KTR: కేటీఆర్ క్షమాపణలు చెప్పారు.. మహిళా కమిషన్ ప్రకటన

by Prasad Jukanti |
KTR: కేటీఆర్ క్షమాపణలు చెప్పారు.. మహిళా కమిషన్ ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్ క్షమాపణలు చెప్పారని రాష్ట్ర మహిళా కమిషన్ వెల్లడించింది. కేటీఆర్ మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయగా శనివారం కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ హాజరుపై మహిళా కమిషన్ ప్రకటన విడుదల చేసింది. తాము జారీ చేసిన నోటీసులపై కేటీఆర్ స్పందించి తమ ఎదుట హాజరై వివరణ ఇచ్చారని పేర్కొంది. తన వ్యాఖ్యల పట్ల కేటీఆర్ విచారం వ్యక్తం చేశారని, అధికారికంగా క్షమాపణలు చెప్పారని తెలిపింది. తన స్థాయికి తగ్గ నాయకత్వ హోదాలో ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదని అంగీకరించారని కమిషన్ వెల్లడించింది. కేటీఆర్ క్షమాపణలను మహిళా కమిషన్ అంగీకరించిందని, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కేటీఆర్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు కమిషన్ తెలిపింది. ఒకవేళ ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతం అయితే కమిషన్ తగిన విధంగా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించినట్లు పేర్కొంది.

Advertisement

Next Story