SRSP Canal bridge : ప్రమాదకరంగా ఎస్‌ఆర్‌ఎస్‌పి కెనాల్ బ్రిడ్జి.. అయినా స్పందించట్లే!

by Sathputhe Rajesh |   ( Updated:2023-01-30 07:24:06.0  )
SRSP Canal bridge :  ప్రమాదకరంగా ఎస్‌ఆర్‌ఎస్‌పి కెనాల్ బ్రిడ్జి.. అయినా స్పందించట్లే!
X

దిశ, మల్యాల: మండల కేంద్రంలోని తాటిపల్లి గ్రామంలో లంబాడి పల్లి వైపు వెళ్లే ప్రధాన రహదారిలో దాదాపు 40 సంవత్సరాల పురాతనమైన ఎస్‌ఆర్‌ఎస్‌పి కెనాల్ బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుంది. లంబడి పల్లి, కొంపల్లి గ్రామాల ప్రజలు, విద్యార్థిని విద్యార్థులు, స్కూల్ వ్యాన్ ఈ బ్రిడ్జి మీద నుండే తాటిపల్లి పాఠశాలకు, మండల కేంద్రానికి వెళ్తూ ఉంటారు. పురాతన బ్రిడ్జి కావడం, వర్షపు నీరు నిలవడంతో బ్రిడ్జి గుంతలుగా ఏర్పడి రక్షణ గోడలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.

పరిస్థితి తీవ్రతను గమనించిన తాటిపల్లి గ్రామానికి చెందిన పోన్నం మల్లయ్య ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చినా ప్రయోజనం లేకపోవడంతో అదే గ్రామానికి చెందిన ఎల్.ఎల్.బి విద్యార్థి (ఎనాలోసిస్ట్) సాయి అనే యువకుడు తన యూట్యూబ్ ద్వారా బ్రిడ్జి యొక్క వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా ఆ యువకుడు మాట్లాడుతూ తాటి పెళ్లి లంబాడి పెళ్లి గ్రామాల మధ్యగల బ్రిడ్జి శిథిలావస్థలో ఉండడం, బ్రిడ్జిపై నుంచి ప్రయాణిస్తున్న విద్యార్థులు కాలువలోకి తొంగి చూస్తున్నారని, రక్షణ గోడ లేకపోవడంతో ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. అధికారులు ఇకనైనా స్పందించి బ్రిడ్జి మరమ్మతులు చేసి ప్రమాదం జరగకుండా నివారించాలని గ్రామస్తులు, ఇరు గ్రామాల ప్రజల తరపున ఆ యువకుడు కోరాడు.

Advertisement

Next Story

Most Viewed