గణేశ్ శోభాయాత్ర వేళ పాతబస్తీపై పోలీసుల ప్రత్యేకంగా ఫోకస్!

by GSrikanth |
గణేశ్ శోభాయాత్ర వేళ పాతబస్తీపై పోలీసుల ప్రత్యేకంగా ఫోకస్!
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరో నాలుగు రోజులు మాత్రమే ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు ఉన్నతాధికారులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో పని చేస్తున్న సిబ్బందితోపాటు అదనంగా రప్పించిన బలగాలతో భద్రతా చర్యలు చేపట్టారు. ఇప్పటికే అదనపు భద్రతా బలగాలు హైదరాబాద్ చేరుకున్నాయి. ఈసారి ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 35వేల మందికి పైగా సిబ్బందిని బందోబస్తు నిమిత్తం రంగంలోకి దింపనున్నారు.

లక్షకు పైగా మండపాలు

ఈనెల 18న వినాయక చవితి వేడుకలు ప్రారంభం కాగా, లక్షకు పైగా మండపాలను ఏర్పాటు చేశారు. మూడు, ఐదు రోజుల్లో వీటిలో 20 శాతం వరకు విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. తొమ్మిదో రోజు మరిన్ని విగ్రహాల నిమజ్జనం జరగనుంది. శోభాయాత్ర రోజు ట్రై కమిషనరేట్లలో కలిపి దాదాపు 70 వేల విగ్రహాల నిమజ్జనం జరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పాతబస్తీ బాలాపూర్ నుంచి ప్రారంభం కానున్న ఈ శోభాయాత్రలో 15 నుంచి 20 లక్షల మంది పాల్గొనే అవకాశముంది.

పాతబస్తీపై ప్రత్యేక నజర్

శోభాయాత్ర నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు పాతబస్తీపై ప్రత్యేకంగా నజర్ పెట్టారు. సున్నితమైన వాటిగా గుర్తించిన పోలీస్ స్టేషన్ల పరిధిలో మరింత పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించనున్నారు. ఇప్పటికే గుర్తించిన 22 పోలీస్ స్టేషన్లకు తాత్కాలిక పద్ధతిన అదనంగా ఇన్‌స్పెక్టర్లను కేటాయించారు.

వీలైనంత తొందరగా...

శోభాయాత్ర రోజున వీలైనంత త్వరగా వినా యక విగ్రహాల శోభాయాత్ర ప్రారంభమయ్యేలా చూడాలని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ప్రధాన యాత్ర బాలాపూర్, చాంద్రాయణగుట్ట, శాలిబండ, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, మొజంజాహీ మార్కెట్, ఆబిడ్స్, బషీర్ బాగ్ మీదుగా ట్యాంక్ బండ్‌కు చేరుకుంటుంది. హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల నుంచి బయల్దేరే వినాయక విగ్రహాలు ప్రధాన ఊరేగింపులో కలుస్తాయి.

భవనాలపై బైనాక్యులర్లతో..

ప్రధాన ఊరేగింపు కొనసాగేదారిలోని అన్ని భవనాలపై బైనాక్యులర్లతో పోలీసులను మోహరించనున్నారు. శోభాయాత్ర రూట్‌లోని అన్ని సీసీ కెమెరాలు నిమజ్జన యాత్ర రోజున సక్రమంగా పని చేసేలా ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం పని చేయకుండా ఉన్న వాటికి మరమ్మతులు చేయిస్తున్నారు. శోభాయాత్ర రూట్‌ను సెక్టార్లుగా విభజించారు. ఒక్కో సెక్టార్‌కు సీఐ స్థాయి అధికారిని ఇన్‌చార్జిగా నిమింనున్నారు. మూడు సెక్టార్లకు ఒక ఏసీపీకి బాధ్యతలు అప్పగించనున్నారు.

Advertisement

Next Story