- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వన్యమృగాల అభయారణ్యంలో SLBC టన్నెల్.. ఏదైనా రిపేర్ వస్తే ఏం చేస్తారో తెలుసా?

దిశ, తెలంగాణ బ్యూరో: ఫ్లోరైడ్ ప్రాంతంగా ఉన్న నల్గొండ జిల్లాకు నీటి నిర్వహణ తక్కువ వ్యయంతో ఉండే విధంగా రూపొందించిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(ఎస్ఎల్బీసీ) కి మొదటి నుంచి అడ్డంకులు, అవాంతరాలే ఎదురవుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వాసుల చిరకాల వాంచగా ఉన్న ప్రాజెక్టు రెండు దశాబ్దాలు అయినా పనులు మాత్రం పూర్తి కావడం లేదు. దేశంలోనే అతిపెద్ద సొరంగంగా చెప్పుకునే ఎస్ఎల్బీసీ పనులు రెండు దశాబ్దాల నుంచి కొనసాగుతున్నాయి. ఫ్లోరైడ్ సమస్యకు నది జలాలే శాశ్వత పరిష్కారం. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా సాగునీటికి శాశ్వత పరిష్కారం ఎస్ఎల్బీసీ ద్వారా దొరుకతుందని అంచనా వేశారు. కానీ అచరణలో మాత్రం అమలు కావడంలేదు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రారంభించిన జలయజ్ఞంలో భాగంగా ఎస్ఎల్బీసీ ని చేపట్టారు. ఎస్ఎల్బీసీ ద్వారా గ్రావిటితో నాలుగు వేల క్యూసెక్కుల నీటిని తీసుకోవచ్చు. తెలంగాణకు గ్రావిటి ద్వారా ఉన్న అవకాశాలు తక్కువగా ఉన్న సందర్భంలో గ్రావిటి ద్వారా అత్యధిక రోజులు శ్రీశైలం నుంచి తీసుకునే విధంగా రూపొందించారు. అయితే టన్నెల్ ద్వారా ఈ నీటిని తీసుకోవాల్సి రావడంతో పనులకు మోక్షం కలగడంలేదు. ముందుకు కదలడంలేదు. ఎస్ఎల్బీసీకి 2005 ఆగస్టు 11న నీటిపారుదల శాఖ రూ.2813 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టుకు అనుమతి ఇస్తూ పరిపాలన ఉత్తర్వులను జారీ చేసింది.
ఇందులో రెండు టన్నెల్స్, రెండు లింక్ కెనాల్స్, దిండి బ్యాలెన్స్ రిజర్వాయర్ నిర్మించాలని ఆనాడు ఆలోచన చేశారు. మొదటి టన్నెల్ 9.2 కి.మీ డయాతో రూ.43.93 కిలోమీటర్లు మేర నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ టన్నెల్ ను సర్క్యులర్ విధానంలో నిర్మించాల్సి ఉంది. ప్రీకాస్ట్ సెగ్మెంట్ విధానంలో టన్నెల్ ఇంకా దాదాపుగా పది కిలోమీటర్ల వరకు పూర్తి కావాల్సి ఉంది. దీనికి హెడ్ రెగ్యులర్ను శ్రీశైలం రిజర్వాయర్ కు నాలుగు కిలోమీటర్ల దూరంలో నిర్మించారు. దీనిని రూ.1925 కోట్ల అంచనా వ్యయంతో మొదటి టన్నెల్ను టెండర్లలో భాగంగా ఢిల్లీకి చెందిన జయ ప్రకాశ్ అసోసియేట్స్ సంస్థ దక్కించుకుంది. ఆ తరువాత ఎప్పటికప్పుడు అంచనా వ్యయం పెరుగుతూ వచ్చింది. రూ.3152 కోట్ల మొదటి టన్నెల్ అంచనా వ్యయం పెరిగింది. ఈ టన్నెల్ వన్యమృగాల అభయారణ్యంలో ఉంది.
