలున్నాయి. ఇంతకాలం రాష్ట్రాల హక్కుల్ని కాలరాసిన కేంద్రం ఇప్పుడు వివక్షతో వాటిని ఆర్థికంగా దెబ్బతీసే కుట్రకు పాల్పడుతున్నదంటూ బీజేపీని టార్గెట్ చేసే అవకాశమున్నది. 8 మంది బీజేపీ ఎంపీలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలనే పిలుపుతో ప్రజాకోర్టులో వారిని ఒంటరిని చేసేలా పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేసే అవకాశాలున్నాయి.

Advertisement

Next Story