Bihar: తెలంగాణ ఎమ్మెల్యేలను అభినందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్

by Gantepaka Srikanth |
Bihar: తెలంగాణ ఎమ్మెల్యేలను అభినందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్‌(Bihar)లోని పాట్నా నగరంలో జరుగుతున్న 85వ ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్(AIPOC)లో తెలంగాణ శాసనసభ, శాసనమండలి బృందాలు పాల్గొన్నాయి. ఈ కాన్ఫరెన్స్‌ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad) ప్రసంగించారు. ముందుగా రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. భారత రాజ్యాంగాన్ని అనుసరించి పార్లమెంట్(Parliament) రూపొందించిన చట్టాలు దేశంలో ప్రజాస్వామ్య బలోపేతానికి తోడ్పడుతున్నాయి. తద్వారా దేశ ప్రజల హక్కులు రక్షించబడుతున్నాయి. ముఖ్యంగా సమాచార హక్కు చట్టం, వస్తు సేవల పన్నులతో పాటుగా విద్య, వైద్యం, సామాజిక న్యాయం వంటి అంశాలలో పార్లమెంట్ రూపొందించిన చట్టాలు ఈ దేశ పౌరులకు ఉపయోగపడుతున్నాయని అన్నారు.

ప్రజాస్వామ్యం, సమన్యాయం, సమానత్వంలు ప్రాథమిక అంశాలుగా రూపొందించిన భారతదేశ రాజ్యాంగం గత 75 సంవత్సరాలుగా ఈ దేశ ప్రజలకు మార్గదర్శనం చేస్తున్నదని అన్నారు. భారత రాజ్యాంగ విలువలకు, మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ శాసనసభ పనిచేస్తుంది. తెలంగాణ ప్రజలకు(People of Telangana) అవసరమైన అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపకల్పనలో, వాటిని చట్టాలుగా ఆమోదించడంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఒక మోడల్‌గా ఉన్నది. మెజారిటీ ప్రజలకు సంబంధించిన వ్యవసాయం, నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలు, సామాజిక పథకాలు, మౌళిక వసతుల కల్పన వంటి కీలక అంశాలకు తెలంగాణ శాసనసభ ప్రాముఖ్యత ఇచ్చింది. ముఖ్యంగా రైతుల భూ వివరాలకు ఉపయోగపడే భూ భారతి చట్టం, యువతకు సంబంధించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ(Young India Skill University) వంటి చట్టాల రూపకల్పన ద్వారా తెలంగాణ శాసనసభ మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నదని సగర్వంగా చెప్పగలను అని వెల్లడించారు.

రాష్ట్ర జనాభాలో మెజారిటీగా ఉన్న రైతుల ప్రయోజనం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) నాయకత్వం‌లోని ప్రభుత్వం అధిక నిధులను కేటాయిస్తుంది. రైతుభరోసా పెంపు, రైతుభీమా అమలు ద్వారా రైతాంగానికి అండగా ఉన్నది. ప్రభుత్వ గురుకుల, ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించడానికి ప్రభుత్వం మెస్ చార్జీలను భారీగా పెంచింది. విద్యార్థులకు అందుతున్న సేవలను పర్యవేక్షించడానికి ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు, ఉన్నతాధికారులు తరుచుగా గురుకుల పాఠశాలను తనిఖీ చేస్తున్నారు. మహిళలను గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తుంది. ప్రభుత్వ బస్సులలో చిరు ఉద్యోగ, వ్యాపారాలు చేసే మహిళలు మరియు విద్యార్థినులకు ఉచిత ప్రయాణంతో ఆర్థికభారం తగ్గింది. రూ.500లకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌తో మహిళలకు గృహ నిర్వాహణ సులభమైందని చెప్పారు.

రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా నడుచుకుంటూ తెలంగాణ ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే చట్టాల రూపకల్పనకు కృషి చేస్తున్న తెలంగాణ శాసనసభ్యులను అభినందిస్తున్నాను. మనమందరం రాజ్యాంగ విలువలను పాటిస్తూ ఇదే విధమైన స్పూర్తిని కొనసాగిస్తూ ముందుతరాలకు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను అని సూచించారు.

Next Story