ప్రీతి మరణం భయంకరమైనది.. నిందితులను కఠినంగా శిక్షించాలి: గవర్నర్ ఫైర్

by sudharani |
ప్రీతి మరణం భయంకరమైనది.. నిందితులను కఠినంగా శిక్షించాలి: గవర్నర్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : వరంగల్ మెడికో ప్రీతి ఆత్మహత్య ఘటనపై రాజ్‌భవన్ సీరియస్ అయింది. డాక్టర్ ప్రీతి ఆరోగ్యం సరిగా లేదని సమాచారం ఇచ్చిన కాళోజీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ వీసీకి మంగళవారం గవర్నర్ లేఖ రాశారు. ప్రీతి ఆరోగ్యంపై తప్పుడు సమాచారం ఇచ్చి నిందితుడ్ని కాపాడేందుకు ప్రయత్నించారని యూనివర్సిటీ అధికారులపై తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాగింగ్ నిరోధక చర్యలు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియంత్రణలో ఉన్న యంత్రాంగంపై నివేదిక ఇవ్వాలని లేఖలో కోరారు. ప్రీతి ఘటనపై అన్ని కోణాల నుంచి సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ప్రీతి మరణం భయంకరమైందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక, ప్రీతి ఘటనతో మెడికల్ కాలేజీలపై గవర్నర్ తమిళిసై దృష్టి సారించారు. మెడికల్ కాలేజీలలో యాంటి ర్యాగింగ్ చర్యలు గట్టిగా తీసుకోవాలని గవర్నర్ తమిళిసై సూచించారు. మహిళా మెడికోలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇలాంటి సంఘటనలలో ఎలాంటి ఉదాసీనత లేకుండా, తక్షణం స్పందించి కాలేజీలలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రతి మెడికల్ కాలేజీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే పీజీ మెడికోల డ్యూటీ సమయాలు, వారికి సంబంధించి సరైన విశ్రాంతి లాంటి అంశాలపై శ్రద్ధ పెట్టాలని చెప్పారు. మహిళా మెడికోల కోసం కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని గవర్నర్ తమిళిసై ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా అధికారులు మెరుగైన అవగాహన కల్పించాలని, గవర్నర్ వైస్ ఛాన్సలర్‌ను లేఖలో ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed