- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెల్ఫ్ డబ్బా..! ఐదేళ్ల నుంచి చంద్రబాబు తీరు ఇదే
ఐదేళ్ల నుంచి వైఎస్ జగన్‌ను ముందు పెట్టి కేంద్ర సర్కారు సాగించిన అరాచక పాలనపై ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు ఏనాడూ నోరు మెదపలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక పథకాల్లో లోపాలున్నాయి. లబ్దిదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ల సమస్యలపై ఏనాడూ స్పందించలేదు. వలంటీర్ల దగ్గర నుంచి మహిళలకు నగదు బదిలీ, గృహ నిర్మాణం దాకా దేనిపైనా ప్రతిపక్షనేతగా నిర్మాణాత్మక పాత్ర పోషించ లేదు. అధికారాన్ని కోల్పోయామనే ఉక్రోషం.. లేదంటే తన గొప్పదనాన్ని చాటుతూ స్వోత్కర్షకే పరిమితమయ్యారు. ప్రజా మద్దతు పెంచుకోలేక రాష్ట్రానికి దగా చేసిన పార్టీలతో పొత్తుకు పాకులాడినా ప్రజల్లో అంతగా మైలేజీ పెరగలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
దిశ, ఏపీ బ్యూరో: అధికార పార్టీ కార్యకర్తలే వలంటీర్లుగా చేరారు. కేవలం ఐదు వేల వేతనంతో ఎలా బతకాలంటూ వలంటీర్లు రోడ్డెక్కినప్పుడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు స్పందించలేదు. చివరకు వాళ్లను సంఘ విద్రోహ శక్తులుగా ఆరోపించారు. ప్రభుత్వంపై అసహనంతో ఉన్న వలంటీర్లను అధికార పార్టీ దగ్గరకు చేర్చారు. వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీకి ఫిర్యాదు చేస్తే.. వాళ్లు ఏకంగా రాజీనామాలు చేసి వైసీపీ కార్యకర్తలుగా పని చేస్తున్నారు. వలంటీర్లు పింఛన్లు పంచడానికి వీల్లేదంటే లక్షలాది మంది అభ్యాగ్యులు ఆక్రోశించారు. మీ రాజకీయాలకు మమ్మల్ని ఇబ్బంది పెడతారా అంటూ వాపోయారు. ఇదో విఫలమైన టీడీపీ ఎత్తుగడ.
సెంటు స్థలంపైనా రాద్ధాంతం..
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు కేవలం సెంటు స్థలం ఇస్తుంటే అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లలో ఎలా బతకాలని చంద్రబాబు వాపోయారు. గొడ్డూగోదా పెట్టుకోవాలన్నా.. ఏదైనా చేతి వృత్తులు చేసుకోవాలన్నా సెంటు స్థలం ఎలా సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ప్రతిపక్షపార్టీగా టీడీపీ 26 లక్షల మంది పేదల మనో వేదనను కనీసంగా పట్టించుకోలేదు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ఏడాదిలో అసంపూర్తిగా నిర్మించిన 3 లక్షల టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వలేదనే ఉక్రోషానికే పరిమితమయ్యారు.
సమస్యలపై నిర్లక్ష్యం..
ఎస్సీ ఎస్టీ బీసీ, మైనార్టీ మహిళలకు చేయూత, కాపు నేస్తం, నేతన్న నేస్తంలాంటి పథకాలతో వైసీపీ నగదు బదిలీ పథకం చేపట్టింది. చేయూత కింద ఏడాదికోసారి ఇచ్చే రూ.18,750 నగదుతో ఉపాధి కల్పన ఎలా సాధ్యమని మహిళలు వాపోయారు. పెరిగిన ధరలతో కుటుంబ ఖర్చుకే పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసరా పథకం కింద ఇచ్చిన నగదుతోపాటు డ్వాక్రా మహిళలను కలిపి జగనన్న మార్టులను నెలకొల్పారు. ఇక్కడ అధికారుల అవినీతితో సరుకుల ధరలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఎవరూ వినియోగదారులు రావడం లేదు. ఆర్పీల మీద ఒత్తిడి తెచ్చి డ్వాక్రా మహిళలతో బలవంతంగా అధిక రేట్లకు సరకులను కొనిపిస్తున్నారు. ఈ సమస్యపై ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు స్పందించిన దాఖలాల్లేవు.
కొరవడిన పోరాట స్ఫూర్తి..
కౌలు రైతులను ఆదుకునేందుకంటూ వైసీపీ ప్రభుత్వం కొత్త కౌల్దారీ చట్టాన్ని తీసుకొచ్చింది. అందులో గుర్తింపు కార్డునివ్వాలంటే భూ యజమాని సంతకం తప్పనిసరి చేస్తూ చట్టం చేశారు. ఇది కౌలు రైతులను పెనం మీద నుంచి పొయ్యిలోకి తోసినట్లయింది. బ్యాంకుల నుంచి సంస్థాగత పంట రుణాలు అందక, ప్రభుత్వం అందించే రైతు భరోసా భూ యజమానులకే సింహభాగం పోతోంది. సున్నా వడ్డీ నుంచి ఇన్పుట్ సబ్సిడీతోపాటు పంట నష్టపరిహారం వాళ్లకే వర్తిస్తోంది. కొద్దో గొప్పో భూయజమానుల బినామీలుగా ఉన్న నకిలీ కౌల్దారులు మరికొంత తన్నుకుపోతుంటే కౌలు రైతులు బావురుమన్నారు. రాష్ట్రంలో సెంటు భూమిలేని 18 లక్షల మంది కౌలు రైతుల సమస్యపై ప్రతిపక్ష టీడీపీ చిత్తశుద్దితో పోరాడింది లేదు.
ఇంకెన్ని తప్పటడుగులు వేస్తారో..
ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నోరు విప్పితే సీఎం జగన్ అవినీతి మీద తప్ప మరో మాట వెలువడదు. గత ఎన్నికలకు ముందు జగన్ లక్ష కోట్లు అవినీతికి పాల్పడినట్లు ఏకంగా పుస్తకాలు ముద్రించారు. ప్రజలు పట్టించుకోకుండా వైసీపీకి భారీ ఆధిక్యతను కట్టబెట్టారు. ఈ ఐదేళ్ల నుంచి అధికారాన్ని కోల్పోయామనే ఉక్రోషాన్నే చంద్రబాబు ఎక్కువగా ప్రదర్శించారు. కాలం చెల్లిన కొన్ని మీడియా సంస్థలపై ఆధారపడడంతో బాబు స్వోత్కర్ష మరింత పెరిగింది. ఓటమికి దారితీసిన పరిస్థితులపై ఆత్మవిమర్శ చేసుకున్నట్లు లేదు. దీంతో ప్రజల మద్దతు కూడదీసుకోవడంలో అన్ని విధాలా విఫలమయ్యారు. చివరకు రాష్ట్రానికి దగా చేసిన పార్టీగా ముద్ర వేసుకున్న బీజేపీతోనూ చేతులు కలిపారు. జనసేనతో పొత్తు కుదుర్చుకున్నారు. ఈ పొత్తులతో ప్రజల్లో ఆశించిన మైలేజీ రాలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రానున్న నెల రోజుల్లో టీడీపీ ఇంకెన్ని సెల్ఫ్ గోల్స్ చేసుకుంటుందోనని వ్యాఖ్యానిస్తున్నారు.