111 జీవోపై రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయం

by GSrikanth |
111 జీవోపై రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: 111 జీవోపై రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. నూతన సచివాలయం ప్రారంభం జరిగాక మొదటిసారి కేబినెట్ భేటీని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా 111 జీవోను ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలోని 84 గ్రామాలకు మేలు చేసేలా జీవో ఎత్తివేస్తున్నట్లు కేబినెట్ ప్రకటించింది. కాగా, హైదరాబాద్ నగరానికి తాగు నీరు అందించేందుకు నిజాం పాలకుల హయాంలో జంట జలశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లను నిర్మించిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ల క్రితం వరకు ఈ జలాశయాలే హైదరాబాదీల తాగు నీటి అవసరాలను తీర్చేవి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ జలాశయాలను కాపాడుకోవడం కోసం.. 1996లో అప్పటి ప్రభుత్వం 111 జీవోను తీసుకొచ్చింది.

ఈ జలాశయాల్లోని నీరు కలుషితమైతే.. ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందనే కారణంతో ఈ జీవోను జారీ చేశారు. ఈ జీవో ప్రకారం.. జంట జలాశయాల చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని బయో కన్జర్వేషన్ జోన్‌గా ప్రకటించారు. రంగారెడ్డి జిల్లాలోని ఏడు మండలాలకు చెందిన 84 గ్రామాలు ఈ పరిధిలోకి వస్తాయి. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో 111 జీవో అర్థరహితం అని అసెంబ్లీ సాక్షిగా ఇటీవల సీఎం కేసీఆర్ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ నగర అవసరాలను తీర్చడం కోసం ఇప్పుడు గోదావరి, కృష్ణా నదుల నుంచి నీరు వస్తోందని.. మరో వందేళ్లు నగరానికి తాగునీటి కొరత ఉండదని.. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో 111 జీవోకు అర్థం లేదన్నారు. నిపుణుల కమిటీ నివేదిక రాగానే 111 జీవోను ఎత్తివేస్తామని సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. అయితే, అనూహ్యంగా ఇవాళ(మే 18న) కొత్త సచివాలయంలో నిర్వహించిన కేబినెట్ భేటీలో జీవోను వెనక్కు తీసుకుంటామని ప్రకటించడం చర్చనీయాంశమైంది.

Advertisement

Next Story

Most Viewed