నేటి నుంచి SFI జాతీయ మహాసభలు

by Nagaya |   ( Updated:2022-12-13 02:09:46.0  )
నేటి నుంచి SFI  జాతీయ మహాసభలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) 17వ జాతీయ మహాసభలకు హైదరాబాద్ నగరం వేదిక కానున్నది. ఉస్మానియా వర్శిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరగనున్న మహాసభలు మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభం కానున్నాయి. దీనికి ముందు మింట్ కాంపౌండ్ సమీపంలోని ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ నుంచి నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వరకు మంగళవారం ఉదయం 11 గంటలకు విద్యార్థులతో కూడిన భారీ ప్రదర్శనను ఎస్ఎఫ్ఐ నిర్వహిస్తున్నది. అనంతరం అక్కడ జరిగే బహిరంగసభకు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు.

ఉస్మానియా వర్శిటీ ఠాగూర్ ఆడిటోరియంలో మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు లాంఛనంగా ఎస్ఎఫ్ఐ 17వ జాతీయ మహాసభలు ప్రారంభం కానున్నాయి. ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సాను అధ్యక్షతన జరిగే ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యే మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కె.చంద్రు ప్రసంగించనున్నారు. ఈ మహాసభల ఆహ్వాన కమిటీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తారని, ఎస్ఎఫ్ఐ కార్యకలాపాల గురించి జాతీయ ప్రధాన కార్యదర్శి మయూక్ బిశ్వాస్ వివరిస్తారని రాష్ట్ర యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, టి.నాగరాజు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం, నేటి విద్యా వ్యవస్థపై దాని ప్రభావం, ఉపాధి అవకాశాలు సన్నగిల్లడం, ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రైవేటీకరించడం, దాని ఫలితంగా విద్యావంతులైన నిరుద్యోగులకు చేకూరే నష్టం, విద్యా వ్యవస్థలో సిలబస్ మార్పుతో తలెత్తే ప్రమాదం, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు చూపే ప్రభావం తదితర అనేక అంశాలపై నాలుగు రోజుల మహాసభల్లో చర్చ జరగనున్నదని, అన్ని రాష్ట్రాల ఎస్ఎఫ్ఐ బాధ్యులతో పాటు వివిధ దేశాల నుంచి సౌహార్ద్ర ప్రతినిధులు హాజరవుతారని రాష్ట్ర యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు.

Also Read...

సంక్షేమాన్ని మింగేస్తున్న కేంద్రం.. అయినా సైలెంట్!

Advertisement

Next Story

Most Viewed