త్వరలోనే రైతు కమిషన్, విద్యా కమిషన్‌: CM రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

by Satheesh |   ( Updated:2024-03-01 16:37:52.0  )
త్వరలోనే రైతు కమిషన్, విద్యా కమిషన్‌: CM రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రైతు కమిషన్‌ను, విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నది. రైతులు, కౌలు రైతుల సాధక బాధకాలు, సంక్షేమం, వ్యవసాయ రంగంలో సంస్కరణలకు సంబంధించి తగిన సలహాలు, సూచనలు అందించడంలో రైతు కమిషన్ చొరవ తీసుకుంటుంది. మన అవసరాలకు అనుగుణంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలో విద్యా కమిషన్ నిర్ణయిస్తుంది. పరిపాలనలో పౌర సమాజం సలహాలు తీసుకుంటామని ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సచివాలయంలో శుక్రవారం వివిధ సామాజిక సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులతో ఇష్టాగోష్టి సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించారు. రాష్ట్ర సాధనకు జరిగిన ఉద్యమం, ప్రజల ఆకాంక్షలు, గడచిన పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం తదితరాలపై చర్చ జరిగిన అనంతరం ప్రతినిధుల నుంచి వెలువడ్డ అభిప్రాయాల మేరకు రైతు కమిషన్, విద్యా కమిషన్ ఏర్పాటుపై సీఎం స్పష్టత ఇచ్చారు.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ప్రభుత్వం ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టిందని గుర్తుచేశారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇందిరా పార్కు దగ్గర ధర్నా చౌక్‌ను పునరుద్ధరించామని, ప్రజా భవన్‌ను ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు అనువుగా అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో సంక్షేమ పథకాలకు దరఖాస్తులను స్వీకరించామన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, విద్యుత్ పరిస్థితి, సాగునీటి రంగం పరిస్థితిపై పూర్తి వివరాలతో అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశామని పేర్కొన్నారు. మహిళలు, నిరుపేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా ఇప్పటికే నాలుగు గ్యారంటీలను అమలు చేశామని అన్నారు.

కౌలు రైతుల రక్షణకు సంబంధించి త్వరలోనే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తామని, అందరి సూచనలు, సలహాలు తీసుకుని వాటి ఆధారంగా కౌలు రైతుల రక్షణకు చట్టం తీసుకురావాలనే ఆలోచనలను వారితో సీఎం రేవంత్ పంచుకున్నారు. రైతు భరోసా రైతులకు పంటలకు పెట్టుబడి సాయంగా అందించే పథకమని, లబ్ధిదారుల ఎంపికకు అనుసరించాల్సిన ప్రామాణికాలపై విస్తృత చర్చ జరగాలన్నారు. నిస్సహాయులకు, నిజమైన లబ్దిదారులకు అవసరమైతే చెప్పిన దానికంటే ఎక్కువ సాయం చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉందని చెప్పారు. పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని సీఎం ప్రకటించారు. రాష్ట్రంలో పంట మార్పిడి పథకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరముందని, అన్ని పంటలు విస్తరించేలా రైతులు సరికొత్త విధానాలను అనుసరించాలని అన్నారు.

రాష్ట్రంలో పాఠశాలలు, విద్యాలయాలను మెరుగు పరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని ఈ సమావేశంలో ప్రతినిధులకు సీఎం వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకులాలను వేర్వేరు చోట్ల కాకుండా, దాదాపు 25 ఎకరాల్లో ఒకే ఇంటిగ్రేటేడ్ క్యాంపస్‌లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా ముందుగా కొడంగల్‌లో ఇంటిగ్రేటేడ్ క్యాంపస్ నెలకొల్పుతామన్నారు. దశలవారీగా అన్ని నియోజకవర్గాలకూ ఈ విధానాన్ని విస్తరింపజేస్తామని తెలిపారు. ఈ సిస్టమ్‌తో కుల, మత వివక్ష తొలగిపోతుందన్నారు. విద్యార్థుల ప్రతిభా పాటవాలతో పాటు పోటీతత్వం పెరుగుతుందన్నారు. గురుకులాల నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ మరింత సమర్థంవంతంగా జరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.

నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఉన్న చిక్కుముడులను తొలగించి ఉద్యోగాలను రెండు నెలల వ్యవధిలో దాదాపు పాతిక వేల పోస్టులను భర్తీ చేసినట్లు సీఎం గుర్తు చేశారు. గ్రూప్-1, మెగా డీఎస్సీ నోటిఫికేషన్లు ఇప్పటికే విడుదలయ్యాయన్నారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎఎస్సీ ద్వారా నియామకాలను చేపడతామన్నారు. గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న తప్పిదాలు రిపీట్ కాకుండా ఫూల్-ప్రూఫ్ మెకానిజం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, అందులో భాగంగానే కొత్తగా ఏర్పాటైన కమిషన్ పాలకమండలికి పూర్తి స్వేచ్చతో పాటు ప్రభుత్వ లక్ష్యాన్ని స్పష్టంగా వివరించామని గుర్తుచేశారు. రైతులు, నిరుద్యోగులకు మేలు చేసేందుకు రానున్న రోజుల్లో మరిన్ని చర్యలు చేపడుతామన్నారు.

పౌర సమాజ ప్రతినిధులతో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, యోగేంద్ర యాదవ్, ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు, ప్రొఫెసర్ రమా మెల్కోటే, ప్రొఫెసర్ రియాజ్, ప్రొఫెసర్ పురుషోత్తం, గాదె ఇన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed