సునీల్ కనుగోలు స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు

by samatah |   ( Updated:2023-01-09 14:12:34.0  )
సునీల్ కనుగోలు స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో : కాంగ్రెస్ వార్‌రూం కేసులో మొదటి సారి సైబర్ క్రైమ్ పోలీసుల ముందు వ్యహకర్త సునీల్ కనుగోలు విచారణకు హాజరయ్యాడు. సోమవారం బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ రూంలో దాదాపు గంటన్నరపాటు సైబర్‌క్రైం పోలీసులు సునీల్ కనుగోలును విచారించారు. మొదట అనారోగ్య కారణాలతో రాలేనని సునీల్ కనుగోలు పోలీసులకు లేఖ ద్వారా సమాచారం ఇచ్చాడు. సునీల్ విజ్ఞప్తిని పోలీసులు తిరస్కరించడంతో కాసేపటికే పోలీసులు అడిగిన పలు డాక్యుమెంట్లతో విచారణకు హాజరయ్యాడు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరైన సునీల్ కనుగోలు నుంచి వీడియో మార్ఫింగ్‌పై పోలీసులు స్టేట్మెంట్‌ను రికార్డ్ చేశారు. సైబర్ క్రైం ఏసీపీ ప్రసాద్ ఆధ్వర్యంలో సునీల్ కనుగోలు విచారణ జరిగింది.

ఈ విచారణలో భాగంగా కేసుకు సంబంధించి సునీల్ కీలక సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. కాగా, ఈ కేసులో సునీల్ మరోసారి విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే, ఇదే కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లురవికి సైబర్ క్రైం పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. ఈరోజు సాయంత్రం 41 సీఆర్పీసీ కింద మల్లురవికి పోలీసులు నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. మల్లు రవిని మూడు రోజుల్లోగా విచారణకు హాజరుకావాలని సీసీఎస్ పోలీసులు నోటీసుల్లో పేర్కొననున్నారు. కాగా, ఈ కేసులో డిసెంబర్ 27వ తేదీన విచారణకు హాజరుకావాలని 41ఏ సీఆర్పీసీ కింద సునీల్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఇచ్చిన 41ఏ నోటీసులను సవాల్ చేస్తూ సునీల్ కనుగొలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. విచారణ జరిపిన ధర్మాసనం 41ఏ నోటీసులు పై స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈ నేఫథ్యంలో సైబర్ క్రైమ్ విచారణకు సహకరించాలని సునీల్ కనుగొలుకు హైకోర్టు ఆదేశించింది. విచారణ చేయాలి తప్ప, అరెస్ట్ చేయవద్దని పోలీసులకు కూడా హైకోర్టు ఆదేశించింది. కాగా, కాంగ్రెస్ వార్ రూమ్ కేంద్రంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితను కించ పరిచేలా సోషియల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో 41ఏ నోటీసులు ఇచ్చి, హైకోర్టు ఆదేశాలతో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

Next Story