మణిపూర్‌లోని తెలంగాణ విద్యార్థుల కోసం ప్రత్యేక విమానం..

by Vinod kumar |
మణిపూర్‌లోని తెలంగాణ విద్యార్థుల కోసం ప్రత్యేక విమానం..
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: మణిపూర్​లో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థులు, పౌరులతోపాటు తెలుగు వారిని ఇక్కడికి తీసుకు రావటానికి వెళ్లిన విమానం రాత్రి 11గంటలకు అక్కడి నుంచి బయల్దేరనున్నట్టు సమాచారం. రేపు ఉదయం విమానం శంషాబాద్​విమానాశ్రయానికి చేరుకుంటుందని తెలిసింది. కాగా, ఇప్పటికే హర్షవర్దన్​అనే విద్యార్థి ఢిల్లీకి విమానంలో చేరుకున్నట్టు తెలిసింది. అతనికి ఈ రోజు రాత్రి బీఆర్ఎస్ కార్యాలయంలో బస ఏర్పాటు చేసినట్టు సమాచారం. రిజర్వేషన్ల విషయమై తలెత్తిన వివాదం మణిపూర్​లో తీవ్ర హింసకు దారి తీసిన విషయం తెలిసిందే. పరస్పరం జరుపుకున్న దాడుల్లో యాభై మందికి పైగా మణిపూర్​వాసులు మరణించారు.

లక్షలాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. కర్ప్యూ విధించటంతోపాటు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసేదాకా పరిస్థితి వెళ్లింది. కాగా, ఉన్నత విద్యలనభ్యసించటంతోపాటు వేర్వేరు కారణాలతో మణిపూర్​కు వెళ్లిన వందల మంది తెలంగాణ విద్యార్థులు, పౌరులు అక్కడ చిక్కుకుపోయారు. వీరితోపాటు పొరుగు రాష్ర్టమైన ఆంధ్రప్రదేశ్​కు చెందిన వారు కూడా మణిపూర్​నుంచి బయటకు రాలేక అక్కడ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

తమను రక్షించి తీసుకెళ్లాలని తెలంగాణ విద్యార్థులు, పౌరులు చేసిన విజ్ఞప్తితో తెలంగాణ ప్రభుత్వం వెంటనే చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మణిపూర్​ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడారు. అదే సమయంలో డీజీఈ అంజనీ కుమార్​మణిపూర్​డీజీపీతో మాట్లాడారు. తెలంగాణకు చెందిన అందరికి రక్షణ కల్పించాలని కోరారు. దాంతోపాటు చిక్కుకుపోయిన వారిని ఇక్కడికి తీసుకు వచ్చేందుకు ఆదివారం ఓ ప్రత్యేక విమానాన్ని మణిపూర్ కు పంపించారు. ఈ విమానం తెలంగాణ విద్యార్థులు, పౌరులతో ఆదివారం రాత్రి 11గంటలకు ఇక్కడికి బయల్దేరనున్నట్టు సమాచారం. కాగా, ఆంధ్రకు చెందిన వారిని కూడా ఇక్కడికి తీసుకు వస్తున్నట్టు తెలిసింది.

Advertisement

Next Story