‘KCR కిట్’లో భారీ స్కామ్.. మంత్రి దామోదర రాజనర్సింహ సంచలన వ్యాఖ్యలు

by Satheesh |
‘KCR కిట్’లో భారీ స్కామ్.. మంత్రి దామోదర రాజనర్సింహ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గత ప్రభుత్వం తీసుకొచ్చిన ‘కేసీఆర్ కిట్’, ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌’ స్కీమ్‌లలో భారీ కుంభకోణం జరిగిందని, అందువల్లనే ఆ రెండు పథకాలను తాత్కాలికంగా నిలిపివేశామని, త్వరలో తగిన మార్పులు చేర్పులు చేసి వాటికి కొత్త రూపం ఇచ్చి అమలు చేస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల నిర్మాణం కోసం గత ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి రూ. 9 వేల కోట్ల మేరు రుణం తీసుకున్నదని, ఆ సొమ్ము ఏమైందో తెలియదని ఆరోపించారు.

మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా పలు సంచలన ఆరోపణలు చేశారు. జిల్లాకో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ అంటూ మాజీ సీఎం కేసీఆర్ హడావిడి చేశారని, ప్రాంతాలవారీగా సర్వే చేయకుండానే అవసరం లేకపోయినా మంజూరు చేశారని ఆరోపించారు. ఈ కారణంగా మెడికల్‌ కాలేజీలు పెట్టినా అందులో పనిచేయడానికి ప్రొఫెసర్లు కూడా దొరకని పరిస్థితి తలెత్తిందన్నారు.

అన్ని విషయాల్లో కేసీఆరే ఒక ఇంజినీర్‌గా, డాక్టర్‌గా వ్యవహరించారని మంత్రి దామోదర ఎద్దేవా చేశారు. గతంలో కరోనాకు పారాసిటమాల్‌ టాబ్లెట్ సరిపోతుందని అసెంబ్లీ వేదికగా కామెంట్ చేసి డాక్టర్ అవతారమెత్తారని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆయనే డిజైన్‌ చేసి ఒక ఇంజనీర్‌గా మారారని ఆరోపించారు. సిద్దిపేట ఆస్పత్రిపై దృష్టి పెట్టి ఉస్మానియా ఆస్పత్రిని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. పదేళ్ల పాలనలో కనీసం ఉస్మానియా ఆస్పత్రిని కొత్తగా కట్టలేదన్నారు.

సిటీకి పక్కనే ఉన్న మహేశ్వరంలో మెడికల్‌ కాలేజీ ఎందుకు ఇచ్చారో మిస్టరీ అని అన్నారు. కమీషన్లు వచ్చే పనులు చేశారని, ఇంజనీరింగ్‌ కాలేజీల తరహాలోనే మెడికల్‌ కాలేజీలు కుప్పకూలిపోయే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఈ ఏడాది కొత్తగా ఎనిమిది మెడికల్‌ కాలేజీలు యథావిధిగా ప్రారంభమవుతాయన్నారు. హైదరాబాద్‌లో నాలుగు దిక్కులా ఏర్పాటు చేయబోయే ఆసుపత్రులు ఏదో ఒక స్పెషాలిటీకి ప్రత్యేకంగా ఉంటాయన్నారు.

ఆరోగ్యశ్రీ కార్డు కంపల్సరీ:

పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్న ఉద్దేశంతో వైఎస్సార్ హయాంలో ఆరోగ్యశ్రీ విధానం అమలులోకి వచ్చిందని, ఇప్పటికీ అది కంటిన్యూ అవుతూనే ఉన్నదని మంత్రి దామోదర గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఆరోగ్యశ్రీ కార్డుపై చికిత్స పొందే పరిమితిని రూ. 5 లక్షలను డబుల్ చేసి రూ. 10 లక్షలకు పెంచామన్నారు. ఈ స్కీమ్ కింద వైద్య చికిత్సల ప్యాకేజీని 30% పెంచినట్లు తెలిపారు.

దీంతో ప్రైవేటు ఆసుపత్రులకు ట్రీట్‌మెంట్ అందించడంలో ఇబ్బందులు ఉండబోవన్నారు. ఇక నుంచి పేదల ఉచిత వైద్యం కోసం తెల్ల రేషన్‌ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులంటూ వేర్వేరుగా కాకుండా కేవలం ఆరోగ్యశ్రీ కార్డులనే పరిగణలోకి తీసుకునే విధానం అమలులోకి వస్తుందన్నారు. తెల్ల రేషన్‌ కార్డులు ఉన్నవారంతా ఆరోగ్యశ్రీ కార్డులను తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే మాత్రమే వారికి కార్పొరేట్ వైద్యం అందుతుందని, తెల్ల రేషను కార్డు ఆధారంగా చికిత్స అందదని, అందువల్లనే ఆ అర్హత ఉన్న ప్రతీ కుటుంబం (వైట్ రేషను కార్డు ఉన్న ఫ్యామిలీలు) ఆరోగ్యశ్రీ కార్డు తీసుకోవాల్సిందేనని నొక్కిచెప్పారు.

కార్పొరేట్ ఆస్పత్రులపై త్వరలో దాడులు:

ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు నిబంధనలకు విరుద్ధంగా నడిస్తే వాటిపై ఉక్కుపాదం మోపుతామని మంత్రి దామోదర హెచ్చరించారు. క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ ప్రకారం నిబంధనల ఉల్లంఘన జరిగితే ప్రభుత్వం ఉపేక్షించబోదన్నారు. అన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్‌లో అనుసరించే అన్ని ప్రొసీజర్లకు ధరలను తెలియజేసే బోర్డులను ప్రదర్శించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సైతం ఈ విధానం అమలుకాబోతున్నదన్నారు. దీంతో ఏ వ్యాధికి (ప్రొసీజర్‌కు)కి ఎంతెంత ఖర్చు అవుతుందనే స్పష్టత లభిస్తుందన్నారు. రానున్న రెండు వారాల్లో కార్పొరేట్‌ ఆసుపత్రులపై దాడులు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వానికి ఎవరూ చుట్టం కాదని, రోగులను రాచిరంపాన పెట్టే ఆసుపత్రులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు.

ఇప్పటివరకు నాసిరకం, నాణ్యతలేని, కల్తీ ఆహారం వాడుకున్న హోటళ్లపై దాడులు నిర్వహించామని, త్వరలో దాడులు మరింత ముమ్మరం అవుతాయని స్పష్టం చేశారు. అవసరమైతే వాటిని సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. ఈ యాక్షన్ ప్లాన్‌కు అనుగుణంగానే అదనంగా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లను నియమించిన అంశాన్ని వివరించారు. వైద్య ఆరోగ్యశాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టడంలో ఇది ఒక భాగమన్నారు. ప్రత్యేకంగా మూడు టాస్క్‌ ఫోర్సులను ఏర్పాటు చేశామని, అవి తన ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నాయన్నారు. ప్రైవేటు ఆస్పత్రులు, మెడికల్‌ షాపులు, హాటళ్లపైనా ఈ దాడులు కంటిన్యూ అవుతాయన్నారు.

వైద్య సిబ్బందికి బదిలీలు తప్పనిసరి:

వైద్యారోగ్య శాఖలోని వివిధ విభాగాల్లో ఐదేళ్లుగా పనిచేస్తునన డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సహా వైద్య సిబ్బందిని బదిలీలు చేసి తీరుతామని మంత్రి దామోదర తెలిపారు. ఏ స్థాయి ఉద్యోగి అయినా వెసులుబాటు ఉండబోదన్నారు. ఉద్యోగ సంఘాల నేతలందరికీ మినహాయింపు ఉండదని, ముగ్గురు నలుగురికి మాత్రమే ఉంటుందన్నారు. బదిలీలకు సంబంధించి నిశితంగా అధ్యయనం జరుగుతున్నదన్నారు.

డీఎంఈలో అడ్మినిస్ట్రేటివ్‌ పోస్టుకు గరిష్ట వయోపరిమితి 65 ఏళ్లు ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు. డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్, డ్రగ్‌ కంట్రోల్, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ పోస్టుల్ని ఏర్పాటు చేస్తామన్నారు. మూడు డైరెక్టర్‌ పోస్టులను అదనంగా సృష్టిస్తున్నామన్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను ఇకపైన ‘సెకండరీ హెల్త్‌ డెరెక్టరేట్‌’గా మార్చుతామన్నారు. అందులో పనిచేసే ఉద్యోగులకు ట్రెజరీ ద్వారానే వేతనాలు ఇస్తామన్నారు.

రాష్ట్రంలో మండలానికొక పాలియేటివ్‌ కేర్‌ సెంటర్‌ను నెలకొల్పుతామన్నారు. యాక్సిడెంట్‌ కేసులో లక్ష వరకు ఉచిత వైద్యం అందజేస్తామని, యాక్సిడెంట్‌ జరిగిన సమీపంలో ఏ ఆసుపత్రి ఉన్నా సామాజిక బాధ్యతగా ఉచితంగా వైద్యం అందించాల్సిందేనన్నారు. ఇందుకోసం ప్రతి 35 కి.మీ.లకు ఒకటి చొప్పున ట్రామా కేర్‌ సెంటర్‌లను ఏర్పాటు చేస్తామని, ఇకపై కొత్తగా 75 సెంటర్లు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇప్పుడు పనిచేస్తునన ‘తెలంగాణ డయాగ్నస్టిక్‌ సెంటర్ల’ను ప్రభుత్వ ఆస్పత్రులకు లింక్‌ చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కోసం నిధుల విడుదల, వినియోగం పారదర్శకంగా ఉండేలా గ్రీన్‌ ఛానల్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గా ఉన్న డాక్టర్ రవీందర్‌పై వచ్చిన ఆరోపణలను ప్రస్తావిస్తూ... ఆయన పనితీరు సంతృప్తికరంగా లేదని అభిప్రాయపడ్డారు. దీనికి కొనసాగింగా వైద్యారోగ్య శాఖలోని వివిధ విభాగాల అధిపతుల పనితీరును కూడా స్వయంగా తానే లోతుగా పరిశీలిస్తుమని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed