స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కార్ కసరత్తు.. అధికారులకు CM రేవంత్ కీలక ఆదేశాలు

by Satheesh |
స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కార్ కసరత్తు.. అధికారులకు CM రేవంత్ కీలక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విధానంపై దృష్టి పెట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లను పెంచడంపై నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సంబంధిత అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. స్థానిక సంస్థలకు తొందరగా ఎన్నికలు నిర్వహించడానికి రిజర్వేషన్ల అంశాన్ని ముందుగా కొలిక్కి తేవాల్సి ఉన్నదని, ఆలస్యమైతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైనా ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు. వీలైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికను రూపొందించాలన్నారు. సచివాలయంలో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో బీసీల రిజర్వేషన్ల పెంపు, కులగణన, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలు, ఇప్పటివరకు రాష్ట్రంలో జరిగిన పనులు తదితరాలపై సీఎం రేవంత్ రివ్యూ చేశారు. ఇకపైన అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

రాష్ట్రంలో పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో అమలు చేయాల్సిన రిజ‌ర్వేష‌న్ విధానం, పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు తదితరాలను వెల్లడించాల్సిందిగా అధికారుల‌కు సూచించారు. గ‌త పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో అనుస‌రించిన విధానం, రానున్న పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు స‌న్నద్ధమ‌వుతున్న తీరుపై సంబంధిత అధికారుల నుంచి వివరాలను తీసుకున్నారు. ఇప్పటికే కులగ‌ణ‌నకు ఆమోదం తెలిపినందున‌, దాని ఆధారంగా పంచాయ‌తీ ఎన్నికల‌ను నిర్వహిస్తే వచ్చే అనుకూల, ప్రతికూల పరిస్థితులు, అందుకు పట్టే స‌మ‌యం తదితరాలపై అధికారుల‌ను ప్రశ్నించారు. క‌ర్ణాట‌క‌లో 2015లో, బిహార్‌లో 2023లో కులగ‌ణ‌న జరిగిందని, ఆంధ్రప్రదేశ్‌లో ఆ ప్రక్రియ పూర్తయినా వివ‌రాలు ఇంకా అధికారికంగా రిలీజ్ కాలేదంటూ సీఎంకు అధికారులు వివ‌రించారు.

ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ‌లో జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల వ‌ర‌కు అనుసరించిన విధానాలను, వివిధ రాష్ట్రాల స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో బీసీ రిజ‌ర్వేష‌న్లపై సుప్రీంకోర్టులో దాఖ‌లైన కేసులు, వాటి తీర్పులు, ప‌ర్యవ‌సానాల‌ను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశానికి హాజరైన మాజీ మంత్రి జానారెడ్డి కూడా కొన్ని అంశాలను వివ‌రించారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో రిజర్వేష‌న్ల అమ‌లుపై ఇప్పటిదాకా అనుస‌రించిన విధానాల‌పై కాలక్రమ ప‌ట్టికను రూపొందించాల‌ని, సందేహాలుంటే జానారెడ్డితో పాటు పంచాయ‌తీరాజ్ శాఖ నిపుణులు, మాజీ ఉన్నతాధికారుల స‌ల‌హాలు తీసుకోవాల‌ని, చ‌ట్టప‌ర‌మైన విష‌యాల్లో అడ్వకేట్ జ‌న‌ర‌ల్‌తో చ‌ర్చించాల‌ని సంబంధిత అధికారులనకు సీఎం సూచించారు. ఇతర రాష్ట్రాలు రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో అనుస‌రిస్తున్న విధానాల‌పై అధ్‌య‌నం చేయాలన్నారు. ఈ అంశాల‌పై వీలైనంత తొందరగా నివేదికను రూపొందిస్తే శాస‌న‌స‌భ స‌మావేశాల‌కు ముందే మరోసారి స‌మావేశ‌మై తుది నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుందన్నారు.

డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్క, వైద్యారోగ్య మంత్రి దామోద‌ర రాజ‌న‌ర‌సింహ‌, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాక‌ర్‌, పంచాయ‌తీ రాజ్‌ శాఖ మంత్రి సీత‌క్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌, ముఖ్యమంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్లన్న, రాష్ట్ర బీసీ క‌మిష‌న్ ఛైర్మన్ వ‌కుళాభ‌రణం కృష్ణమోహ‌న్‌ రిజ‌ర్వేష‌న్ల పెంపు సాధ్యాసాధ్యాల‌పై అభిప్రాయాల‌ను వెల్లడించారు. ఈ స‌మావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యద‌ర్శి శేషాద్రి, ముఖ్యమంత్రి కార్యద‌ర్శి డాక్టర్ చంద్రశేఖ‌ర్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పంచాయ‌తీరాజ్ శాఖ కార్యద‌ర్శి లోకేష్ కుమార్‌, న్యాయశాఖ కార్యద‌ర్శి తిరుప‌తి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed