తన వద్ద పని చేసే వ్యక్తి మోసం చేశాడని సెల్ఫీ సూసైడ్

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-31 08:44:57.0  )
తన వద్ద పని చేసే వ్యక్తి మోసం చేశాడని సెల్ఫీ సూసైడ్
X

దిశ, కోరుట్ల : సెల్ఫీ సూసైడ్ కలకలం రేపింది. తన వద్ద పని చేసే వ్యక్తి నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తూ జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణానికి చెందిన సబ్బాని నరేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయేముందు సెల్ఫీ వీడియో తీశాడు. ఆత్మహత్యకు గల కారణాలను వివరించాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మెట్‌పల్లి పట్టణానికి చెందిన సబ్బాని నరేష్ కథలాపూర్ మండల కేంద్రంలో శ్రీ రాజా రాజేశ్వర హీరో బైక్ షోరూం ప్రారంభించాడు.

నెలసరి స్కీములు ప్రారంభించి వందలాది మంది సభ్యులను ఇందులో చేర్చి వారి నుండీ మొదటి నెల రూ 2900, మరుసటి నెల నుండీ ప్రతి నెల 2600 తీసుకునే వారు. ఇందుకోసం అతని వద్ద షోరూం మేనేజర్‌గా గోనె ప్రతాప్‌ను నియమించి స్కీములు నడిపిస్తున్నారు. స్కీంలో బైక్ వచ్చిన వ్యక్తి మళ్ళీ స్కీమ్ చెల్లించనవసరం లేదు. స్కీమ్ మొత్తం చెల్లించిన బైక్ రాని వారికి రూ.76000 చెల్లించాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలా నడుస్తున్న క్రమంలో వ్యాపారంలో నష్టం ఏర్పడింది. దీంతో సభ్యులు తాము చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో నెల రోజుల నుండీ నరేష్ పరారీలో ఉన్నాడు. బాధితులు పోలీస్ స్టేషన్లో పిర్యాదు కూడా చేసినట్టు సమాచారం. కాగా నమ్మిన వ్యక్తి తనను మోసం చేసాడని నరేష్ సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వ్యక్తం చేశాడు. లక్కీ డ్రా ద్వారా బైకులు ఇచ్చే ప్రక్రియలో భాగంగా అందరి వద్ద డబ్బులు వసూలు చేసిన ప్రతాప్ ఎవరికి వాహనాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు బైక్ షోరూం లు తనకు ఉన్నప్పటికీ తాను నష్టపోవడంతో బైక్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని, తన వద్ద పని చేసేప్రతాప్ మోసం చేశాడంటూ సెల్ఫీ వీడియోలో నరేష్ తెలిపారు.

తన పేరిట షో రూమ్ నిర్వహిస్తున్నప్పటికీ బ్యాంక్ అకౌంట్ మాత్రం ప్రతాప్ పేరిట ఉండటంతో లావాదేవీలు అన్ని ప్రతాప్ పేరిట జరిగాయని తెలిపాడు . ప్రతాప్ వద్ద కోటి 90 లక్షలు ఉన్నాయని, అతను స్కీం నిర్వహిస్తున్నందున అందులో ఎంతమంది జాయిన్ అయ్యారు... వాహనాలు ఎంతమందికి ఇచ్చారనే విషయం తనకు తెలియదని, అనవసరంగా తనపై ఆరోపణ చేస్తున్నారని, దీంతో మనస్థాపానికి గురై నమ్మిన వ్యక్తి తనను మోసం చేయాడంతో ఆత్మహత్య కు పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియోలో నరేష్ తెలిపాడు. స్థానికంగా ఈ సంఘటన సంచలనంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed