రాష్ట్ర బీజేపీలో వింత పరిణామం.. ప్రజాసమస్యలపై ప్రస్తావించేందుకు వేదిక కరువు!?

by karthikeya |
Kishan Reddy Regrets Over firing In Secunderabad Railway Station
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర బీజేపీలో వింత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ ఆఫీసులో ప్రజాసమస్యలపై ప్రస్తావించేందుకు వేదిక కరువైందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకే నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీసు నుంచి సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌కు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా? అంటే పొలిటికల్ సర్కిల్స్‌లో అవుననే సమాధానమే వస్తోంది. బీజేపీలో ఇప్పటికే ప్రెస్ మీట్లపై ఆంక్షలు విధించినట్టు చెబుతున్నారు. దీనికి తోడు హైడ్రా, మూసీ ప్రక్షాళనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ అంశం మాట్లాడినా? ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇబ్బందికరంగా మారింది. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో చిక్కుకున్నట్లుగా సీన్ మారింది.

పార్టీ లైన్‌కు అనుగుణంగా ఉంటేనే పర్మిషన్!

కమలం పార్టీలో ఇప్పటికే ప్రెస్ మీట్లపై ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది. ముందుగానే సబ్జెక్ట్ ఏంటో చెప్పాలని, పార్టీ లైన్‌కు అనుగుణంగా ఉంటేనే ప్రెస్ మీట్‌కు అనుమతి ఇస్తున్నారని తెలిసి చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టేందుకు వెనుకడుగు వేస్తున్నట్టు సమాచారం. తాజాగా ఇద్దరు సీఎంలను మట్టి కరిపించి.. డబుల్ జాయింట్ కిల్లర్‌గా పేరొందిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి..నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ఆఫీసులో కాకుండా సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన పార్టీ ఆఫీసులో కాకుండా ప్రెస్ క్లబ్‌లో మీటింగ్ పెట్టడం పలు అనుమానాలకు తావించింది. అంత కీలకమైన అంశం ఏమై ఉంటుందనే చర్చ మొదలైంది.

పార్టీలో ఆంక్షలకు బ్రేక్ పడేనా?

కాటిపల్లి సోమాజీగూడలో మీడియా సమావేశం నిర్వహించడం ద్వారా బీజేపీలో ప్రెస్ మీట్లపై ఆంక్షలు ఉన్నాయనేందుకు బలాన్ని చేకూర్చినట్లయింది. అయితే హైడ్రా, మూసీ ప్రక్షాళన అంశాల కారణంగానే ఆయన ప్రెస్ మీట్ సోమాజీగూడలో పెట్టుకోవాల్సి వచ్చిందని చర్చించుకుంటున్నారు. పార్టీలో ఈ అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం మంచిది కాదనే ఉద్దేశంతోనే ప్రెస్ క్లబ్‌కు పరిమితమైనట్టు సమాచారం. ఈ అంశంపై కాటిపల్లిని ప్రశ్నించగా తనపై ఎవరూ ఆంక్షలు విధించలేదని, వాస్తవానికి తాను పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెడుతానని ఎవరినీ సంప్రదించలేదని తెలిపారు. అయినా ఈ తరహా చర్చలకు బ్రేక్ మాత్రం పడటం లేదు. అయితే గతంలోనూ పలువురు ప్రెస్ మీట్లపై ఆంక్షలు విధించడంతో పార్టీ ఆఫీసులో కాకుండా వారి సెగ్మెంట్‌లో పెట్టుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. మరి ఇప్పటికైనా పార్టీలో ఆంక్షలకు బ్రేక్ పడుతుందా? లేదా? అనేది చూడాలి.

Advertisement

Next Story

Most Viewed