T- Congress లో ఉత్కంఠ రేపుతోన్న ''దిగ్విజయ్ ​రిపోర్ట్''.. రేవంత్‌ను ఇరుకున పెట్టేలా సీనియర్లు మరో స్కెచ్..?

by Satheesh |   ( Updated:2022-12-25 02:43:33.0  )
T- Congress లో ఉత్కంఠ రేపుతోన్న దిగ్విజయ్ ​రిపోర్ట్.. రేవంత్‌ను ఇరుకున పెట్టేలా సీనియర్లు మరో స్కెచ్..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​ పార్టీ తిరుగుబాటు నేతల్లో ఆయోమయం నెలకొంది. పార్టీలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు రాష్ట్రానికి వచ్చిన సీడబ్ల్యూసీ నేత దిగ్విజయ్​సింగ్​ పర్యటన ఎటూ తేలకుండానే ముగిసింది. అంతేకాకుండా సీనియర్లకు వార్నింగ్ ఇచ్చి, అంతర్గత సమస్యలపై రోడ్డెక్కవద్దంటూ ఝలక్​ఇచ్చారు. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి ఈ భేటీకి రాకపోవడంతో ఆయనపై ఎలాంటి ప్రకటనలు, సీనియర్లకు హామీ ఇవ్వకుండానే ఢిల్లీకి వెళ్లారు. దీంతో సేవ్​కాంగ్రెస్​నినాదాన్ని కొనసాగించాలా.. లేక సైలెంట్‌గానే ఉండాలా అనే విషయంలో సతమతమవుతున్నారు.

ఉందామా.. పోదామా..?

తిరుగుబాటు నేతల్లో కొంతమంది ఇప్పటికే పక్క చూపులు చూస్తున్నారు. ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు వెనకాముందాడుతున్నారు. కొంతమందికి బీజేపీ వైపు నుంచి ఆఫర్లు వస్తున్నాయి. నియోజకవర్గాల్లో సీటు కన్ఫర్మ్​చేస్తామంటూ చెప్తున్నారు. అయితే, కేవలం అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ మాత్రమే కాకుండా.. పార్టీ పదవుల్లోనూ ప్రాధాన్యత ఉంటుందా అనే ఆయోమయంలో ఉంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో పరిస్థితి మారుతుందా లేదా అనే భయం కూడా పట్టుకుంది. మరోవైపు రేవంత్​పెత్తనంపై తిరుగుబాటు చేస్తుంటే.. ఏఐసీసీ నుంచి ఆశించిన స్థాయిలో రిప్లై రావడం లేదు. దీంతో పార్టీలో ఉందామా.. బయటకు వెళ్దామా అనే సందిగ్థంలో కొట్టుమిట్టాడుతున్నారు.

అంతర్గతంగా ఎలా..!

టీపీసీసీ కమిటీలపై ఒక్కసారిగా తిరుగుబాటు ఎంచుకున్న పార్టీ సీనియర్లు ఇప్పుడు అంతర్గత కొట్లాటలతోనే కొనసాగుదామా అనే భయం పట్టుకుంది. అటు రేవంత్ వర్గానికి చెందిన 12 మంది పార్టీ పదవులకు రాజీనామా చేసినా ఏఐసీసీ పెద్దగా పట్టించుకోవడం లేదు. వాటిని ఆమోదించే చాన్స్​కూడా లేదని పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వారంతా కంటిన్యూ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాము తిరుగుబాటు చేసినా ఫలితం రాలేదని భావిస్తున్నారు.

సీనియర్లను కాపాడుకునేందుకే ఏఐసీసీ ప్రాధాన్యత ఇస్తుందని అంచనా వేసుకున్నా.. దిగ్విజయ్​ టూర్‌లో అలాంటిదేమీ లేదనే పరిస్థితి కనిపించింది. అయితే, ఇప్పటిదాకా బహిరంగంగా బయటకు వచ్చి, సీనియర్లంతా సమావేశమయ్యే పరిస్థితి ఉండగా, ఇప్పుడు దానికి దిగ్విజయ్​బ్రేక్​వేశారు. సైలెంట్‌గా ఉండాలని, అంతర్గత గొడవలను బయటకు రాకుండా చూసుకోవాలంటూ సీనియర్లకు చెప్పారు. అంతేకాకుండా రాష్ట్ర పార్టీలోని గొడవలపై పదేపదే ఢిల్లీకి వచ్చి ఫిర్యాదులు చేయరాదంటూ సూచించారు. దీంతో సేవ్ కాంగ్రెస్​ పేరుతో తిరుగుబాటు చేసిన ఫలితం రాకుండా పోయింది. ఇప్పుడు బహిరంగంగా కూడా మాట్లాడే చాన్స్​ కూడా లేదు.

జిల్లాల నుంచి కంప్లైంట్స్..

​టీపీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డిపై సీనియర్ల బృందం మరో స్కెచ్​వేస్తోంది. దిగ్విజయ్​ రాష్ట్రానికి వచ్చినా.. జిల్లా పార్టీ నేతలు, అధ్యక్షులతో సమావేశాలకు సమయం ఇవ్వలేదు. దీంతో వారందరితో హైకమాండ్‌కు ఫిర్యాదులు చేయించే ప్లాన్​వేశారు. దిగ్విజయ్‌తో పాటుగా కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ నేతలకు జిల్లాల నేతల నుంచి ఫిర్యాదులు పంపిస్తున్నారు. మెయిల్ ద్వారా ఫిర్యాదు పత్రాలను పంపిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో టీపీసీసీ చీఫ్‌పై కిందిస్థాయి నుంచి వ్యతిరేకత ఉందనే అంశాన్ని పార్టీ పెద్దలకు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఏఐసీసీ నుంచి ఏమోస్తోంది..

ప్రస్తుతం సంక్షోభాన్ని నివారించే చర్యలేమీ దిగ్విజయ్​వెల్లడించలేదు. అందరితో మాట్లాడి ఓ నివేదికను పట్టుకుని వెళ్లిపోయారు. అయితే, రేవంత్‌ను టార్గెట్ చేయకుండా.. కొంత డైవర్ట్​చేసి మాణిక్కం ఠాగూర్‌పై ఒత్తిడి పెంచే విధంగా రిపోర్ట్​ఉందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్​మాణిక్కం ఠాగూర్‌ను కొనసాగిస్తారా.. అనేదానిపైనా కొంత ఆశలు పెట్టుకున్నారు. ఒకవేళ ఠాగూర్‌ను తొలగించి, మరో నేతకు రాష్ట్ర వ్యవహారాల బాధ్యతలను అప్పగిస్తే.. సీనియర్ల నినాదం కొంతైనా నెగ్గిందనే సంబురంలో ఉంటారని దిగ్విజయ్​ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఏఐసీసీ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందనే ఉత్కంఠ పార్టీ సీనియర్లలో ఉంది. మరోవైపు ఏఐసీసీ చీఫ్​మల్లికార్జున ఖర్గే నుంచి రేవంత్‌కు వ్యతిరేకంగా.. సీనియర్లకు అనుకూలంగా ఏదైనా నిర్ణయం వస్తుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఖర్గేకు, రేవంత్‌కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉండటంతో.. ఢిల్లీ నుంచి రేవంత్‌ను కాపాడే ప్రయత్నాలు జరుగుతాయని కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీనియర్లు కొంత మాట మారుస్తున్నారు. రేవంత్‌ను టీపీసీసీ చీఫ్​పదవి నుంచి తొలగించాలని తమ డిమాండ్​కాదని, అందరినీ కలుపుకునిపోవాలని, ఏకపక్ష నిర్ణయాలు వద్దనేదే తమ డిమాండ్​అని దిగ్విజయ్​ముందు చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పటికే సీనియర్లకు, రేవంత్‌కు మధ్య చాలా గ్యాప్​ వచ్చింది. దీంతో వీరి మధ్య సయోధ్య సాధ్యమేనా అనే ప్రశ్నలు కూడా ఉత్ఫన్నమవుతున్నాయి.

Also Read..

ఆ నేతలను 'చే'జార్చుకోవద్దు.. T- BJP నేతలకు హైకమాండ్ కీలక ఆదేశాలు..!!

Advertisement

Next Story