నేడు బాధ్యతలు స్వీకరించనున్న కొత్త బీసీ కమిషన్.. త్వరలో కులగణనపై విధాన నిర్ణయం

by Gantepaka Srikanth |
నేడు బాధ్యతలు స్వీకరించనున్న కొత్త బీసీ కమిషన్.. త్వరలో కులగణనపై విధాన నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రోగ్రామ్ షెడ్యూలు రూపొందించడంతో బీసీ రిజర్వేషన్‌న్లు ఖరారు చేయడం కొత్త బీసీ కమిషన్‌కు ఫస్టు ప్రయారిటీగా మారింది. సీనియర్ కాంగ్రెస్ నేత నిరంజన్‌ను చైర్మన్‌గా, మరో ముగ్గురిని సభ్యులుగా పేర్కొంటూ కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేయడంతో వీరు సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే బీసీల వెనకబాటు తనాన్ని స్టడీ చేసి ఆ మేరకు రిజర్వేషన్‌ను ఖరారు చేయాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఆ ప్రక్రియను కొలిక్కి తేవడం కొత్త కమిషన్ తక్షణ కర్తవ్యంగా మారింది. ఇందుకోసం కులగణనను చేపడుతుందా?.. లేక కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్ల జాబితా ప్రకారం ఇంటింటి సర్వే చేసి లెక్కలను కొలిక్కి తెస్తుందా?.. అనేది ఆసక్తిగా మారింది.

కులగణన చేపట్టనున్నట్లు ఇప్పటికే అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తెస్తున్నది. జాతీయ స్థాయిలోనే కులగణనపై కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో స్పష్టమైన హామీ ఇచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో తొలుత కులగణన చేపట్టి ఆ వివరాలను ప్రామాణికంగా తీసుకుని పంచాయతీ ఎన్నికలకు బీసీ రిజర్వేషన్‌ను ఖరారు చేస్తుందా?.. లేక దీనికి సమయం పట్టవచ్చేనే కారణంతో దాని కంటే ముందే ఎన్నికలకు వెళ్తుందా?.. ఇందుకు పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఇంటింటి సర్వే చేయించి ఆ గణాంకాలను ఆధారంగా తీసుకుని బీసీ రిజర్వేషన్ ఫార్ములాను ఖరారు చేస్తుందా?.. ఇలాంటివన్నీ ఆసక్తికరంగా మారాయి. కొత్తగా ఏర్పడిన బీసీ కమిషన్ సోమవారం బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి సమావేశంలో స్థానిక ఎన్నికల అంశంపై చర్చించి రోడ్ మ్యాప్ రూపొందించుకోనున్నది.

స్థానిక సంస్థలను ఎప్పటివరకు నిర్వహించాలనే ప్రభుత్వ ప్రణాళికకు అనుగుణంగా బీసీ కమిషన్ నిర్ణయం తీసుకోనున్నది. ఇప్పటికే వార్డులు, పంచాయతీల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితా, ఓటర్ల నుంచి అభ్యంతరాలు, మార్పులు చేర్పులు, తుది జాబితా విడుదల, వాటిని డిస్‌ప్లే చేయడం.. వీటన్నింటికీ తేదీలను ప్రకటించింది. తుది జాబితా ఫైనల్ అయిన తర్వాత దాని ఆధారంగా పంచాయతీరాజ్ అధికారులు ఇంటింటి సర్వే చేసే కులాలవారీగా ఓటర్ల సంఖ్యను నిర్ధారించడం, అదే సమయంలో రాజకీయంగా బీసీల వెనకబాటుతనాన్ని స్టడీ చేయడానికి బీసీ కమిషన్ అన్ని గ్రామాల్లోని స్థానిక ప్రజాప్రతినిధుల వివరాలను సేకరించడం పూర్తి కావాల్సి ఉంటుంది. వివిధ శాఖలతో సమన్వయంతో జరగాల్సిన ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే స్టేట్ బీసీ కమిషన్ స్థానిక గ్రామీణ సంస్థల ఎన్నికలపై స్పష్టతకు వచ్చే అవకాశమున్నది. ఇదే సమయంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పదవీకాలం సెప్టెంబరు 8తో ముగిసినందున ఎన్నికల నిర్వహణపైనా బీసీ కమిషన్ చర్చించి నిర్ణయం తీసుకోనున్నది. స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా ఇప్పు డున్న అధికారినే ప్రభుత్వం కొనసాగిస్తుందా?.. లేక కొత్త అధికారిని నియమిస్తుందా?.. అనే అంశంపైనా స్పష్టత రావాల్సి ఉన్నది. పాత బీసీ కమిషన్ స్థానంలో కొత్త బాడీ నియామకం కావ డంతో ఈ అంశంలో అధ్యయనం చేయడానికి, స్పష్టతకు రావడానికి కొంత సమయం పట్టవచ్చని, ఆ తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ ఫార్ములా విషయంలో విధాన నిర్ణయం తీసుకునే అవకాశమున్నదనే ఊహాగానాలు వస్తున్నాయి.

రిజర్వేషన్ల ప్రక్రియలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు తప్పనిసరి

రిజర్వేషన్ల ప్రక్రియలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు తప్పనిసరి కావడంతో కులగణన పూర్తయిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాలు పట్టుబడుతున్నాయి. అది జరగకుండా హడావిడిగా స్థానిక ఎన్నికలను నిర్వహిస్తే బీసీలకు అన్యాయం జరుగుతుందనే అనుమానాన్ని వ్యక్తం చేశాయి. దీంతో కులగణనకు గతంలో కర్ణాటక, బిహార్ లాంటి రాష్ట్రాలు చేసిన కసరత్తు, పట్టిన సమయం, బీసీ కమిషన్ అధ్యయనం, ఫార్ములా రూపకల్పనకు తీసుకున్న గడువు.. వీటన్నింటినీ కొత్త బీసీ కమిషన్ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా బీసీ రిజర్వేషన్ ఫార్ములాను రూపొందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఏ కారణంచేతనైనా కోర్టులో పిటిషన్లు దాఖలైతే ఎన్నికల ప్రక్రియ అర్ధంతరంగా ఆగిపోయే అవకాశమున్నదనే భావనతో ఉన్నది. ఇప్పటికే స్థానిక సంస్థల గడువు ముగిసి ఏడు నెలలు పూర్తవుతున్నందున వీలైనంత తొందరగా ఎన్నికలను నిర్వహించి కొత్త బాడీలు ఏర్పడాలనే డిమాండ్ వస్తున్నది. అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని బీసీ కమిషన్ స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోనున్నది.

Advertisement

Next Story

Most Viewed