తెలంగాణ రాజకీయంలో సరికొత్త సమీకరణాలు.. Pawan Kalyan స్థానంలో Y.S.Sharmila ?

by samatah |   ( Updated:2022-12-07 10:21:38.0  )
తెలంగాణ రాజకీయంలో సరికొత్త సమీకరణాలు.. Pawan Kalyan స్థానంలో Y.S.Sharmila  ?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయంలో వైఎస్ షర్మిల వ్యవహారం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. ప్రజాప్రస్థానం పేరుతో ఆమె చేపట్టిన పాదయాత్రపై టీఆర్ఎస్ శ్రేణుల దాడి చేయడం ఆ వెను వెంటనే బీజేపీ నుంచి ఆమెకు బహిరంగంగా మద్దతు లభించడం సంచలనంగా మారింది. తాజాగా షర్మిలపై జరిగిన దాడి ఘటనపై ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఫోన్ చేసి వాకబు చేశాడని, వీలును బట్టి ఢిల్లీ రావాలని ఆహ్వానించినట్టు ప్రచారం జరుగుతుండటం మరింత చర్చకు దారి తీస్తోంది. అయితే షర్మిల విషయంలో బీజేపీ నేతల తీరుపై టీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. షర్మిల బీజేపీకి బీ టీమ్ అని తాము మొదటి నుంచి చెబుతున్నామని ఇప్పుడు తాము చెప్పిందే నిజం అని తేలిపోయిందని చెబుతున్నారు. రాజకీయంగా ఒక్క ఎమ్మెల్యే కాదు కదా ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలికి ఏకంగా పీఎం ఫోన్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే షర్మిలతో బీజేపీ మిత్ర బంధం విషయంలో సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి.

షర్మిల విషయంలో తెలంగాణ సమాజంలో మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఆమెను వెనుకుండి నడిపిస్తున్నది ఎవరూ అనే విషయంలో ఇప్పటికీ అనేక మందిలో ఓ ప్రశ్నే. అయితే జరుగుతున్న ప్రచారం ప్రకారం షర్మిల విషయంలో బీజేపీ అధిక ప్రాధాన్యత ఇవ్వడం వెనుక ఆసక్తికర చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో జనసేనతో మిత్ర బంధం కొనసాగిస్తామని ఓపెన్ గా చెబుతున్న బీజేపీ.. తెలంగాణ విషయంలో పవన్ కల్యాన్ కంటే షర్మిల కార్డును ఉపయోగించుకోబోతోందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీలో ఉన్న అవగాహన ఒప్పందం మేరకు తెలంగాణలోనూ బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం ఉంది. అయితే తెలంగాణలో ఒంటిరిగానే పోటీ చేస్తామని చెప్పిన బీజేపీ తాజాగా వైఎస్సార్ టీపీతో పొత్తు దిశగా ఆలోచన చేస్తోందా? అందుకోసమే షర్మిల విషయంలో ఇంతలా రియాక్ట్ అవుతోందా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనపడటం బీజేపీకి అనుకూలించే అంశం అని రాజకీయ పండితులు చెబుతున్న మాట. కాంగ్రెస్ ఓట్లను మరింతగా చీల్చాలన్నా, ఆ పార్టీని బలహీనపరచాలన్న వైఎస్సార్ టీపీతో ఏ మేరకు సాధ్యం అవుతుందనే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. రాజశేఖర్ రెడ్డి అంటే అభిమానం చూపే వారు తెలంగాణలో చాలా మందే ఉన్నారు. ఇప్పటికీ గ్రామాల్లో ఆయన పట్ల ఆప్యాయత కనపరుస్తుంటారు.

ఇటీవల బీజేపీ టీ కాంగ్రెస్ ను టార్గెట్ చేసింది. ఆ పార్టీలోని ముఖ్యనేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఇక క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఓట్లను సైతం తమ వైపు తిప్పుకోగలిగితే తమ విజయం మరింత సులభం అవుతుందనే లెక్కలు బీజేపీ వేసుకుంటోందనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే షర్మిల పార్టీని దగ్గరకు చేర్చుకోవడం ద్వారా కొంతలో కొంతైనా కాంగ్రెస్ కు డ్యామేజ్ చేసేలా వ్యూహాత్మకంగా బీజేపీ అడుగులు వేస్తోందా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. తాను తెలంగాణ కోడలిని అంటూ షర్మిల చేస్తున్న ప్రయత్నాలు ఆశించినంతగా ప్రజల్లోకి వెళ్లడం లేదనే భావన ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గత ఎన్నికల్లో చంద్రబాబును బూచిగా చూపించిన కేసీఆర్ ఈ సారి షర్మిల రూపంలో సెంటిమెంట్ రగిలిస్తే అది అంతిమంగా ఎవరికి ప్రయోజనకరంగా మారుతుందో అనేది రాజకీయ వర్గాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరో వైపు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ జనసేన పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఏయే స్థానాల్లో పోటీ చేయాలో పార్టీ నేతలు డిసైడ్ చేయాలని అవసరం అయితే తెలంగాణలో కొండగట్టునుంచే పాదయాత్ర కూడా ప్రారంభిస్తానని గతంలో హామీ ఇచ్చారు. ఓ వైపు ఏపీలో జగన్ తో విభేదిస్తున్న జనసేనతో అంటకాగుతున్నన్న బీజేపీ.. తెలంగాణలో అదే జగన్ సోదరి షర్మిల పార్టీతో పొత్తు పెట్టుకుంటామంటే అందుకు పవన్ కల్యాణ్ అంగీకరిస్తారా అనేది తేలాల్సి ఉంది.

Also Read...

ఢిల్లీ ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన ట్రాన్స్ జెండర్

Advertisement

Next Story

Most Viewed