రైతులను గోస పెట్టాలని చూస్తే తీవ్ర పరిణామాలు.. బీఆర్ఎస్ నేత హెచ్చరిక

by Ramesh Goud |
రైతులను గోస పెట్టాలని చూస్తే తీవ్ర పరిణామాలు.. బీఆర్ఎస్ నేత హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్: పసుపు రైతులకు మద్దతు ధర వెంటనే చెల్లించాలని, పసుపు రైతులను గోస పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే (Balkonda MLA) వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) హెచ్చరించారు. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే వేములకు పలువురు రైతులు ప్రస్తుత పసుపు ధర సమస్యపై (Turmeric Price Issue) వివరించారు. వెంటనే పసుపు రైతుల సమస్యలపై కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడిన ఆయన.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీ మేరకు పసుపు రైతులను మద్దతు ధర వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

పాలకవర్గం, దళారులు సిండికేట్ గా ఏర్పడి పసుపు ధర తగ్గిస్తూ రైతులను ఇబ్బందులు పెడుతున్నారని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతుకు (Rajeev Gandhi Hanmanth) ఫోన్లో వివరించారు. వెంటనే సమస్య పరిష్కరించాలని, కొమ్ము పసుపుకు 10వేలు, మండకు 9వేల చొప్పున కటాఫ్ నిర్ణయయించారని, ఇప్పుడు అది తగ్గిస్తున్నట్టు రైతులు తన దృష్టికి తీసుకొచ్చారని, కటాఫ్ ఎట్టి పరిస్థితుల్లో తగ్గకుండా చూడాలని సూచించారు. అలాగే పసుపు బోర్డు పేరుకే ఏర్పాటు అయిందని, నామ మాత్రపు ఎమ్మెస్పీ మాత్రమే ఇస్తున్నారని అన్నారు. పసుపు బోర్డు వస్తే క్వింటాలుకు 15 వేలు మద్దతు ధర ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 12 వేల మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చిందనీ, ఇప్పుడు రైతులకు వస్తున్న 10 వేలకు మరో రెండు వేలు కలిపి కాంగ్రెస్ ప్రభుత్వం పసుపు రైతులకు చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అంతేగాక పసుపు మండ కటాఫ్ ధరను 9 వేల నుండి 8000 లకు తగ్గిస్తూ.. రైతులను ఇబ్బంది పెడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక కొమ్ముకు 10వేలు, మండకు 9వేలు కనీస కటాఫ్ ధర ఉండేలా చూడాలన్నారు. లేని పక్షంలో పసుపు రైతులు మరొక్కసారి గంజికి వచ్చే పరిస్థితి ఏర్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. రైతుల కోసం ఎంతకైనా తెగించేందుకు తామెప్పుడూ సిద్ధమేనని బీఆర్ఎస్ నేత స్పష్టం చేశారు.

Next Story