- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG Govt: హైదరాబాద్, సికింద్రాబాద్‌లో 144 సెక్షన్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర స్పెషల్ పోలీసులు(State Special Police) ఆందోళనలు నిర్వహిస్తుండడంతో ప్రభుత్వం ముఖ్యమంత్రి నివాసానికి కల్పించే భద్రతపై కీలక నిర్ణయం తీసుకున్నది. ఇంతకాలం స్పెషల్ పోలీసుల సెక్యూరిటీ కొనసాగింది. కానీ ఇప్పుడు అదే బెటాలియన్లకు చెందిన పోలీసులు నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు, ఆందోళనలు చేస్తుండడంతో వీరి స్థానంలో సాయుధ రిజర్వు (ఆర్మ్ డ్ రిజర్వు) బలగాలను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న స్పెషల్ పోలీసులను ముఖ్యమంత్రి నివాసానికి భద్రత కల్పించడంలోని ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది. వన్ స్టేట్ – వన్ పోలీస్ నినాదంతో గత కొన్ని రోజులుగా నిరసనలు చేపడుతున్న స్పెషల్ పోలీసులు, వారి కుటుంబ సభ్యులు సచివాలయం దగ్గర కూడా ధర్నా, ర్యాలీలకు ప్లాన్ చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. ప్రతీ రోజు ఇలాంటి యాక్టివిటీస్‌కు సచివాలయం వేదికగా మారుతుండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ పికెటింగ్‌లను, ప్రత్యేక పోస్టులను, అదనపు బలగాలను మోహరించి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.
దీనికి తోడు హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో రానున్న నెల రోజుల పాటు ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు, ఆందోళనలు జరగకుండా పోలీస్ యాక్టును అమలు చేయడంతో పాటు ఐపీసీలోని 144 సెక్షన్ (భారతీయ నాగరిక్ సురక్షాలోని సెక్షన్ 163)ను పకడ్బందీగా అమలు చేయనున్నట్లు ప్రజలకు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ప్లకార్డుల ప్రదర్శనతో పాటు నినాదాలు ఇవ్వడం, ఐదుగురి కంటే ఎక్కువగా గుమి కూడకుండా చూడడం, నిరసనగా జెండాలను (నలుపు రంగు) ప్రదర్శించడం, రోడ్లమీద మీటింగులు పెట్టి స్పీచ్‌లు ఇవ్వడం.. ఇలాంటివాటిని నిషేధిస్తూ సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీచేశారు. శాంతిభధ్రతలకు విఘాతం కలిగించే విధంగా ఇలాంటి చర్యలు జరుగుతున్నాయని భావించి ఈ నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు తెలిపారు. ధర్నాలు, నిరసనలు చేయడానికి ఇందిరాపార్కు దగ్గర ధర్నా చౌక్‌లో అవకాశముంటుందని, ఇక్కడ మినహా హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో ఉండదని స్పష్టం చేశారు. ఉల్లంఘనలకు పాల్పడి సచివాలయం సహా ఎక్కడ నిరసనలు తెలిపినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ ఆదేశాల నేపథ్యంలో సచివాలయం చుట్టూ భారీ స్థాయిలో పోలీసు బలగాలను సిటీ పోలీసు కమిషనర్ మోహరించారు. ప్రస్తుతం సచివాలయానికి సైతం స్పెషల్ పోలీసు భద్రతే కొనసాగుతున్న నేపథ్యంలో వారి కదలికలపైనా నిఘా ఉన్నట్లు పోలీసుల్లోనే చర్చలు మొదలయ్యాయి. ఆందోళనలు చేస్తున్న 39 మంది కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు పది మందిని సర్వీసు నుంచి డిస్మిస్ చేసిన నేపథ్యంలో ఈ నిరసనలకు మద్దతు పలికినట్లయితే తమ మీద కూడా వేటు పడుతుందనే అలజడి చాలామందిలో నెలకొన్నది. విధి నిర్వహణలో ఉన్నవారి మధ్య జరుగుతున్న చర్చలు, ఫోన్ ద్వారా పరస్పరం పంచుకుంటున్న అభిప్రాయాలు బైటకు లీక్ అవుతాయనే భయమూ వారిలో వ్యక్తమవుతున్నది. యూనిఫామ్ సర్వీసులో ఉంటూ డిసిప్లైన్‌ను ఉల్లంఘించి నిరసనలు చేపట్టడాన్ని డీజీపీ సీరియస్‌గా తీసుకున్నారు. నెల రోజుల పాటు నిషేధాజ్ఞలతో పరిస్థితి అదుపులోకి వస్తుందని భావిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు నవంబరు 28 తర్వాత సమీక్షించి తదనుగుణమైన నిర్ణయాన్ని తీసుకోనున్నారు. ఈ ఆంక్షలను కొనసాగించడమా?.. లేక తొలగించడమా?.. అనేది నెల రోజుల తర్వాత క్లారిటీ రానున్నది.