'బ్రదర్ హిమాన్షు.. గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే మీకు రక్తం వస్తుందేమో'.. శివసేన రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ

by Vinod kumar |
బ్రదర్ హిమాన్షు.. గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే మీకు రక్తం వస్తుందేమో.. శివసేన రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు గ్రేటర్ హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకుని.. దాన్ని కార్పొరేట్‌ స్కూల్‌కు ధీటుగా తీర్చిదిద్దిన విషయం తెలిసిందే. ఖాజాగూడ ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ సమీపంలోని కేశవనగర్‌ ప్రభుత్వ బడిని కార్పొరేట్‌ స్కూలును తలదన్నేలా తీర్చిదిద్దారు. జులై 12న హిమాన్షు పుట్టిన రోజు సందర్భంగా పాఠశాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. దాదాపు రూ. కోటి రూపాయలతో పాఠశాలను కార్పొరేట్ స్కూల్ మాదిరిగా తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో హిమాన్షు ప్రభుత్వ పాఠశాలలపైన మాట్లాడిన అంశంపై శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ స్పందించారు.

''బ్రదర్ హిమాన్షు.. రాష్ట్ర రాజధానిలో పాఠశాల చూస్తే మీకు కన్నీళ్లు వచ్చాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పాఠశాలలను చూడండి.. కళ్ళ నుంచి రక్తం వస్తుందంటూ''.. శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. మీ తాతకు, తండ్రికి ఇంటికి వెళ్లి దయచేసి చెప్పండి.. రాష్ట్రంలో ఉన్నటువంటి 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఇవే పరిస్థితులు ఉన్నాయని.. వాటిని సరిదిద్దాలని వారి బాధ్యతను గుర్తు చెయ్యండన్నాడు. 9 ఏళ్లుగా కేసీఆర్ పాలనలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు నాశనం అయ్యాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలను దత్తతకు తీసుకునే పరిస్థితులు ఎందుకు వచ్చాయని ఆయన ప్రశ్నించారు. విద్యా వ్యవస్థ పైన విద్యా శాఖ మంత్రికి అవగాహన ఉన్నదా లేదా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. ఇప్పటి వరకు మౌలిక సదుపాయాలు లేని పాఠశాలలు వేల సంఖ్యలో ఉన్నాయన్నారు. మరి అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.

Advertisement

Next Story