Sridhar Babu: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |
Sridhar Babu: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని, ఖాళీగా ఉన్న పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు (Sridhar Babu) తెలిపారు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని టీజీ ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో ఇవాళ జరిగిన 196 మంది డ్రైవర్ ఆపరేటర్ల పాసింగ్ అవుట్ పరేడ్‌కు (passing out parade) మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన పదేళ్లుగా నిలిచిపోయిన ఉద్యోగాల భర్తీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం తిరిగి పట్టాలెక్కించిందని అన్నారు. కొలువుల భర్తీ (Govt job vacancies) ప్రక్రియలో ఏర్పడిన న్యాయపరమైన ఇబ్బందులను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ నియామక పత్రాలను అందజేస్తున్నామన్నారు. హోంశాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారని పేర్కొన్నారు.

మీ సేవలు అమోఘం:

అగ్నిమాపక శాఖ సిబ్బంది సేవలు అభినందనీయమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఖమ్మంలో వరదలు తలెత్తినప్పుడు ఫైర్ సిబ్బంది అందించిన సేవలు అమోఘమన్నారు. ప్రజల ప్రాణ, ఆస్తి కాపాడటంలో ఫైర్ సిబ్బంది కీలకం వ్యవహరించారన్నారు. ఎక్కడ విపత్తు తలెత్తినా మేమున్నామంటూ రంగంలోకి దిగి ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారని ప్రశంసించారు. ఏడాది వ్యవధిలోనే అగ్నిమాపక శాఖకు సంబంధించిన విభాగాల్లో 878 మందిని రిక్రూట్ చేశామని, రాబోయే రోజుల్లో ఈ శాఖను మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. అగ్నిమాపక శాఖ సిబ్బందిపై గురుతర బాధ్యత ఉందని, విపత్తులు తలెత్తినప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ముందుండాలని సూచించారు. 4 నెలల కఠోర శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన 196 మంది డ్రైవర్ ఆపరేటర్లకు అభినందనలు తెలిపారు. ఉద్యోగాల్లో చేరిన తర్వాత నీతి, నిజాయితీగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీ దయానంద్, హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా, ఫైర్ డీజీ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story