గులాబీ నేతలకు షాక్.. బీఆర్ఎస్ మహాధర్నాకు సింగరేణి కార్మికులు దూరం

by Javid Pasha |
గులాబీ నేతలకు షాక్.. బీఆర్ఎస్ మహాధర్నాకు సింగరేణి కార్మికులు దూరం
X

దిశ ప్రతినిధి, నిర్మల్: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో సింగరేణి బొగ్గు గనుల వేలంకు నిరసనగా పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బొగ్గు గనుల్లో నిర్వహించిన మహా ధర్నాకు కార్మికులు షాక్ ఇచ్చారు. పదివేల మంది కార్మికులు హాజరవుతారని ఆశించగా 2000 మించి రాలేదని చెబుతున్నారు. తాజా పరిణామం చూస్తే సింగరేణి కార్మికులు అధికార పార్టీకి షాక్ ఇచ్చినట్లుగానే భావిస్తున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సహా జిల్లాకు చెందిన శాసన సభ్యులందరూ ఇతర ముఖ్య నేతలు హాజరైన సింగరేణి కార్మికుల మహాధర్నా అత్యంత పేలవంగా సాగడం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇంటెలిజెన్స్ నివేదిక వెళ్లినట్లు చెబుతున్నారు.

కార్మికులు ఎందుకు దూరం ఉన్నట్టు..?

తెలంగాణలో విస్తరించి ఉన్న సింగరేణి నాలుగు బొగ్గు గనులను వేలం వేసినందుకు కేంద్రం నిర్ణయం తీసుకుందని... సింగరేణి ప్రైవేటీకరణ చేసే యత్నంలో భాగంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తూ భారత్ రాష్ట్ర సమితి ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. సింగరేణి ప్రైవేటీకరణను నిరసిస్తూ మంగళవారం బొగ్గు గనులు విస్తరించి ఉన్న అన్ని జిల్లాల్లో స్వయంగా కేసీఆర్ ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సింగరేణి ప్రాంతమైన నస్పూర్ లో భారత్ రాష్ట్ర సమితి మహాధర్నా చేపట్టింది. ఆ పార్టీ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్మికులతో పాటు అధికార పార్టీ కార్యకర్తలు భారీగా ఈ ధర్నాకు తరలిరావాలని పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ నేతృత్వంలో భారీగానే ఏర్పాట్లు చేశారు. ఈ జిల్లాలోని చెన్నూరు మంచిర్యాల బెల్లంపల్లి తో పాటు ఆసిఫాబాద్ జిల్లాలోని భారీగా బొగ్గు గనులు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ కు సభ్యులు సైతం ఎక్కువ మొత్తంలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మహాధర్నాకు పదివేలకు పైగా సింగరేణి కార్మికులు పార్టీ కార్యకర్తలు తరలివస్తారని అధికార పార్టీ అంచనా వేసింది. అయితే పార్టీ శ్రేణులు ఆశించిన స్థాయిలో కార్మికులు మహాధర్నాకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. సింగరేణి కార్మికులు పార్టీ కార్యకర్తలు అంతా కలిపి సుమారు రెండువేల దాకా హాజరై ఉంటారని పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. దీన్నిబట్టి సింగరేణి కార్మికులు ప్రైవేటీకరణ అంశం కన్నా ఎక్కువగా అధికార పార్టీ పిలుపును పట్టించుకోనట్లుగా కనిపించింది.

బొగ్గు గనుల్లోనే కార్మికుల నిరసన

ఇదిలా ఉంటే అధికార భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నస్పూర్ మహా ధర్నాకు భారీ ఎత్తున సింగరేణి కార్మికులు తరలి వస్తారని ఆశించారు. అయితే సమీపంలో ఉన్న కొన్ని గనుల కార్మికులు తప్ప ఇతర ప్రాంతాల నుంచి కార్మికులు ఈ మహా ధర్నాకు హాజరు కాలేదు. గనుల్లోనే కార్మికులు ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేశారు. అయితే విధులకు దూరంగా ఉండకుండా నిరసన తెలుపుతూనే పనుల్లో పాల్గొన్నారు. తాండూర్ బెల్లంపల్లి కాసీపేట డోర్లీ మందమర్రి తదితర మైన్స్ లో కార్మికులు అక్కడే నిరసనలు చేపట్టారు అన్ని గనుల నుంచి భారీ ఎత్తున నస్పూర్ తరలివస్తారని ఆశించినప్పటికీ కార్మికులు మహా ధర్నాకు హాజరు కాకపోవడం పట్ల భిన్న రకాల చర్చ మొదలైంది.

ఏఐటీయూసీ మద్దతు అంతంతే..

రాష్ట్రంలో అధికార భారత రాష్ట్ర సమితి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు పొత్తులకు సన్నద్ధమవుతుండగా సింగరేణి కార్మిక క్షేత్రంలో మాత్రం అధికార టీబీజీకేఎస్ కు దూరంగా ఉండేందుకే ఏఐటీయూసీ మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. శనివారం నాటి ధర్నా చూస్తే ఏఐటియుసి కార్యకర్తలు అంతంత మాత్రంగానే హాజరయ్యారు. సీపీఐ జిల్లా కార్యదర్శి శంకర్ మినహా పేరు ఉన్న సింగరేణి కార్మిక సంఘాల ముఖ్య నేతలు ఎక్కువగా నస్పూర్ సభకు హాజరు కాకపోవడం కూడా చర్చకు దారి తీసింది. తాజా పరిణామాలు చూస్తే సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో ఏఐటీయూసీ అధికార టీబీజీకేఎస్ తో పొత్తుకు దూరంగా ఉండేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

ముఖ్య నేతల డుమ్మా

సింగరేణి వ్యాప్తంగా భారత్ రాష్ట్ర సమితి నిర్వహించిన మహాధర్నా కార్యక్రమాలకు ఎమ్మెల్యేలందరూ అధికార పార్టీ ముఖ్య నేతలు అందరూ హాజరుకావాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా నస్పూర్ లో సింగరేణి మహా ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు విట్టల్ రెడ్డి, రేఖ శ్యాం నాయక్, కోనేరు కోనప్ప నిర్మల్ జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి సహా మరికొందరు ముఖ్య నేతలు ధర్నాకు వెళ్లలేదు. ఈ వ్యవహారం కూడా చర్చనీయాంశమైంది. సీపీఐ సీపీఎం అగ్ర నేతలు కూడా ధర్నాకు రాకపోవడం చర్చకు దారి తీసింది.

అభిమానం తగ్గిందా..

సింగరేణి ప్రైవేటీకరణ చేస్తున్నారని కేంద్రం కుట్రలను తిప్పికొడదామంటూ భారత రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపునకు ఆశించిన స్థాయిలో కార్మికుల నుంచి స్పందన లేకపోవడం అధికార పార్టీలో కలకలం రేపుతోంది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపే సింగరేణి కార్మికులు అధికార పార్టీపై కొంత నిరుత్సాహంతో ఉన్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వ అనుబంధ సంఘంగా పేరు ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంలో నెలకొన్న లుకలుకలు నేతల మధ్య విభేదాలు కార్మికులను పట్టించుకోకుండా నేతలు ఏకపక్షంగా వ్యవహరించడం సింగరేణి కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ విషయంలో యాజమాన్యం పూర్తిస్థాయిలో సహకరించడం లేదన్న నిరసన కార్మికుల్లో ఉన్నట్లు చెబుతున్నారు. తాజా పరిణామాలు సింగరేణిలో అధికార పక్షానికి కొంత మైనస్ గా మారేలా కనిపిస్తున్నాయి.

Advertisement

Next Story