దీనిని దాటుకుంటూ టన్నెల్ వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అనుమతులు రావడం కూడా గగనమైంది. దీనికి కొంత సమయం పట్టింది. టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం)లో ఏదైనా మరమ్మత్తులు వచ్చినా రెండు మూడు నెలల పాటు పనులు నిలిచిపోవాల్సిందే. వాటిని ఇతర దేశాల నుంచి ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవాల్సి ఉంటుంది. కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్శాఖకు జేపీ అసోసియేట్స్ సంస్థ తరుఫున ప్రభుత్వం ముందస్తు చెల్లింపులు చేసింది. ఆ తరువాత కూడా పనులు అంతగా ముందుకు నడవలేదు. కాంగ్రెస్ హయాంలో జిల్లాకు చెందిన మంత్రే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండటం, గతంలో ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలోనే శంకుస్థాపన చేశారు. తమ హయాంలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని కాంగ్రెస్ మంత్రులు అనేక మార్లు ప్రకటించారు.
సొరంగం రెండు వైపులా పనులు..
సొరంగం పనులు ఒక వైపు నుంచి తవ్వితే త్వరగా పూర్తికావనే ఉద్దేశంతో రెండు వైపులా పనులు చేసుకుంటూ వస్తున్నారు. 20 ఏండ్లలో శ్రీశైలం నుంచి నీటిని తీసుకవచ్చే ఇన్లెట్ నుంచి 14 కిలోమీటర్ల సొరంగం తవ్వకాలు పూర్తయ్యాయి. నీళ్లు బయటకు వచ్చే అవుట్ లెట్ నుంచి 21 కి.మీ దూరం వరకు పూర్తయ్యాయి. ఇంకా దాదాపుగా 10 కిలోమీటర్ల సొరంగం పనులు పూర్తి కావాల్సి ఉంది. పనులు చేస్తున్న తరుణంలో శ్రీశైలానికి సంబంధించి నీటి ఊట పెద్ద ఎత్తున వస్తుందని, ఆ నీటి ఊటను తట్టుకొని నీళ్లను రాకుండా చేయడం, వచ్చిన నీటిని తొలగించుకుంటూ పనులు కొనసాగిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు నీరు అందంచవచ్చనే లక్ష్యంతో దీనిని చేపట్టారు. రెండో టన్నెల్ 7.13కిలోమీటర్లకు నీటిపారుదల శాఖ అధికారులు టెండర్లు పిలిచారు. దీని డయా 8.75 మీటర్లకు నిర్ధారించారు. ఈ టెన్నెల్ ను డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ విధానంలో నిర్మించాల్సి ఉండటంతో దీనికి ప్రత్యేకంగా టెండర్లు పిలిచారు.
వెలిగొండ టన్నల్స్ అలా...
ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో వెలిగొండ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం నిర్మించింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గ్రావిటి ద్వారా తరలించేందుకు ఇటు వైపు ఎస్ఎల్ బీసీ ఉండగా అటు వైపు వెలిగొండ ప్రాజెక్టు ఉంది. శ్రీశైలం నుంచి కృష్ణానదీ జలాలను గ్రావిటీ ద్వారా తరలించేందుకు 18.8 కి.మీ చొప్పున రెండు టన్నెల్స్ తవ్వి వెలిగొండ రిజర్వాయర్లో స్టోరేజీ చేస్తారు. నల్లమల అడవుల మధ్యలోని కొండలను తవ్వి, శ్రీశైలం ప్రాజెక్ట్ సమీపంలో కొల్లం వాగుని చేరేందుకు టన్నెల్ త వ్వారు. తొలి టన్నెల్ పనులను 2008లో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి ప్రారంభించగా ఆ తర్వాత 2009లో రెండో టన్నెల్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ రెండు టెన్నెల్స్ను టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) ద్వారానే రెండు టన్నెల్స్ అంటే దాదాపుగా 37 కిలోమీటర్ల పొడవులో ఇప్పటికే పూర్తి చేశారు. టన్నెల్స్ పూర్తి చేసి కూడా మూడు సంవత్సరాలు కావస్తుంది. కానీ తెలంగాణలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ మాత్రం 2005లో ప్రారంభించినా ఇంత వరకు పూర్తి కాలేదు.