త్వరలోనే సీఎం కప్ షెడ్యూల్.. మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Javid Pasha |
త్వరలోనే సీఎం కప్ షెడ్యూల్.. మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీయాలనే లక్ష్యంతో మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో సీఎం కప్ నిర్వహిస్తామని, త్వరలోనే సీఎం కప్ షెడ్యూల్ ను అధికారికంగా ప్రకటిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని బేగంపేట్ లో ఉన్న పర్యాటక భవన్ లో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల జిల్లా యువజన సర్వీసుల శాఖల అధికారులతో బుధవారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని క్రీడాంశాల్లో రాష్ట్ర క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పతకాలు సాధనలో ముందుండాలని రాష్ట్ర క్రీడా శాఖ అధికారులకు, జిల్లా యువజన సర్వీసుల శాఖ అధికారులను ఆదేశించారు.

సమ్మర్ కోచింగ్ క్యాంపులను విజయవంతం చేసేలా స్వచ్ఛంద సంస్థలను కార్పొరేట్ కంపెనీలను భాగస్వామ్యం చేయాలన్నారు. గ్రామీణ క్రీడా ప్రాంగణాలు అన్ని గ్రామాల్లో పూర్తయ్యేలా డీవైఎస్ఓలు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న క్రీడా మైదానాలు సత్వరం పూర్తి అయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. నగరంలోని అన్ని ప్రధాన క్రీడా మైదానాల్లో మైనర్ రిపేర్లను వెంటనే చేపట్టాలన్నారు. సీఎం కప్ నిర్వహణ త్వరలో ఉద్యోగ సంఘాలతో, వివిధ క్రీడా సంఘాలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. గ్రామీణ క్రీడలకు పెద్దపీట వేసేలా తెలంగాణ సంస్కృతి, క్రీడా ఉత్సవాలను నిర్వహించేలా కార్యచరణ రూపొందించాలని సూచించారు.

మే 6న మహబూబ్ నగర్ లో ఐటీ టవర్ ప్రారంభం

మే 6న మహబూబ్ నగర్ జిల్లాలోని దివిటీపల్లీలో నిర్మించిన ఐటీ టవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను అదేశించారు. జాతీయ రహదారికి ఐటీ టవర్ కి వెళ్లే దారిని ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా పెద్ద ముఖద్వారం కనెక్టింగ్ రోడ్డు అనుసంధానంగా నిర్మించాలన్నారు. టవర్ నుంచి మహబూబ్ నగర్ పట్టణానికి అధునాతన రోడ్లను నిర్మించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఈ సమావేశంలో క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, రాష్ట్ర క్రీడ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, అధికారులు ధనలక్ష్మి, సుజాత, దీపక్, చంద్రారెడ్డి, డాక్టర్ హరి కృష్ణ, అన్ని జిల్లాల డీవైఎస్ఓలు, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ డి.రవి, డిప్యూటీ జోనల్ మేనేజర్ శ్యాంసుందర్ రెడ్డి, ప్రముఖ కన్సల్టెంట్ రాజ్ కుమార్, నిర్మాణ సంస్థ గుత్తేదారులు నరసింహ, రాజశేఖర్ రెడ్డి, అమర రాజా, మసూద్ రవితేజ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed