కేటీఆర్‌కు సవాల్‌గా మారిన ‘సిరిసిల్ల’.. కౌన్సిలర్స్‌ను ఎలా సెట్ చేస్తారని తీవ్ర ఉత్కంఠ..!

by Satheesh |
కేటీఆర్‌కు సవాల్‌గా మారిన ‘సిరిసిల్ల’.. కౌన్సిలర్స్‌ను ఎలా సెట్ చేస్తారని తీవ్ర ఉత్కంఠ..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్​పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్​కేటీఆర్ ఆదేశాలను ఆ పార్టీ కౌన్సిలర్లు బేఖాతర్ చేస్తున్నారు. విప్ జారీ చేస్తామని హెచ్చరికలు చేస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. దీంతో ఒక్కొక్కటిగా మున్సిపాలిటీలు పార్టీ చేజారుతున్నాయి. కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలోనూ పన్నెండు మంది కౌన్సిలర్లు క్యాంపునకు వెళ్లడం పార్టీలోనే హాట్ టాపిక్‌గా మారింది. మున్సిపాలిటీలు పార్టీ చేజారకుండా చూసుకునేందుకు కేటీఆర్​పనితీరుకు కొలమానం కానున్నాయి. కొంతకాలంగా అన్నీ తానై నిర్వహిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత కేడర్‌లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు ప్రారంభమయ్యాయి. 110కి పైగా మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకోగా, అవిశ్వాసాలతో ఒక్కొక్కటిగా చేజారుతున్నాయి. రాష్ట్రంలో అధికారంతో పాటు ప్రస్తుతం మున్సిపాలిటీలనూ కోల్పోతుండటంతో కేటీఆర్ పనితీరుపై చర్చ జరుగుతోంది. ఇందుకు ఆయన వ్యవహారశైలీ లేదంటే చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన ఒప్పందాలే కారణమా? పార్టీ అధిష్టానంపై వ్యతిరేకత? అంటూ చర్చ జరుగుతోంది.

'విప్'ను బేఖాతరు

సుమారు 40 మున్సిపాలిటీల్లో అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. దీంతో అలర్ట్​అయిన అధిష్టానం విప్‌లను జారీ చేస్తుంది. అవిశ్వాసానికి సిద్ధమయ్యే నేతలకు ముందుగానే పార్టీ విప్‌లను జారీ చేస్తున్నప్పటికీ పట్టించుకోవటం లేదు. ముఖ్యంగా చైర్మన్‌లతో ఉన్న విభేదాలతో అవిశ్వాసాలకు దారితీస్తున్నాయి. రోజూ ఏదో ఒక మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానాన్ని పెడుతూనే ఉన్నారు. ఇప్పటికే ఆర్మూర్, నల్లగొండ, మంచిర్యాల, నస్పూర్, బెల్లంపల్లి, సిద్దిపేట, నేరేడుచర్ల ఇలా పది మున్సిపాలిటీలను బీఆర్ఎస్ నుంచి చేజారాయి.

సొంత నియోజకవర్గంలోనూ..

కేటీఆర్ సొంత అసెంబ్లీ నియోజకవర్గమైన సిరిసిల్లలో మెజార్టీ వార్డులను గెలుచుకొని చైర్మన్‌ను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అయితే అధికారం పోయిన తర్వాత సిరిసిల్లలోనూ సొంతపార్టీ కౌన్సిలర్లు అవిశ్వాసానికి తెరదీశారు. 12మంది కౌన్సిలర్లు క్యాంపునకు తరలించడం, మరో 8 మంది వెళ్లేందుకు సిద్ధపడటం చర్చనీయాంశమైంది. ఈ అంశంతో కేటీఆర్​సామర్థ్యం, పనితీరు పార్టీలోనే చర్చనీయాంశమైంది.

సిరిసిల్లలో తిరుగుబాటు కేటీఆర్‌కు సవాలుగా మారింది. ఇప్పుడు సిరిసిల్లను కాపాడుకోవటం ఆయన పనితనానికి గీటురాయిగా మారింది. ఇప్పటికే కేటీఆర్ దూకుడు స్వభావం, వ్యవహారశైలీతోనే పార్టీకి నష్టం జరుగుతోందని చర్చించుకుంటున్నారు. తాజా రాజకీయ పరిణామాలు ఆయన రాజకీయ భవిష్యత్‌కు కొలమానం కానున్నాయి. వాటిని ఎలా డీల్ చేస్తారనేది పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇలాగే కొనసాగితే కష్టమే..?

ప్రస్తుత మున్సిపాలిటీల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు పార్టీ భవిష్యత్‌ను నిర్దేశించనున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఓటమితో తీవ్ర అసంతృప్తితో ఉన్న కేడర్.. మున్సిపాలిటీలను సైతం చేజారుతుండటంతో నేతలు, కార్యకర్తలు సైతం అయోమయంలో పడ్డారు. వచ్చే పార్లమెంట్​ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎలక్షన్‌లో పార్టీ పరిస్థితిపై ఆందోళన నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed