బ్రేకింగ్: పేపర్ల లీకేజీ కేసులో కీలక పరిణామం.. 42 మందికి సిట్ నోటీసులు

by Satheesh |   ( Updated:2023-03-22 12:44:47.0  )
బ్రేకింగ్: పేపర్ల లీకేజీ కేసులో కీలక పరిణామం.. 42 మందికి సిట్ నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకున్న విచారిస్తోన్న సిట్.. తాజాగా టీఎస్‌పీఎస్సీలో పనిచేస్తోన్న 42 మంది ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. టీఎస్‌పీఎస్సీ ఔట్ సోర్సింగ్ ఐటీ సిబ్బందికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్‌లతో సన్నిహితంగా ఉన్నవారిపై సిట్ ఫోకస్ పెంచింది. ఇందులో భాగంగానే తాజాగా సిట్ పలువురు ఉద్యోగులు, అభ్యర్థులకు నోటీసులు జారీ చేసింది.

ఇప్పటికే కమిషన్‌లో పనిచేస్తోన్న 10 మంది గ్రూప్ 1 పరీక్ష రాసినట్లు గుర్తించిన సిట్.. దర్యాప్తులో భాగంగా వారందరికి నోటీసులు పంపింది. అంతేకాకుండా కాన్ఫిడెన్షియల్ రూమ్ ఇన్‌చార్జ్‌గా ఉన్న శంకరలక్ష్మీ పాత్రపై మరింత దర్యాప్తు చేయాలని సిట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే శంకరలక్ష్మీని ఓ సారి విచారించిన సిట్.. రేపు మరోసారి ఆమె స్టేట్మెంట్‌ను రికార్డ్ చేయనుంది. ఈ కేసులో కీలకంగా ఉన్న నిందితురాలు రేణుకతో టచ్‌లో ఉన్న కోచింగ్ సెంటర్ నిర్వాహకులు.. అభ్యర్థులను కూడా విచారించేందుకు సిట్ సిద్ధం అయ్యింది. అలాగే నిందితుడు రాజశేఖర్ స్నేహితుడు రమేష్ పాత్రపై మరోసారి సిట్ అధికారులు విచారణ చేయనున్నారు.

Advertisement

Next Story