- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
TG Budget: స్టేట్ బడ్జెట్ రియల్ ఎస్టేట్‌కి ఊతం
దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. చారిత్రక నగరం ఇప్పటికే ఐకాన్ గా గుర్తింపు సంపాదించింది. హైదరాబాద్ చుట్టుపక్కల అభివృద్ధి అనూహ్యమైంది. ఈ క్రమంలోనే దేశంలో మరే ఇతర ప్రాంతాల్లో లేనంతగా రియల్ ఎస్టేట్ రంగం విరాజిల్లుతున్నది. నగరం నుంచి ఎటూ 100 కి.మీ. మేరకు వ్యాపారం జోరుగా సాగుతోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో మరింత జవసత్వాలను నింపేటట్లుగా ఉంది. ప్రధానంగా రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ డెవలప్మెంట్, మెట్రో రైలు విస్తరణ వంటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుతో ఆశలు రేకెత్తించాయి. దాంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
అలాగే హైడ్రాకి రూ.200 కోట్లు, ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డుకు రూ.200 కోట్లు, పాత నగరానికి మెట్రో విస్తరణకు రూ.500 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్ పోర్టు సిస్టం కోసం రూ.50 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం రూ.1500 కోట్లు ప్రతిపాదించారు. రియల్ ఎస్టేట్ రంగానికి అవసరమైన అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని స్పష్టమైంది. స్కిల్స్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ, 17 వివిధ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించే సర్టిఫికేట్ కోర్సులను ప్రవేశపెడుతున్నది. ఈ యూనివర్సిటీ రంగారెడ్డి జిల్లాలోనే ఏర్పాటు చేయనుండడంతో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో మరిన్ని ప్రాజెక్టులకు అవకాశం లభించింది.
జాతీయ రహదారులకు అప్ గ్రేడ్
ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం హైదరాబాద్ కి మణిహారం. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ పలు ప్రాంతాలను అనుసందానం చేయడంతో హైదరాబాద్ నగరాభివృద్ధి మరింత వేగవంతమైంది. ఇలాంటి ఫలితాలను రాష్ట్రంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు రీజనల్ రింగ్ రోడ్డు ఉపయోగపడుతుంది. ఉత్తర భాగంలో 158.6 కి.మీ. పొడవున్న సంగారెడ్డి–తూప్రాన్–గజ్వేల్–చౌటుప్పల్ రోడ్డును, దక్షిణం భాగాన 189 కి.మీ.ల పొడవున్న చౌటుప్పల్–షాద్ నగర్–సంగారెడ్డి రోడ్డును జాతీయ రహదారులుగా ప్రకటించడానికి వీలుగా అప్ గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రీజనల్ రింగ్ రోడ్డు హైదరాబాద్ కి ఉత్తర, దక్షిణ ప్రాంతాలను, తూర్పు, పడమర ప్రాంతాలను కలుపుతూ జాతీయ రహదారి నెట్ వర్క్ తో అనుసంధానం చేయనున్నారు. ఎక్స్ వే ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని దీని నిర్మాణానికి తగినంత భూమిని సేకరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మరింత ఊపందుకున్నది. ఇప్పటికే అనేక వెంచర్లు ఈ ఏరియాలో ఉన్నాయి. ఇప్పుడీ ప్రతిపాదనలతో అమ్మకాలు పుంజుకోనున్నాయని రియల్ ఎస్టేట్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
ఓఆర్ఆర్, త్రిబుల్ ఆర్ మధ్య పరిశ్రమలు
ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్య పరిశ్రమలు, వాణిజ్య సేవలు రవాణా పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. త్రిబుల్ ఆర్ ప్రాజెక్టులో ఉత్తర ప్రాంత అభివృద్ధికి రూ.13,522 కోట్లు, దక్షిణ ప్రాంతాభివృద్ధికి రూ.12,980 కోట్ల ఖర్చవుతుందని అంచనా. ఈ ఏడాదికి మాత్రం రూ.1,525 కోట్లు ప్రతిపాదించారు. ఎన్నాండ్లుగానో ప్రతిపాదిత త్రిబుల్ ఆర్ ప్రాజెక్టు పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతున్నది. ఐతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడం ద్వారా విశ్వాసం పెరిగింది. ఇన్నాండ్లుగా ఈ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఐతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో ఇక రీజనల్ రింగ్ రోడ్డు పట్టాలెక్కుతుందని భరోసా కల్పించారు.
టూరిజంతోనూ లాభం
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వ్, వికారాబాద్ అనంతగిరి సర్క్యూట్, ఖమ్మం కనకగిరి, ఆదిలాబాద్ కుంటాల జలపాతం, కొత్తగూడెం కిన్నెరసాని, పాకాల, ఏటూరు నాగారం సర్క్యూట్ ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇకో టూరిజం అభివృద్ధి ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆదాయ వనరులు సమకూర్చుకునే వ్యూహరచన చేస్తున్నది. ఈ ప్రాజెక్టులు ఏ ఏరియాలో చేపడితే ఆ ప్రాంతంలోనూ రియల్ ఎస్టేట్ ఊపందుకోనున్నది.