రోజురోజుకు పెరుగుతోన్న విద్యార్థుల సూసైడ్స్.. తొమ్మిదేళ్లలో ఎంతమంది చనిపోయారంటే?

by Satheesh |
రోజురోజుకు పెరుగుతోన్న విద్యార్థుల సూసైడ్స్.. తొమ్మిదేళ్లలో ఎంతమంది చనిపోయారంటే?
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థులు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. జన్మనిచ్చిన వారికి తీరని శోకాన్ని మిగిలిస్తున్నారు. ఇటీవల నల్సార్​లా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్​ దళిత, ఆదివాసీ విద్యార్థి వర్గాల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

తొమ్మిదేళ్లలో 3,600 మంది విద్యార్థులు..

రాష్ట్ర వ్యాప్తంగా 2014 నుంచి 2022 మధ్య మూడువేల తొమ్మిది మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్టు నేషనల్ క్రైం రికార్డ్​బ్యూరో లెక్కలు చెబుతున్నాయి. అంటే సగటున నెలకు కనీసం 33 మంది విద్యార్థులు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు.

సీనియర్ల వేధింపులు.. ర్యాగింగ్..

కోటి ఆశలతో వైద్య వృత్తిలోకి వచ్చిన ప్రీతికి కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్​అయిన సైఫ్​కాళరాత్రులు చూపించాడు. వాట్సాప్​ మెసేజీలతో పాటు పలు రకాలుగా ఆమెను మానసికంగా చిత్రహింసలకు గురి చేశాడు. సైఫ్​వేధింపులు భరించలేని స్థాయికి చేరుకోవటంతో తట్టుకోలేకపోయిన ప్రీతి ప్రాణాలు తీసుకుంది. ఇలా సీనియర్ల వేధింపులు, ర్యాగింగ్​కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు అనేకం ఉన్నాయి.

ప్రేమ వ్యవహారాలు..

కాలేజీల్లో చిగురించిన ప్రేమ వ్యవహారాలు కొన్నిసార్లు విద్యార్థుల ఆత్మహత్యకు కారణమవుతున్నది. వరంగల్‌లో ఉంటూ ఇంజినీరింగ్​చదువుతున్న రక్షిత విషాదాంతం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఆమెతో పాటు చదువుతున్న రాహుల్ అనే విద్యార్థి రక్షితపట్ల ఇష్టాన్ని పెంచుకున్నాడు. అయితే, ఆమె జస్వంత్​అనే విద్యార్థితో చనువుగా ఉండటంతో పగ పెంచుకున్న రాహుల్ సోషల్​మీడియాలో రక్షిత, జస్వంత్‌ల ఫొటోలను వైరల్​చేశాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో రక్షితను మందలించారు. దీనిని అవమానంగా భావించిన రక్షిత ఆత్మహత్య చేసుకుంది.

ఆన్​లైన్​ బెట్టింగులు..

మొదట్లో కొంత లాభాలను వీరి కళ్లకు చూపిస్తున్న బెట్టింగ్​నిర్వాహకులు ఆ తరువాత ఉన్నదంతా కొల్లగొడుతున్నారు. పోగొట్టుకున్న డబ్బును తిరిగి సంపాదించాలని బెట్టింగుల కోసం వేలు, లక్షల్లో అప్పులు చేసి, ఎలా చెల్లించాలో అర్థంకాక ఆత్మహత్య చేసుకుంటున్నారు. హన్మకొండ జిల్లాకు చెందిన రామకృష్ణారెడ్డి ఇలానే బలయ్యాడు.

లోన్​యాప్‌లు

కొన్నిసార్లు లోన్​యాప్‌లు విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. నాలుగు స్టెప్పుల్లో 5 వేల నుంచి 5‌‌0 వేల రూపాయల వరకు రుణం పొందవచ్చు. తల్లిదండ్రులు చాలినంత పాకెట్ మనీ ఇవ్వడం లేదనో.. పార్టీల కోసమో ఈ యాప్‌ల ద్వారా లోన్లు తీసుకుంటున్న విద్యార్థుల సంఖ్య వేలల్లోనే ఉంటోంది. లోన్​ చెల్లించినా ఇంకా డబ్బు కట్టాల్సి ఉందని వేధిస్తున్నాయి. రుణం తీసుకున్న వారి ఫోన్​బుక్‌లో ఉన్న నెంబర్లకు మా నుంచి లోన్​తీసుకుని కట్టటం లేదంటూ అభ్యంతరకర మెస్సేజ్‌లు పెడుతున్నాయి. దీన్ని అవమానంగా భావిస్తున్న విద్యార్థులు కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. సరూర్​నగర్​ప్రాంతంలో నివాసముండే ప్రశాంత్ అనే డిగ్రీ విద్యార్థి లోన్ యాప్ ఉచ్చులో చిక్కి ప్రాణాలు తీసుకున్నాడు.

చదువుల ఒత్తిడి..

చదువుల ఒత్తిడి కూడా విద్యార్థుల ఆత్మహత్యకు కారణమవుతోంది. ర్యాంకులు, మార్కుల కోసం చేసే ఒత్తిడిని భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కుటుంబాల ఆర్థిక పరిస్థితులు, చదువు పూర్తి చేసినా ఉద్యోగం దొరుకుతుందో? లేదో? అన్న భయం కొంతమంది బలవన్మరణాలకు కారణమవుతున్నాయి.

కన్నేసి ఉంచాలి..

తల్లిదండ్రులు ర్యాంకులే కొలమానంగా పిల్లలను చూడడం మానుకోవాలని మానసిక వైద్యుడు డాక్టర్​ గోపీ చెప్పారు. దీంతో పిల్లలపై తీవ్ర ఒత్తడి పడుతుందన్నారు. ఒక వయసు వచ్చిన తరువాత పిల్లలపై కన్నేసి ఉంచాలని తెలిపారు. వారితో స్నేహితుల్లా వ్యవహరిస్తూ రోజుకు కనీసం పదిహేను నిమిషాలైనా మాట్లాడాలని సూచించారు.

Advertisement

Next Story