- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ న్యూస్: బయ్యారంపై ‘‘పాలిటిక్స్’’.. వచ్చే ఎన్నికల్లో గట్టెక్కేందుకు BRS నయా ప్లాన్..!
రాష్ట్రంలో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశం మరో సారి చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ‘జిందాల్’ టీంతో సర్వే చేయిస్తున్నది. గతంలో కేంద్రం ఏర్పాటు చేసిన సెయిల్ టీం.. ఇక్కడి ఇనుములో నాణ్యత తక్కువ ఉందని రిపోర్టు ఇవ్వడంతో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిరాకరించింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని జిందాల్ టీం రిపోర్టులోనూ అదే వెల్లడి కానున్నదని, కానీ వచ్చే ఎన్నికల వరకు ఈ రిపోర్టును బహిర్గతం చేయకుండా సర్వేలు, అధ్యయనం పేరుతో హడావుడి చేసి, అసెంబ్లీ ఎలక్షన్స్‌లో లబ్ధి పొందేందుకు గులాబీ పార్టీ ప్లాన్ చేస్తున్నదనే అనుమానాలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
దిశ, వరంగల్ బ్యూరో: బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయం ఏండ్లుగా ప్రస్తావనకు వస్తున్నా.. దానికి ముగింపు కలగడం లేదు. దీనిపై కేంద్రం ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దానిపై ప్రకటనలు చేస్తూ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నదన్న విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో దాదాపు 5,342 హెక్టార్లలో బయ్యారం గనులు విస్తరించాయి.
మహబూబాబాద్ జిల్లా గార్ల, నేలకొండపల్లి మండలాలతో పాటు ఖమ్మం జిల్లా గూడూరు మండలంలో ఈ గనులు ఉన్నాయి. ఇక్కడ లభించే ఇనుప ఖనిజం విలువ దాదాపు రూ.16 లక్షల కోట్లు ఉంటుందని గతంలో అంచనా వేశారు. ప్రస్తుతం అది రెట్టింపు అయ్యే చాన్స్ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశం చర్చకు వస్తున్నది. దీనిని ఎన్నికల సమయంలో తెరపైకి తెచ్చి సర్వేలు చేసి హడావుడి చేయడం తర్వాత అంతా సైలెంట్ అయిపోవడం పరిపాటిగా మారింది.
సాధ్యం కాదన్న కేంద్ర ప్రభుత్వం
స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశం రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచారు. చట్టంలోని 13వ క్లాజ్‌లో అప్పటి ఖమ్మం జిల్లాలోని బయ్యారంలో రూ.30 వేల కోట్ల వ్యయంతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. సర్వేలు, జాయింట్ సర్వేల పేరుతో కాలయాపనే చేస్తూనే ఉంది. 2016, 2017లో సెయిల్ బృందంతో ఇనుప ఖనిజం నాణ్యత, స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యసాధ్యలపై కేంద్రం అధ్యయనం చేయించింది. దాదాపు మూడున్నర నెలల పాటు ఈ బృందం అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక అందజేసింది. బయ్యారంలోని ఖనిజంలో ఇనుములో నాణ్యత లేదని అందులో పేర్కొంది. దీంతో అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
సొంతగా ఏర్పాటు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం
బయ్యారం గనుల్లో నాణ్యమైన ఇనుప ఖనిజం ఉందని, స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం ఇష్టం లేకే సెయిల్ బృందంతో కేంద్ర ప్రభుత్వం తప్పుడు నివేదిక ఇప్పించిందని రాష్ట్ర ప్రభుత్వం విమర్శించింది. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులతో ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పలుమార్లు ప్రకటించారు.
కానీ ఇప్పటి వరకు దానిపై ముందడుగు పడలేదు. గతంలో సింగరేణి సంస్థ సైతం కొద్దిరోజులు అధ్యయనం చేసినా పట్టాలెక్కలేదు. 2018 తర్వాత ఆ అంశం పూర్తిగా మూలన పడింది. కానీ తాజాగా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తెరపైకి తీసుకురావడం చర్చనీయాంగా మారింది. తాజాగా జేఎస్‌డబ్ల్యూ (జిందాల్ సౌత్ వెస్ట్) కంపెనీ ప్రతినిధులు రిజర్వు ఫారెస్టులో రెండు రోజులు అధ్యయనం చేసింది.
ఇద్దరు జియాలజిస్ట్‌లు, మహబూబాబాద్ జిల్లా మైనింగ్ ఇన్‌చార్జి ఏడీ రవీందర్, టీఏ నరేశ్‌తో కలిసి ఆరుగురు సభ్యుల బృందం ఈనెల 2, 3వ తేదీల్లో పర్యటించింది. బయ్యారం మండలంలోని పలు ప్రాంతాల్లోని ఖనిజ నిక్షేపాలున్న గుట్టలను పరిశీలించింది. జాఫరాబాద్, బాలాజీపేట, ఇర్సులాపురం, చర్లపల్లి, చింతోనిగుంపు గ్రామాలను ఆనుకొని ఉన్న పెద్ద గుట్టతో పాటు, ఇర్సులాపురం శివారులో ఉన్న నక్కల గుట్ట, మెట్ల తిమ్మాపురం శివారులోని ఎర్రమ్మ గుట్ట ప్రాంతాలను సర్వే చేసింది.
గుట్టల్లో నిక్షిప్తమైన ఉక్కు ఖనిజ లభ్యత, నాణ్యత వంటి వాటిపై ఆరాతీసింది. అధునాతన యంత్రాలను ఉపయెగించి శాంపిల్స్ సేకరించారు. ఈ ప్రదేశంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఎన్ని సంవత్సరాల పాటు ఖనిజం వెలికి తీయవచ్చనే విషయంపైనా అధ్యయనం చేశారు. అయితే ఇందులోనూ ఇనుములో నాణ్యత లేదనే విషయం వెల్లడి అవుతుందని, కానీ ఎన్నికల సమయంలో కాస్త హడావుడి చేసి అక్కడి ఓట్లతో గట్టేక్కేందుకు రాష్ట్ర సర్కారు ప్లాన్ చేస్తున్నదన్న విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికల స్టంట్..?
బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ అంశంపై ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లా ఆదివాసీ, గిరిజన ప్రాంతవాసుల్లో ఆశ, నిరాశ, నిస్పృహాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల ఏజెండాగా మారుతున్న బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అంశం.. తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. స్టీల్ వ్యాపారంలో ప్రఖ్యాతిగాంచిన జేఎస్‌డబ్ల్యూ (జిందాల్ సౌత్ వెస్ట్) కంపెనీ ప్రతినిధుల బృందం పర్యటనపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఆశాభావం వ్యక్తం చేస్తుండగా, మరికొంతమంది ఎన్నికల స్టంట్ అంటూ మరి కొందరు విమర్శిస్తున్నారు.
గతంలో జరిగిన సర్వేలను గుర్తు చేస్తున్నారు. గతంలో సెయిల్ టీం రిపోర్టులో వచ్చిన విషయాలే జిందాల్ టీం రిపోర్టులోనూ వస్తాయని కానీ, వాటిని రాష్ట్ర ప్రభుత్వం బహిర్గతం చేయకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకూ అధ్యయనం పేరుతో హడావుడిని కొనసాగించి, ఎలక్షన్స్‌లో లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తుందనే అనుమానాలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
బిగ్ న్యూస్: నెల రోజుల తర్వాత నిజమైన ప్రధాని మోడీ అంచనాలు.. ఒక్కటైనా ఎనిమిది పార్టీలు!