ఏలేటి పాదయాత్రలో మాణిక్ రావు థాక్రే సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |
ఏలేటి పాదయాత్రలో మాణిక్ రావు థాక్రే సంచలన వ్యాఖ్యలు
X

దిశ, ప్రతినిధి నిర్మల్: దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరూ మతతత్వ రాజకీయాలకు పాల్పడుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్ ఠాక్రే ధ్వజమెత్తారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రకు ఆయన హాజరయ్యారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి జరిగిన పబ్లిక్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర సందేశాన్ని ఇంటింటికీ చేరవేసేందుకే రాష్ట్రంలో హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ను బలహీనపరిచేందుకు బీజేపీ, బీఆర్ఎస్‌లు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. ప్రశ్నించే వారిని అణగదొక్కేందుకు మోడీ, కేసీఆర్‌లు కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. మాజీ పీసీసీ చీఫ్ వీ.హనుమంతరావు మాట్లాడుతూ.. హిందూ ముస్లిం పేరిట మోడీ, కేసీఆర్ రాజకీయాలు చేస్తూ ఓటు బ్యాంకు కోసం దేశవ్యాప్తంగా ప్రజలను విభజించారని ఆరోపించారు. ఆ రెండు పార్టీలను నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. ఓట్ల కోసం మైనార్టీలకు రిజర్వేషన్లు అంటూ కేసీఆర్ ఇంకా నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని దీన్ని ప్రజలు నమ్మొద్దని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు.

ఏఐసీసీ వ్యవహారాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కబుర్లు చెబుతూ ప్రజలను నమ్మబలిగించే ప్రయత్నం చేయడం మినహా కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఏమి చేయలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ భారత్ రాష్ట్ర సమితిని ఓడించేందుకు అన్ని శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. తాను చేపట్టిన జోడో యాత్రను విజయవంతం చేసేందుకు హాజరవుతున్న కాంగ్రెస్ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని అన్ని నియోజకవర్గాల్లో గెలిపించి తీరుతానని శపధం చేశారు. నిర్మల్ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని స్థానికంగా జరిగిన అన్ని అక్రమాలను బయటకు తీసి అందుకు కారణమైన నేతలను ప్రజాబోనులో నిలబెడతామని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed