రహస్య పత్రాలు లీక్.. ప్రగతిభవన్‌లో లీకు వీరులు

by Sathputhe Rajesh |   ( Updated:2022-03-12 23:00:51.0  )
రహస్య పత్రాలు లీక్.. ప్రగతిభవన్‌లో లీకు వీరులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గులాబీ బాస్​కు లీకు వీరుల బెడద తప్పడం లేదు. గతంలో ప్రతిపక్ష పార్టీలో కేసీఆర్​ వ్యవహరించిన తీరునే ఇప్పుడు ఆయా పార్టీలు కూడా అవలంభిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఉన్నతాధికారుల కదలికలపైనే సీఎం నిఘా పెట్టినట్లు అధికారవర్గాల్లో టాక్​. కొన్ని కీలకమైన ఫైళ్లు ప్రతిపక్షాల చేతికి చిక్కడమే దీనికి ప్రధాన కారణమంటున్నారు. రాజకీయంగా విధానపరమైన నిర్ణయాలు, సర్వేల వంటి అంశాలు కూడా విపక్ష నేతల దృష్టికి వెళ్తుడటంతో వాటిని కట్టడి చేసేందుకు గులాబీ అధినేత కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని శాఖల్లోని అధికారులు.. విపక్ష నేతలకు సహకరిస్తుండటంటో వారిని ప్రగతిభవన్​ వైపు రాకుండా బయటకు పంపించారు. త్వరలోనే మరికొంతమంది అధికారులు కూడా ప్రగతిభవన్​కు దూరమవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఎవరిస్తున్నారు?

ఇటీవలి కాలంలో అధికారిక సమాచారం బహిర్గతమవుతోంది. రహస్యంగా భావించే డాక్యుమెంట్ల జిరాక్స్​ పత్రాలు కూడా విపక్ష నేతలకు చిక్కుతున్నాయి. వాటిని మీడియాకు విడుదల చేస్తున్నారు. కాంగ్రెస్​, బీజేపీ నేతల చేతికి ఈ అధికారిక సమాచారం వెళ్తుండటంతో ఉన్నతాధికారుల్లో కూడా భయం నెలకొంది. ఇటీవల సింగరేణికి సంబంధించిన అంశాలతో పాటు భూముల వ్యవహారం, డ్రగ్స్​ కేసుల నివేదికల వంటి వాటిని కాంగ్రెస్​పక్షం కీలకమైన పత్రాలను బయటకు ఇచ్చింది. ఇరిగేషన్​కు సంబంధించిన కీలక అంశాలు, కొన్ని ప్రాజెక్టుల డీపీఆర్​ డిజిటల్​ కాపీలు గతంలో ఓ సీనియర్​ నేతకు ఇచ్చారనే కారణంగా ఓఎస్డీని తప్పించారనే ప్రచారం ఉంది. ఇప్పుడు కూడా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు కూడా బీజేపీ, కాంగ్రెస్​ నేతలకు ఇచ్చారనే అనుమానాలు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా కృష్ణా ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతి అంశాన్ని వెనువెంటనే దక్షిణ తెలంగాణ నేతలకు చేరవేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

మరోవైపు ఇటీవల ఐఏఎస్​లపై కూడా టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం, ఒక వర్గం ఐఏఎస్​లను టార్గెట్​ చేస్తూ వారిపై అవినీతి, ఆరోపణలపై విమర్శలు చేయడం, దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నట్లు చెప్పుకొస్తుండటంతో ప్రభుత్వ శాఖల్లో సహకారం అందిస్తున్నారని నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.

కీలకాంశాలు లీకు

అధికారిక సమాచారంతో పాటుగా రాజకీయపరమైన అంశాలు కూడా ప్రగతిభవన్​ నుంచి గంటల వ్యవధిలోనే ప్రతిపక్షాలుకు అందుతున్నాయని ఇటీవల కొంతమందిపై గులాబీ బాస్​ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే సమాచారం బయటకు ఇస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ, అధికారిక వర్గాల్లో చెప్పుకుంటున్నారు. గతంలోనూ ప్రగతిభవన్​ లో లీకు వీరులు ఉన్నారనే కారణంగా పలువురిని అటువైపు రాకుండా కట్టడి చేశారు. కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్నప్పటికీ.. ఇటీవల లీకులు పెరిగాయనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. టీఆర్​ఎస్​ వ్యూహకర్త అంశంలో చాలా ముందుగానే విపక్షాలకు చేరింది. కొన్ని సర్వేలకు సంబంధించిన కీలకమైన నివేదికలు కూడా విపక్ష నేతల చేతికి చిక్కినట్లు గులాబీ బాస్​కు చేరింది. కట్టుదిట్టమైన ప్రగతిభవన్​ నుంచి సమాచారం బయటకు వెళ్లడం పార్టీ నేతలకు ఇబ్బందులు తెచ్చి పెట్టినట్లవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రగతిభవన్​లో కొంతమందికి ఇప్పటికే పరిమితులు విధించినట్లు తెలిసిందే. తాజాగా అధికారులకు కూడా ఈ పరిమితులను అమలు చేస్తున్నట్లు సమాచారం. సంబంధిత శాఖల్లో తీసుకునే కీలకమైన నిర్ణయాలు, ప్రతిపాదనలను అత్యంత రహస్యంగా దాచి పెడుతున్నారంటున్నారు. అనుమానాలున్న కొంతమంది ఐఏఎస్​లకు కూడా ఇలాంటి అంశాలను దూరంగా పెడుతున్నారనే అభియోగాలు కూడా ఉన్నాయి. కొన్ని శాఖల్లో ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులకు తెలియకుండానే శాఖాపరమైన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారని, వాటి జీవోలు వెల్లడైన తర్వాతే అధికారులకు తెలుస్తున్నాయని చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఈ లీకులు ప్రమాదకరంగా మారుతుండటంతో సీఎం కేసీఆర్​ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిసింది. ప​లు అంశాలను రహస్యంగా పెడుతూ జాగ్రత్తలు తీసుకుంటున్నారని అధికారవర్గాల్లోనే చర్చగా మారింది.

Advertisement

Next Story