చెన్నయ్ నుంచి 16 మంది ప్రొఫెషనల్ టీమ్.. భారీగా ఖర్చు చేస్తోన్న KCR

by Disha Web Desk 9 |
చెన్నయ్ నుంచి 16 మంది ప్రొఫెషనల్ టీమ్.. భారీగా ఖర్చు చేస్తోన్న KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో: గతానికి భిన్నంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోలు చేపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో శ్రేణుల్లో నెలకొన్న నైరాశ్యాన్ని తొలగించేందుకు ముమ్మరంగా ప్రచారాన్ని చేస్తున్నారు. 17 రోజుల పాటు రోడ్ షోలకు షెడ్యూల్ రూపొందించి కొనసాగిస్తుండగా.. దీన్ని సోషల్ మీడియాలో కవర్ చేసేందుకు బీఆర్ఎస్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. చెన్నయ్ నుంచి 16 మంది సభ్యుల స్పెషల్, ప్రొఫెషనల్ సోషల్ మీడియా టీమ్ ను పిలిపించి.. రూ. కోటిన్నరకు పైగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

ఏ చిన్న క్లిప్ మిస్ కాకుండా రికార్డ్ చేయడం, ప్రమోషన్ చేయడం ఆ సోషల్ మీడియా సభ్యులకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. కేసీఆర్ వెంటే ఆ టీం సభ్యులు ఉండేలా అన్ని ఏర్పాట్లు చేశారు. వారి బాధ్యతను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ చార్జి క్రిశాంక్ కు అప్పగించినట్లు సమాచారం. రోడ్డుషోల ద్వారా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేలా పార్టీ ప్లాన్ చేసినట్లు తెలుస్తున్నది. దాని కోసం ప్రతీ చిన్న సన్నివేశాన్ని, సంఘటనను రికార్డ్ చేయడానికి హై టెక్నాలజీతో కూడిన సినిమాటిక్ కెమెరాలను చెన్నయ్ నుండి వచ్చిన టీం వాడుతున్నట్లు తెలుస్తున్నది.

పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేలా..

తొమ్మిదిన్నరేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసింది. అప్పటి నుంచి పరిస్థితులు మారాయి. నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు అసెంబ్లీ ఫలితాలు స్పష్టం చేశాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల పైనే పార్టీ అధినేత కేసీఆర్ ఫోకస్ పెట్టి రోడ్డుషోలు నిర్వహిస్తున్నారు. యాత్ర ద్వారా ప్రజల్లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేలా స్పెషల్ టీమ్ ను రంగంలోకి దింపారు. వారు కేసీఆర్ రోడ్ షో లను కవర్ చేయడంతోపాటు కాంగ్రెస్ వైఫల్యాలను సైతం ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అయితే పార్టీ తీసుకున్న చర్యలు లోక్ సభ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపిస్తాయనేది వేచి చూడాల్సిందే.

Next Story

Most Viewed