హిమాన్షు అన్న.. దయచేసి మా స్కూల్‌ను దత్తత తీసుకో (వీడియో)

by GSrikanth |   ( Updated:2023-10-10 11:37:52.0  )
హిమాన్షు అన్న.. దయచేసి మా స్కూల్‌ను దత్తత తీసుకో (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: ‘హిమాన్షు అన్న మా పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి పరచండి’ అంటూ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ముఖ్యమంత్రి మనవడు హిమాన్షుకు విజ్ఞప్తి చేశారు. "మన ఊరు - మన బడి" ద్వారా మా పాఠశాలను అభివృద్ధి చేస్తామంటూ ఇప్పటివరకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా కాలయాపన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదని శుక్రవారం హిమాయత్ నగర్, దత్త నగర్‌లోని పాఠశాల విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఇటీవల కేటీఆర్ తనయుడు హిమాన్షు రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి, గౌలిదొడ్డిలోని కేశవ్ నగర్‌లోని పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేసినట్లుగా, నగరం నడిబొడ్డున ఉన్న తమ పాఠశాలను సైతం దత్తత ద్వారా అభివృద్ధి చేయాలని విద్యార్థులు, బాల సంఘం, అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) సంయుక్తంగా హిమాన్షును డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ధర్మేంద్ర, బాల సంఘం హైదరాబాద్ జిల్లా కన్వీనర్ షేక్ మహమూద్‌లు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 వేల ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తూ విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. హిమాన్షుకి ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న దూర దృష్టి రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గు చేటన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ విద్యాసంస్థల సమస్యలపై సమీక్షలు జరపాలని, తక్షణమే నిధులను మంజూరు చేసి అభివృద్ధి పరచాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed