CM Revanth: ఇంటికో ఉద్యోగం ఇస్తాం.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |
CM Revanth: ఇంటికో ఉద్యోగం ఇస్తాం.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: రైతు రుణమాఫీ(Runa Mafi) విషయంలో బీజేపీ(BJP), బీఆర్ఎస్‌(BRS)కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సవాల్ చేశారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో ‘రైతు పండుగ’ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయని విధంగా రుణమాఫీ చేశామని అన్నారు. దేశ చరిత్రలోనే ఇది తొలిసారి అని తెలిపారు. దీనిపై చర్చించేందుకు తాను సిద్ధమని.. ప్రధాని మోడీ(MODI), మాజీ సీఎం కేసీఆర్(KCR) సిద్ధమా? అని ఛాలెంజ్ చేశారు. మొత్తం రాష్ట్రంలోని 25 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ చేశామని అన్నారు. మహబూబ్‌నగర్‌ను వలసల జిల్లా చేసింది కేసీఆరే అని మండిపడ్డారు.

ప్రజలు పదేళ్లు అధికారం ఇచ్చినా పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓఆర్ఆర్‌ను అమ్మి రుణమాఫీ చేసిందని, అది కూడా రూ.11 వేల కోట్లే అని ఎద్దేవా చేశారు. తాము తొలి ఏడాదిలోనే రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని అన్నారు. మహబూబ్‌నగర్‌ ఎవరో దత్తత తీసుకోవాల్సిన అవసరం లేదని.. మన జిల్లాను మనమే అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. ఇకనుంచి ప్రతి సంవత్సరం జిల్లా అభివృద్ధికి రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని కీలక ప్రకటన చేశారు. కేసీఆర్, బీఆర్ఎస్ నేతల మాటలు నమ్మి కేసుల్లో ఇరుక్కోవద్దని అన్నారు. సీఎంగా ఉన్న తానే కేసుల నుంచి తప్పించుకోలేను.. మీరేంత అని అన్నారు. లగచర్లలో 1300 ఎకరాల భూసేకరణను రచ్చ చేశారు.

అమాయకులను రెచ్చగొట్టి దాడులు చేయించారు. బీఆర్ఎస్ నేతల మాటలు నమ్మి దాడి చేసిన వారు జైలుకు పోయారు. ఆ దొంగలు ఫామ్‌హౌజ్‌లకు పోయి పార్టీలు చేసుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకే బీఆర్ఎస్ నేతల మాటలు నమ్మొద్దని చెప్పారు. భూసేకరణ లేకుండా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని అడిగారు. తెలంగాణ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నామని అన్నారు. లగచర్లలో ఎకరాకు 20 లక్షల చొప్పున భూసేకరన చేస్తామని.. భూములు ఇచ్చిన ప్రతీ రైతు కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సంచలన హామీ ఇచ్చారు. నా జిల్లాను నేను మోసం చేయను.. నా ప్రజలను నేను అన్యాయం చేయబోను అని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed