ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం చేసారని అనుమానం.. బీఆర్ఎస్ నాయకుల సస్పెన్షన్

by M.Rajitha |
ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం చేసారని అనుమానం.. బీఆర్ఎస్ నాయకుల సస్పెన్షన్
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి బీఆర్ఎస్ లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పార్టీలో ముఖ్య నాయకులుగా కొనసాగుతున్న ఐదుగురిని సస్పెండ్ చేస్తూ కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేసారు. మాజీ మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి తండ్రి నిట్టు వేణుగోపాల్ రావు, బాబాయ్ నిట్టు కృష్ణమోహన్ రావు, దేవునిపల్లి మాజీ సర్పంచ్ నిట్టు వెంకట్ రావు, నాయకులు ముప్పారపు ఆనంద్, ముదాం నవీన్ లను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. గత ఎంపీ ఎన్నికల్లో పార్టీకి దూరంగా ఉంటూ బహిరంగంగానే బీజేపీకి మద్దతు తెలపడంతో పాటు బీజేపీ తరపున ప్రచారం నిర్వహించినందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అంశం కామారెడ్డి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో మున్సిపల్ చైర్మన్ కు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మధ్య వివాదం నడుస్తుందన్న ప్రచారం సాగింది. అయితే కామారెడ్డి నుంచి మాజీ సీఎం కేసీఆర్ పోటీ నేపథ్యంలో గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలుకుతూ అందరిని ఏకతాటిపైకి తెచ్చినా పార్టీలో గ్రూపు రాజకీయాలు మరోసారి బహిర్గతం కావడంతో పార్టీ నుంచి కొందరిని సస్పెండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ పీఠంపై కన్నేశారు. మున్సిపల్ చైర్మన్ గా వేణుగోపాల్ కూతురు జాహ్నవి ఉండటం.. అప్పటికే పార్టీలో గ్రూపులు ఉండటంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు బహిరంగంగానే కాంగ్రెస్ కు మద్దతు పలికారు. దాంతో వేణుగోపాల్ టార్గెట్ గా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కాంగ్రెస్ కు మద్దతు పలికారని, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని గతంలో నిట్టు వేణుగోపాల్ రావు మీడియా ముఖంగా ఆరోపణలు చేశారు. తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని తెలిపినా పార్టీ ఆయన వర్గానికి అంతగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి విషయంలో పార్టీ నాయకుల నిరసన కార్యక్రమంలో నిట్టు వేణుగోపాల్ రావు ప్రత్యక్షం కావడం, సాయంత్రంలోపు ఆయనను, ఆయన వర్గాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారన్న కారణంతో పార్టీ నుంచి ఎన్నికలు ముగిసిన ఇన్నాళ్ళకు సస్పెండ్ చేయడం వెనుక కారణాలు ఏంటనే చర్చ సాగుతోంది. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే ఇంతకాలం వేచిచూసే ధోరణి ఎందుకు అవలంబించారన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అయితే రాత్రి వరకు కూడా సస్పెండ్ అయిన నాయకుల నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. పార్టీ సస్పెన్షన్ పై నాయకుల స్పందనపై నియోజకవర్గంలో చర్చ కొనసాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed